Begin typing your search above and press return to search.

దత్తాత్రేయ ఇంటికే.. లక్ష్మణ్ కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   18 Feb 2019 4:56 AM GMT
దత్తాత్రేయ ఇంటికే.. లక్ష్మణ్ కీలక ప్రకటన
X
ఆలూ లేదు.. చూలు లేదు.. సికింద్రాబాద్ సీటు కోసం బీజేపీలో కొట్టుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఘోర పరాజయం చవిచూసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సహా.. ఎంతో ప్రజాదరణ ఉన్న కిషన్ రెడ్డి లాంటి వాళ్లు కూడా టీఆర్ ఎస్ గాలిలో కొట్టుకుపోయారు. మొత్తం 118 స్థానాలకు పోటీచేస్తే 117 స్థానాల్లో ఓడి బొక్కా బోర్లా పడ్డారు.

అంతటి దుర్భర పరిస్థితుల నుంచి బయటపడే మార్గం ఆలోచించాల్సింది పోయి.. అప్పుడే పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ నేతలు సిగపట్లు పట్టుకుంటున్నారు. తెలంగాణలో పోయిన ఎన్నికల్లో గెలిచిన ఏకైనా బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయకే ఎసరు పెట్టేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. గడిచిన కేంద్ర కేబినెట్ విస్తరణలో దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాడు బీజేపీ పెద్దాయన మోడీ. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కనీసం ఎంపీ సీటును కూడా ఇస్తారో లేదోనన్న ఆందోళన దత్తాత్రేయలో కనిపిస్తోంది.

తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. ‘తాను రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ’ స్పష్టం చేశారు.దీంతో దత్తాత్రేయ సీటుకు లక్ష్మణ్ ఎసరు పెట్టినట్లేనని బీజేపీలో జోరుగా చర్చ సాగుతోంది.

లక్ష్మణ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు జాతీయ దృష్టితోనే సాగుతాయని..మోడీ ఇమేజ్ తో లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో తమకు మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ముగ్గురు ఆశావహులతో కూడిన జాబితాను రాష్ట్ర కమిటీ ఫైనల్ చేసి జాతీయ కమిటీకి పంపుతుందని.. మార్చి 2వ వారం నుంచి కేంద్ర స్క్రీనింగ్ కమిటీ స్కానింగ్ చేసి అభ్యర్థులను ప్రకటిస్తుందని లక్ష్మణ్ వివరించారు.

‘‘తనకు అనుభవముందని.. ఎంపీగా పోటీచేయాలనే ఆసక్తి ఉందని.. సికింద్రాబాద్ నుంచి నేను పోటీచేయాలా వద్దా అని నిర్ణయించేది కేంద్ర కమిటీ అని.. కలిసికట్టుగా పనిచేస్తాం’ అంటూ లక్ష్మణ్ ప్రకటించడం కలకలం రేపింది. దత్తాత్రేయ మాత్రం రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేస్తానని స్పష్టం చేస్తున్నారు. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మాట నెగ్గుతుందా..? దత్తాత్రేయకు సీటు దక్కుతుందా అనేది వేచిచూడాలి.