Begin typing your search above and press return to search.

బాబుది నేషనల్ సక్సెస్, లోకల్ ఫెయిల్యూర్

By:  Tupaki Desk   |   9 Oct 2015 9:34 AM GMT
బాబుది నేషనల్ సక్సెస్, లోకల్ ఫెయిల్యూర్
X
ఎల్.కె.అద్వానీ.. బీజేపీలో అగ్రనేత... దేశాన్ని ఒక ఊపు ఊపిన నేత. మరి సోము వీర్రాజు?
సుష్మాస్వరాజ్... బీజేపీ మహిళా నేతల్లో అగ్రగామి.. మరి పురంధేశ్వరి?
నరేంద్ర మోడీ... బీజేపీని తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి తెచ్చిన నేత... మరి కావూరి సాంబశివరావు?
వెంకయ్యనాయుడు... బీజేపీ అగ్రనాయకత్వంలో ఒకరు... జాతీయ అధ్యక్షుడిగానూ పనిచేశారు.. మరి పైడికొండల మాణిక్యాలరావో...?

.... అంతా బీజేపీ నేతలే... కానీ, వారికి వీరికీ ఎంతో తేడా. బీజేపీ అగ్రనేతలైన అద్వానీ - సుష్మ - మోడీ - వెంకయ్య వంటివారంతా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. చంద్రబాబుతో కలిసి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసినవారు. బీజేపీ - టీడీపీ కలిసి ప్రభుత్వాలు ఏర్పరరచడానికి పనిచేసినవారు. వారంతా చంద్రబాబు ఎంతో విలువిస్తారు. ప్రాధాన్యిమిస్తారు. కానీ... అదే బీజేపీలో నిన్నమొన్నటివరకు ఊరూపేరు లేనివారు... కాంగ్రెస్ కుదేలవడంతో గత్యంతరం లేక బీజేపీలో చేరినవారు మాత్రం చంద్రబాబుపై నిప్పులు చెరిగేస్తున్నారు. రోజూ ఏదో ఒక వంకతో విమర్శలు చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా చేర్చుకున్నందుకు బీజేపీకి చెందిన పైడికొండల మాణిక్యాలరావుకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. కానీ, ప్రతిరోజూ చంద్రబాబుపై మండిపడుతూనే ఉంటారు. ఇక ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు చంద్రబాబు మద్దతుతోనే ఆ పదవి వచ్చింది ఆయనా మాట్లాడితే చాలు చంద్రబాబుపై కారాలు మిరియాలు నూరుతారు. ఏపీలో పథకాలన్నీ కేంద్రానివే అంటారు. లేదంటే తమ సపోర్టు లేకపోతే చంద్రబాబు గవర్నమెంటు పడిపోతుంది అన్నట్లుగా మాట్లాడుతారు.

..ఇక పురంధేశ్వరి విషయానికొస్తే చంద్రబాబుపై మొదటినుంచీ ఆమెకు వ్యతిరేకతే. కాంగ్రెస్ పని అయిపోవడంతో బీజేపీలో చేరి ఓడిపోయిన ఆమె ఆ పార్టీలోనూ ఏపీలో ఇంకెవరూ లేకపోవడంతో పార్టీ పదవి మంచిదే దక్కించుకున్నారు. కేంద్రానికి చంద్రబాబు ప్రభుత్వం వివరాలు ఇవ్వకపోవడం వల్లే నిధులు రాలేదంటూ ఆమె నెపమంతా చంద్రబాబుపై నెడుతుంటారు. కేంద్రాన్ని డిమాండు చేసి నిధులు సాధించడంలో సహకరించాల్సిన ఆమె అందుకు భిన్నంగా కేంద్రానికి వత్తాసు పలుకుతూ రాజకీయం కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు.

కావూరి సాంబశివరావు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడిపోయారు. ఆయన కూడా కాంగ్రెస్ లో ఉంటే మనకు పనులు కావు,.. కాంట్రాక్టులు రావు అని తెలుసుకుని బీజేపీలో చేరిపోయారు. అవసరాల కోసం చేరిన కావూరి కామ్ గా ఊరుకోకుండా చంద్రబాబును విమర్శిస్తుంటారు.

..ఈ రకంగా ఈ నలుగురు బీజేపీ నాయకులూ నిత్యం చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అదేసమయంలో బీజేపీ అగ్రనాయకత్వం కూడా చంద్రబాబుతో ఎంతో మంచిగా ఉంటుంది... ఆయనకు గౌరవం ఇస్తుంది. ఎటొచ్చీ బీజేపీలో పిల్లకాకులు.. వెనుకొచ్చిన కొమ్ములు మాత్రం మిడిసిపడుతున్నాయి. చంద్రబాబు చలవతో పదవులు అందుకున్న బీజేపీ నేతలే ఆయనపై రాళ్లు విసురుతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు మాత్రం మిత్రపక్షం అన్న ఒక్క కారణంతో సైలెంటుగాఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కేంద్రంతో ఉన్న అవసరాల దృష్ట్యా ఈ చిన్నచితకా బీజేపీ నాయకులను పట్టించుకోకుండా సాగిపోతున్నారు. చంద్రబాబే కనుక రాజకీయం మొదలుపెడితే వీరంతా ఏమవుతారో...!!!