Begin typing your search above and press return to search.

కేర‌ళ‌లో బీజేపీ వ‌జ్రాయుధం`శ‌బ‌రిమ‌ల‌`!

By:  Tupaki Desk   |   18 Oct 2018 6:06 PM GMT
కేర‌ళ‌లో బీజేపీ వ‌జ్రాయుధం`శ‌బ‌రిమ‌ల‌`!
X
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళా భక్తులను అనుమతించాల‌న్న సుప్రీం కోర్టు తీర్పుపై ప‌లు హిందూ సంఘాలు మండిప‌డుతోన్న సంగ‌తి త‌లెఇసిందే. ఈ క్ర‌మంలోనే బుధ‌వారం నాడు ఆల‌యంలోకి మ‌హిళా భ‌క్తుల ప్ర‌వేశాన్ని అడ్డుకొనేందుకు భక్తులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో, గురువారం నాడు కేర‌ళ‌లో బంద్ నిర్వ‌హించారు. ఆ ఆందోళ‌న‌ల‌పై ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పందించారు. శ‌బ‌రిమ‌ల‌లోకి మ‌హిళ‌లు వెళ్లకూడద‌ని సమాజం, మహిళలు ఎంతోకాలంగా ఆచారాన్ని పాటిస్తున్నార‌ని అన్నారు. హిందూ సంప్రదాయాలను పట్టించుకోకుండానే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. తీర్పునిచ్చే ముందు మతపెద్దల అభిప్రాయాలను, కోట్లాదిమంది భక్తుల విశ్వాసాలను సుప్రీం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. శ‌బ‌రిమ‌ల‌లోకి మ‌హిళ‌ల ప్ర‌వేశంపై సుప్రీంకోర్టు తీర్పు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతోపాటు, అయోధ్యలో రామమందిరాన్ని వెంటనే నిర్మించాలని, అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

ఈ మొత్తం వ్య‌వ‌హారం చూస్తుంటే...కేర‌ళ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల‌నాటికి పాగా వేయాల‌ని బీజేపీ, ఆరెస్సెస్ ప్ర‌య‌త్నిస్తున్నట్లు అనిపిస్తోందని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. శ‌బ‌రిమ‌ల వ్య‌వ‌హారం....కేరళ రాజకీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంద‌ని,...రాబోయే ఎన్నిక‌ల‌లో ఈ విష‌యం కీల‌కం కానుంద‌ని అనుకుంటున్నారు. శ‌బ‌రిమ‌ల అంశాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. అందుకే, ఇటువంటి సంచ‌ల‌న తీర్పు విష‌యంలో కేంద్రం వ్యూహాత్మ‌క మౌనం పాటించింది. మరో త్రిపురగా కేర‌ళ‌ను మార్చేందుకు శ‌బ‌రిమ‌ల ఓ ఆయుధంగా మారింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. క‌మ్యూనిస్టుల కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టేందుకు బీజేపీ...ఈ సున్నిత‌మైన అంశాన్ని వాడుకోనుంద‌రి అనుకుంటున్నారు. కేర‌ళ‌లో బీజేపీ పాగా వేసేందుకు ఆరెస్సెస్ కూడా ఉడ‌తా భ‌క్తిగా సాయం చేస్తోంది. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో వామ‌ప‌క్షాల‌కు, బీజేపీ, ఆరెస్సెస్ కార్య‌క‌ర్త‌ల‌కు పచ్చ‌గ‌డ్డేస్తే భ‌గ్గుమంటోన్న సంగ‌తి తెలిసిందే.

వాస్త‌వానికి బీజేపీకి హిందూ ఓటు బ్యాంకు అధికంగా ఉందన్న సంగ‌తి తెలిసిందే. దీంతో, 2021లో జ‌ర‌గ‌బోతోన్న ఎన్నిక‌ల‌లో ఆ బ్యాంకునే బీజేపీ టార్గెట్ చేసింది. ఆ ఓట‌ర్ల‌ను త‌మ‌వైపున‌కు పూర్తిగా తిప్పుకొని అక్క‌డి140 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సాధించాల‌ని ఆ పార్టీ కోరుకుంటోంది.తాజాగా శబరిమల అంశం వారికి వ‌జ్రాయుధంలా మారింది. బీజేపీ మ‌ద్ద‌తుదారులే కాకుండా....హిందువులంతా శబరిమల విషయంలో కోర్టు తీర్పును, కేరళ ప్రభుత్వం ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌లు.....కోర్టులు తీర్పులిచ్చినా, ప్రభుత్వాలు అనుమ‌తిచ్చినా తాము 50 ఏళ్లు దాటిన త‌ర్వాతే శబరిమలకు వెళ్తామని చెబుతున్నారు. దీంతో, శ‌బ‌రిమ‌ల పరిణామాలను త‌మ‌కు అనుకూలంగా మలచుకుని కేర‌ళ‌లో చ‌క్రం తిప్పేందుకు బీజేపీ, ఆరెస్సెస్ లు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.