Begin typing your search above and press return to search.

ప్ర‌భుత్వంతో ఉన్న స‌మ‌స్యే అది: బీజేపీ సీనియ‌ర్ కేంద్ర మంత్రి హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   24 Aug 2022 6:31 AM GMT
ప్ర‌భుత్వంతో ఉన్న స‌మ‌స్యే అది: బీజేపీ సీనియ‌ర్ కేంద్ర మంత్రి హాట్ కామెంట్స్
X
నితిన్ గ‌డ్క‌రీ.. మ‌హారాష్ట్ర‌లోని విద‌ర్బ ప్రాంతంలో బీజేపీలో కీల‌క నాయ‌కుడు. అందులోనూ రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఆర్ఎస్‌) కేంద్ర కార్యాల‌యం ఉన్న నాగ్‌పూర్‌కు చెందిన నేత‌. ఆర్ఎస్ఎస్‌తో అనుబంధ‌మూ ఎక్కువే. అయితే అన్ని పార్టీల నేత‌ల‌తోనూ ఆయ‌నకు స‌త్సంబంధాలు ఉన్నాయి. ప్ర‌ధాని ప‌ద‌వికి మొద‌ట్లో న‌రేంద్ర మోడీతోపాటు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్న నితిన్ గ‌డ్క‌రీ పేరు గ‌ట్టిగానే వినిపించింది.

అయితే ప్ర‌స్తుతం కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గ‌డ్క‌రీని అనూహ్యంగా కొద్దిరోజుల క్రితం బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు నుంచి తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. బీజేపీలో అత్యున్న‌త నిర్ణ‌యాలు తీసుకునేది.. బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు అనే విష‌యం తెలిసిందే. అలాంటిది బీజేపీలో మోడీ, అమిత్ షా త‌ర్వాత కాస్త గ‌ట్టిగా వినిపించే పేరున్న నితిన్ గ‌డ్క‌రీని బీజేపీ పార్ల‌మెంటరీ బోర్డు నుంచి తొల‌గించడం హాట్ టాపిక్‌గా మారింది.

కాగా నితిన్ గ‌డ్క‌రీకి ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడ‌తారనే పేరుంది. ముక్కుసూటిగా, దాప‌రికం లేకుండా మాట్లాడ‌తార‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో తాజాగా నితిన్ గ‌డ్క‌రీ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న వార్త‌ల్లో వ్య‌క్తిగా మారారు. ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడమే ప్రస్తుతమున్న సమస్య అంటూ ఆయ‌న‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

'మీరు అద్భుతాలు చేయగలరు. భారత మౌలిక సదుపాయాల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. అందుకు మనం సాంకేతికత, కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి. పరిశోధనల‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. నాణ్యతతో రాజీపడకూడ‌దు. ఖర్చు తగ్గించే ప్రత్యామ్నాయ ముడి పదార్థాలను వినియోగించ‌డంపై దృష్టి సారించాలి. మొత్తంగా నిర్మాణానికి సమయం అనేది అత్యంత కీలకం. అదే అతి పెద్ద పెట్టుబడి. అయితే ఇక్కడున్న అతి పెద్ద సమస్య.. సకాలంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకపోవడమే' అంటూ కేంద్ర ప్ర‌భుత్వంపైనే ఆయ‌న విమ‌ర్శ‌నాత్మ‌క ధోర‌ణిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కాగా బాంబేలో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రంగా మారాయి. దీంతో ఆయన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఓ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాదని.. మొత్తంగా ప్రభుత్వాల పనితీరును ఉద్దేశించి ఆయ‌న వ్యాఖ్య‌లు చేశార‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు.

కాగా ఇలా సూటిగా, కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడే తత్వమే బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన్ గ‌డ్క‌రీ ఉద్వాస‌న‌కు కార‌ణ‌మైంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. అంతేకాకుండా బీజేపీ పార్ల‌మెంటరీ బోర్డులో త‌న‌కు ఉద్వాస‌న ప‌ల‌క‌గానే బీజేపీ అధికారంలోకి రావ‌డానికి ఎల్‌కే అద్వానీ, అట‌ల్ బిహారి వాజ్‌పాయి చేసిన కృషే కార‌ణ‌మ‌ని నితిన్ గ‌డ్క‌రీ వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం.