Begin typing your search above and press return to search.

డ్యామేజ్ కంట్రోలు చేసుకుంటున్న బీజేపీ?

By:  Tupaki Desk   |   26 Nov 2020 6:00 PM GMT
డ్యామేజ్ కంట్రోలు చేసుకుంటున్న బీజేపీ?
X
ఆచరణ సాధ్యంకాని నోటికొచ్చిన హామీలు ఇచ్చేస్తే జనాలు నవ్వుకుంటారన్న విషయం తాజాగా నిరూపణయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచేయాలన్న ఆతృతలో బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ నోటికొచ్చిన హామీలను ఇచ్చేశారు. దాంతో జనాలంతా తెగ నవ్వుకుంటున్నారు.

ఇదే విషయం జాతీయ మీడియాలో కూడా ప్రముఖంగా రావటంతో ఇపుడు దాన్ని దిద్దుకుంటున్నారు. ఎందుకంటే జాతీయ స్ధాయిలోని అగ్రనేతల నుండి అక్షింతలు పడ్డాయో ఏమో. ఇంతకీ విషయం ఏమిటంటే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ట్రాఫిక్కుల ఉల్లంఘనలకు కట్టాల్సిన జరిమానాను జీహెచ్ఎంసినే చెల్లిస్తుందని ఓ హామీ ఇచ్చారు. ఇదేలా సాధ్యమో కూడా బండి ఆలోచించలేదు.

ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తే రోడ్డుపైనే అక్కడిక్కడ ఎవరైనా కట్టేయాలి. లేకపోతే ఓ యాప్ ద్వారా అయినా చెల్లించాలి. ఎవరికో ట్రాఫిక్ పోలసులు జరిమానా విధిస్తే జీహెచ్ఎంసి ఎందుకు చెల్లించాలనే కనీస ఇంగితం బండికి లేకపోయినా జనాలకు వచ్చింది. అలాటే భారీ వర్షాలకు కొట్టుకుపోయిన బండ్ల స్ధానంలో జీహెచ్ఎంసి కొనిస్తుందనేది మరో హామీ. ఇటువంటి హామీలు ఆచరణలోకి వచ్చేది లేదు పెట్టేది లేదు. ఏదో ఓట్లకోసమని బండి నోటికొచ్చినన్ని హామీలు ఇచ్చేశారు.

బండి హామీలను చూసి జనాలు తెగ నవ్వుకున్నారు. దాంతో ఈ విషయంపై జాతీయ మీడియా దృష్టిపెట్టి బాగా హైలైట్ చేసింది. దాంతో విషయం తెలుసుకున్న అగ్రనేతలు బండితో మాట్లాడి చివాట్లు పెట్టినట్లున్నారు. అందుకనే ఆ హామీలను ఉపసంహరించుకున్నారు. అలాగే జీహెచ్ఎంసి పరిధిలోని అందరికీ కోవిడ్-19 టీకాను ఉచితంగా వేయిస్తామనే హామీ కూడా ఇచ్చేశారు. చివరకు జీహెచ్ఎంసి పరిధిలో ప్రయాణం చేసే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం హామీపైన కూడా జనాలు నవ్వుకుంటున్నారు.