Begin typing your search above and press return to search.

త‌ల్లీకొడుకుల‌ను ప‌క్క‌న‌పెట్టిన బీజేపీ

By:  Tupaki Desk   |   20 Jan 2022 9:41 AM GMT
త‌ల్లీకొడుకుల‌ను ప‌క్క‌న‌పెట్టిన బీజేపీ
X
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బీజేపీ నేత‌లైన త‌ల్లీకొడుకులు.. మేన‌కా గాంధీ, ప్రియాంక గాంధీని బీజేపీ ప‌క్క‌న పెట్టింద‌నే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. యూపీ ఎన్నిక‌ల్లో ఈ పార్టీ త‌ర‌పున ప్ర‌క‌టించిన 30 మంది స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాలో వీళ్ల‌కు చోటు ఇవ్వ‌క‌పోవ‌డమే అందుకు కార‌ణం. ఆ జాబితాలో ప్ర‌ధాని మోడీ, యూపీ ముఖ్య‌మంత్రి యోగి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా త‌దిత‌రులున్నారు. ఇటీవ‌ల బీజేపీకి వ్య‌తిరేకంగా వ‌రుణ్ చేసిన ట్వీట్ల కార‌ణంగా వీళ్ల‌కు స్టార్ క్యాంపెయిన‌ర్ జాబితాలో చోటు ద‌క్క‌లేద‌ని తెలుస్తోంది. ఈ త‌ల్లీకొడుకుల‌పై బీజేపీ అధిష్ఠానం గుర్రుగా ఉన్న‌ట్లు స‌మాచారం.

యూపీలోని సుల్తాన్పూర్‌, ఫిలిబిత్ నుంచి మేన‌కా, వ‌రుణ్ ప‌లు మార్లు గెలిచారు. బీజేపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. కానీ కొంత కాలంగా సొంత పార్టీ వైఖ‌రిపైనే వ‌రుణ్ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల జ‌రిగిన ల‌ఖీంపూర్ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర‌మంత్రి అజ‌య్ మిశ్రా త‌న‌యుడు ఆశిష్ మిశ్రా రైతుల‌పై నుంచి కారు న‌డిపి వాళ్ల మ‌ర‌ణానికి కార‌ణ‌మయ్యారు.

ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన వ‌రుణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా సొంత పార్టీపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయ‌డంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వేగంగా స్పందించ‌లేద‌ని ఆరోపించారు. దీంతో ఈ త‌ల్లీకొడుకుల‌పై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గం నుంచి వీళ్ల‌ను త‌ప్పించిన హైక‌మాండ్‌.. ఇప్పుడు స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాలోనూ చోటు ఇవ్వ‌లేదు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అధికారాన్ని నిల‌బెట్టుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీజేపీ ఆ దిశ‌గా శాయాశ‌క్తులా కృషి చేస్తోంది. త‌మ పార్టీలోని ఓబీసీ నేత‌ల‌ను స‌మాజ్‌వాదీ పార్టీ త‌న‌వైపు తిప్పుకుంటోంది. ఈ నేప‌థ్యంలో ఓబీసీల ఆద‌ర‌ణ కోసం నిషాద్ పార్టీ, అప్పాద‌ళ్‌ల‌తో క‌లిసి బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఈ కూట‌మి రాష్ట్రంలోని 403 స్థానాల్లో పోటీ చేస్తుంద‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ప్ర‌క‌టించారు.