Begin typing your search above and press return to search.

బాబును బీజేపీ అంత ఈజీగా వ‌దిలిపెట్ట‌ద‌ట‌

By:  Tupaki Desk   |   11 Feb 2018 4:32 AM GMT
బాబును బీజేపీ అంత ఈజీగా వ‌దిలిపెట్ట‌ద‌ట‌
X
కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ మిత్ర‌ప‌క్షాలైన‌ బీజేపీ-టీడీపీల మ‌ధ్య ఉన్న పొరాపొచ్చాల‌ను బ‌హిరంగ ప‌ర్చిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా పార్ల‌మెంటు వేదిక‌గా రెండు పార్టీలు త‌మ మ‌ధ్య ఉన్న అనైక్య‌త‌ను వివిధ రూపాల్లో చాటుకున్నాయి. ప్ర‌ధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై టీడీపీ తీవ్ర‌మైన ఎదురుదాడి చేసింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ సైతం బాబును అదే రీతిలో టార్గెట్ చేయాల‌ని సిద్ధ‌మ‌వుతోంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు అంటూ ఏ రకంగా టీడీపీ గ‌ళం వినిపించిందో తాము సైతం అదే ఫార్ములాను అమ‌లు చేయాల‌ని భావిస్తోంది.

అయితే గ‌తంలో వ‌లే రాష్ట్రం కోసం ఏం చేశామ‌నేది ఏక‌రువు పెట్టి వ‌దిలివేయ‌కుండా... రాష్ట్రం కోసం తెలుగుదేశం స‌ర్కారు ఏం చేయాల్సి ఉందో వెల్ల‌డిస్తూ పోరాటం చేయాల‌ని డిసైడ్ అవుతోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. పార్లమెంటులో ఆందోళనతో కేంద్రాన్ని ఇబ్బందిపెడుతోన్న మిత్రపక్షమైన తెలుగుదేశం దారిలోనే తానూ నడవాలని భారతీయ జనతా పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ప్రధానంగా రాయలసీమలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించాలన్న డిమాండుతో అటు అసెంబ్లీ, ఇటు కౌన్సిల్‌లో ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. హంద్రీ-నీవా - గాలేరి-నగరి - కర్నూలు జిల్లాకు నీటి సరఫరా వంటి కీలక ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించేవరకూ ప్రభుత్వంపై ఉభయ సభల్లో ఒత్తిడి తీసుకురావాలని - ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకూ సభలో ఆందోళన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

బీజేపీకి చెందిన ఏపీ నాయకత్వం కేవలం కోస్తా - ఉత్తరాంధ్ర ప్రయోజనాలకే పనిచేస్తోందని - తమ ప్రజల సమస్యలను ప్రస్తావించడం లేదన్న ఫిర్యాదులు పార్టీ ఢిల్లీ నాయకత్వానికి చేసినట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే తమ పార్టీ నేతలు సీమ గురించి మాట్లాడుతున్నప్పటికీ - వాటిని పార్లమెంటులో టీడీపీ మాదిరిగా తమ పార్టీ కూడా అసెంబ్లీలో ఆందోళన చేసి సాధించాలన్న ఒత్తిళ్లు నాయకత్వంపై పెరుగుతుండటం వల్లే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సోమవారాన్ని ప్రతి వారం పోలవారంగా మార్చిన చంద్రబాబు, గాలేరి-నగరి - హంద్రీ-నీవా వంటి రాయలసీమ ప్రాజెక్టుల కోసం మంగళవారం - బుధవారంగా ఎందుకు మార్చడం లేదంటూ ఇప్పటికే బయట ప్రశ్నిస్తున్న బీజేపీ - బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీ-కౌన్సిల్‌ లో నిలదీయాలని భావిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ సీమ సమస్యలు - అక్కడ నిలిచిపోయిన పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పోలవరం మాదిరిగానే 2019 కల్లా పూర్తి చేయాలని డిమాండ్ చేయాలని భావిస్తోంది. కర్నూలు జిల్లా గుండ్రేవుల - వేదవతి ప్రాజెక్టును వచ్చే ఏడాదికల్లా పూర్తి చేయాలని, ఆ మేరకు బడ్జెట్‌ లో నిధులు కేటాయించాలని ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. తెలుగుగంగకు నిధులు లేవని - తుంగభద్ర కుడి-ఎడమ కాల్వల ఆధునీకరణ - హంద్రీ-నీవా ప్రాజెక్టు ఫేజ్ 1 - 2 పూర్తి కాకుండానే 3వ ఫేజ్ పనులు మొదలుపెట్టడంతోపాటు - పేజ్ 1కు రైడనింగ్ పనులు చేపట్టడం - శ్రీశైలం బ్యాక్ వాటర్ వినియోగంలో అన్యాయంపై ప్రస్తావించనుంది. అదేవిధంగా వైద్య - సాగునీటి - పంచాయితీరాజ్ - ఐటి - గృహనిర్మాణ - ఆర్ అండ్ బీ- రెవిన్యూ - మునిసిపల్ శాఖలపై దృష్టి సారించాలని నిర్ణయించినట్లు సమాచారం.

వీటితో పాటుగా జీఎస్టీ వచ్చిన తర్వాత కేంద్రాన్ని అప్రతిష్ఠపాలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వ్యాపారులపై జరిమానాల పేరుతో వేధింపులకు పాల్పడుతున్న వైనాన్నీ ప్రస్తావించనుంది. ఆయా శాఖల్లో జరుగుతున్న పనులు, కేంద్రం ఇచ్చిన నిధులతో నడుస్తున్న ప్రాజెక్టుల పురోగతి - రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ప్రాజెక్టుల పనితీరు - వాటికి కేటాయిస్తున్న నిధులను ప్రస్తావిస్తూ ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేయనుంది. సీమ ప్రాజెక్టులకు అధిక నిధులు - సీమలో హైకోర్టు నిర్మాణం - వికేంద్రీకరణలో ప్రాధాన్యం వంటి అంశాలను సీమ ప్రజలు తమ ఆత్మగౌరవ సమస్యగా భావిస్తున్న నేప‌థ్యంలో బీజేపీ స్కెచ్ బాబును ఇరకాటంలో ప‌డేసేద‌ని అంటున్నారు.