Begin typing your search above and press return to search.

గుజ‌రాత్ లో ఓట‌మి త‌థ్య‌మ‌న్న బీజేపీ ఎంపీ

By:  Tupaki Desk   |   17 Dec 2017 4:44 AM GMT
గుజ‌రాత్ లో ఓట‌మి త‌థ్య‌మ‌న్న బీజేపీ ఎంపీ
X
ఊరంతా ఒక దారి అంటే.. ఉలిపిక‌ట్ట‌ది మ‌రో దారి అన్న సామెతకు త‌గ్గ‌ట్లే.. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో అధికార బీజేపీకి విజ‌యం త‌థ్య‌మ‌ని ప్ర‌తి మీడియా సంస్థ నొక్కివ‌క్కాణిస్తున్న వేళ‌.. అంద‌రి అంచ‌నాల‌కు భిన్న‌మైన వ్యాఖ్య‌లు చేసి సంచ‌ల‌నంగా మారారు బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ ఒక‌రు.

మ‌హారాష్ట్ర బిజినెస్ మ్యాన్‌ గా అంద‌రికి తెలిసిన సంజ‌య్ కాక‌డే నోటి నుంచి షాకింగ్ వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ భారీ విజ‌యంసాధించ‌టం ప‌క్క‌న పెడితే.. త‌మ పార్టీకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత అధిక్య‌త కూడా రాద‌న్న మాట‌ను ఆయ‌న చెబుతున్నారు.

రాజ్య‌స‌భ‌కు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఈ ఎంపీ తాను సొంతంగా గుజ‌రాత్ రాష్ట్రంలో స‌ర్వే చేయించిన‌ట్లుగా చెబుతున్నారు. త‌న‌కు అందిన స‌ర్వే ఫ‌లితాల్ని చూస్తే.. గుజ‌రాత్ లో బీజేపీకి ఓట‌మి త‌థ్య‌మ‌న్నారు. ఓట‌మి అన్న మాట‌ను ఊరికే చెప్పి వ‌దిలేయ‌కుండా.. ఎందుకిలా అన్న విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బీజేపీ ఉప‌యోగించిన మ‌త‌త‌త్వ‌మే మోడీ అండ్ కోకు షాకింగ్ గా మార‌నుంద‌ని చెప్పారు.

తాను చేయించిన స‌ర్వేలో 75 శాతం మంది కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా ఉన్న‌ట్లుగా నిలిచిన‌ట్లు తేలింద‌న్నారు. గుజ‌రాత్ లో తొలిసారిగా ద‌ళితులు.. ఒబీసీలు.. ముస్లింలు.. ప‌టేల్ సామాజిక వ‌ర్గం మొత్తం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత గుజ‌రాత్ రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై మోడీ దృష్టిపెట్ట‌క‌పోవ‌టం కూడా ఓట‌మికి మ‌రో కార‌ణంగా మారుతుంద‌ని చెబుతున్నారు. ఊహించిన రీతిలో బీజేపీ ఎంపీ నోటి నుంచి వ‌చ్చిన వ్యాఖ్య‌లు క‌మ‌ల‌నాథుల‌కు కొత్త కంగారుగా మారాయి.