Begin typing your search above and press return to search.

మమ‌త‌కు బీజేపీ అదిరిపోయే షాక్‌: విప‌క్ష నేత‌గా సువేందు

By:  Tupaki Desk   |   10 May 2021 4:30 PM GMT
మమ‌త‌కు బీజేపీ అదిరిపోయే షాక్‌:  విప‌క్ష నేత‌గా సువేందు
X
ప‌శ్చిమ బెంగాల్ రాజ‌కీయాల్లో త‌మ‌దైన ముద్ర వేస్తామ‌ని.. అధికారంలోకి ఖ‌చ్చితంగా వ‌చ్చి తీరుతామ‌ని చెప్పిన‌.. బీజేపీ రాలేక పోయింది. అయితే.. 3 స్థానాల నుంచి 77 స్థానాల‌కు ఎగ‌బాకింది. అంటే.. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంస్థాయికి చేరుకుంది. దీంతో ప్ర‌భుత్వానికి.. ప్ర‌తిప‌క్షానికి మ‌ధ్య ఇక‌, ఉప్పు-నిప్పు త‌ప్ప‌ద‌నే సంకేతాలు వ‌చ్చేశాయి. తాను ఓడిపోయినా.. సీఎం ప‌ద‌విని చేప‌ట్టిన మ‌మ‌త‌కు ఇప్పుడు.. బీజేపీ అదిరిపోయే షాక్ ఇచ్చింది. ఎన్నిక‌ల్లో ఎలాగూ మ‌మ‌త‌పై పైచేయి సాధించలేక పోయినా.. ఇప్పుడు వ‌చ్చే ఐదేళ్లు స‌తాయించే కార్య‌క్ర‌మాన్ని గ‌ట్టిగా చేప‌ట్ట‌నుంది.

కీల‌క నేత‌ల‌ను కాద‌ని..

ఈ క్ర‌మంలో బీజేపీ ప‌క్ష‌(ప్ర‌తిప‌క్షం) నేత‌గా మ‌మ‌త‌పై విజ‌యం ద‌క్కించుకున్న‌.. గ‌తంలో ఆమెకు కుడిభు జంగా మెలిగిన, నందిగ్రామ్ ఎమ్మెల్యే సువేందు అధికారిని బీజేపీ ఎంపిక చేసింది. బెంగాల్ ప్రతిప‌క్ష నాయ‌కుడి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్టానం, కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్రసాద్‌, పార్టీ జాతీయ జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ భూపేంద‌ర్ యాద‌వ్‌ పర్యవేక్షించారు. వాస్త‌వానికి ప్రతిప‌క్ష నాయ‌కుడిగా సువేందు అధికారితో పాటు మ‌నోజ్ తిగ్గా, ముకుల్ రాయ్ కూడా పోటీలో నిలిచారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై గెలిచిన సువేందు వైపే మొగ్గు చూపింది. బెంగాల్‌లో ధీటైన ముఖ్యమంత్రిని ఎదుర్కొవడానికి ప్రజా సమస్యలపై పోరాడేందుకు సువేందు నాయకత్వమే సరైందని బెంగాల్ బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఇద్ద‌రూ ఫైర్ బ్రాండ్లే!

బెంగాల్‌లో వ‌చ్చే ఐదేళ్లు కూడా అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య నిత్యం చెడుగుడు త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా సువేందును ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఎంపిక చేయ‌డంతో బెంగాల్ రాజ‌కీయాలు నిత్యం పోరాటంగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. అధికార పార్టీ నేత‌, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఎంత ఫైర్ బ్రాండో.. అదే త‌ర‌హాలో సువేందు కూడా మంచి ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. గ‌తంలో మ‌మ‌త ప‌క్షంలో ఉన్న‌ప్పుడు .. బీజేపీకి అనేక స‌వాళ్లు విసిరి.. కంటిపై కునుకు లేకుండా చేశారు. ఇలాంటి నాయ‌కుడు ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డంతో మ‌మ‌త వ‌ర్సెస్ సువేందు.. రాజ‌కీయం.. ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంద‌ని అంటున్నారు. మొత్తానికి బీజేపీ.. మ‌మ‌త‌కు స‌రైన జోడీనే ఎంపిక చేసింద‌నే కామెంట్లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.