Begin typing your search above and press return to search.

ప్రకాష్ రాజ్ వల్ల బీజేపీ బయటపడుతుందా?

By:  Tupaki Desk   |   17 April 2019 7:14 AM GMT
ప్రకాష్ రాజ్ వల్ల బీజేపీ బయటపడుతుందా?
X
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఓడించడమే లక్ష్యంగా జత కట్టిన కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కు కర్ణాటక రాజధాని బెంగళూరు సవాల్‌గా మారింది. బెంగళూరు పరిధిలోని సెంట్రల్ - ఉత్తర - దక్షిణ పార్లమెంట్‌ స్థానాలు గత 2014 ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్‌ – జేడీఎస్‌ జత కట్టినా ఫలితం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. దీనికి తోడు కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమిలో రెండు పార్టీల నాయకుల మధ్య సయోధ్య లేకపోవడం కూడా బీజేపీకి కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమిలో భాగంగా 21 – 7 ప్రకారం సీట్లు పంచుకున్నారు. ఇందులో భాగంగా బెంగళూరు మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులే బరిలో దిగారు.

బెంగళూరు సెంట్రల్ - ఉత్తర - దక్షిణ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 13 - బీజేపీ 9 - జేడీఎస్‌ రెండు స్థానాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈక్రమంలో కూటమికి ఎక్కువ ఓట్లు పడుతాయని భావిస్తున్నారు. కానీ బెంగళూరు ఓటర్లు గత 2014 ఎన్నికల్లో ఈ మూడు నియోజకవర్గాల్లో బీజేపీకే పట్టం కట్టారు. అసెంబ్లీ - పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటర్లు దృష్టి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి కూడా కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమికి ఈ మూడు స్థానాలు సవాల్‌ గా మారాయి.

2008 నియోజకవర్గాల పునర్‌ విభజనలో భాగంగా ఏర్పడిన బెంగళూరు సెంట్రల్‌ లో గత రెండు పర్యాయాల్లో బీజేపీ విజయం సాధించింది. 2009 - 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్‌ గెలిచారు. గత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగిన రిజ్వాన్‌ అర్షద్‌ 1.37 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా ప్రస్తుత ఎన్నికల్లో కూడా వీరిద్దరే పోటీలో ఉన్నారు. అయితే బహుభాషా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మైనార్టీ ఓట్లకు ప్రకాశ్‌ రాజ్‌ చెక్‌ పెడుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్‌ లో మరోసారి బీజేపీ గెలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

గత 1989 లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఆర్‌.గుండూరావు గెలిచారు. అదే అక్కడ కాంగ్రెస్‌ కు చివరి విజయం. బీజేపీ సీనియర్‌ నాయకులు - ఇటీవల కాలంలో మరణించిన అనంతకుమార్‌ వరుసగా ఆరు పర్యాయాలు బెంగళూరు దక్షిణ లోక్‌ సభ స్థానం నుంచి విజయం సాధించారు. అయితే అనారోగ్యం కారణంగా ఆయన ఇటీవల తుదిశ్వాస విడిచారు. అనంతకుమార్‌ స్థానంలో ఆయన సతీమణి తేజస్విణికి టికెట్‌ ఇస్తారని ప్రచారం సాగినా.. చివరికి ఆర్‌ ఎస్‌ ఎస్‌ నేపథ్యం ఉన్న తేజస్వి సూర్యను బరిలో దింపారు. కాంగ్రెస్‌ తరఫున బీకే హరిప్రసాద్‌ పోటీ చేస్తున్నారు. గత 1991 నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రతిసారీ మారుస్తున్నా ఫలితం లేకుండా పోయింది.

1951 నుంచి జరిగిన ఎన్నికల్లో బెంగళూరు ఉత్తర స్థానం నుంచి పదిసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్‌ విజయాల్లో కేంద్ర మాజీ మంత్రి సీకే జాఫర్‌ ఏడుసార్లు గెలవడం విశేషం. అదేవిధంగా జనతాదళ్‌ ఒకసారి విజయం సాధించింది. అయితే గత మూడు పర్యాయాలుగా బీజేపీ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. 2004లో హెచ్‌ టీ సంగ్లియానా - 2009లో డీబీ చంద్రేగౌడ - 2014లో డీవీ సదానందగౌడ బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే బీజేపీ తరఫున సిట్టింగ్‌ ఎంపీ డీవీ సదానందగౌడ - కాంగ్రెస్‌ నుంచి రాష్ట్ర మంత్రి కృష్ణ బైరే గౌడ పోటీ చేస్తున్నారు.