Begin typing your search above and press return to search.

యూపీలో మోదీ పాచిక పారేనా?

By:  Tupaki Desk   |   13 Nov 2021 1:30 AM GMT
యూపీలో మోదీ పాచిక పారేనా?
X
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దేశంలోనే అత్యధిక లోక్ సభ, అసెంబ్లీ స్థానాలు యూపీలోనే ఉన్నాయి. యూపీలో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీనే కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే రెండుసార్లు కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన మోదీ మూడోసారి కూడా రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

మోదీ కలలు నిజం కావాలంటే మాత్రం యూపీలో తప్పకుండా బీజేపీ అధికారంలోకి ఉండాల్సిందే. అయితే యూపీలో మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి. యోగీ సర్కారుపై ప్రజల్లో ఒకింత వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈక్రమంలోనే ప్రధాని మోదీ నేరుగా రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు.

దీనిలో భాగంగా ఒక్క యూపీలోనే ఏకంగా లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈనెల 16న గోరఖ్ పూర్-పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ఖరీదే 42వేల కోట్లు రూపాయలని తెలుస్తోంది. ఇక ఇదే నెలలో బీజేపీ మొత్తంగా నాలుగు సార్లు యూపీలో పర్యటించన్నారు.

ఈనెల 19న ఝాన్సీ లక్ష్మీబాయి 193వ జయంతి వేడుకలకు, 20న లక్నోలో జరిగే డీజీపీల వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. 25న నోయిడాలో జేవార్ ఎయిర్ పోర్టు శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ లో తన నియోజకవర్గమైన వారణాశిలో విశ్వనాథ టెంపుల్ కారిడార్ ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమాలు చూస్తుంటే యూపీ ఎన్నికలను మోదీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతోంది.

అయితే మోదీ తీరుపై మాత్రం ప్రతిపక్షాలు మండిపడిపోతున్నాయి. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మోదీ సర్కారు నిధులు వరద పారిస్తుందని మిగతా రాష్ట్రాలకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదంటూ నిలదీస్తున్నారు. ఇక మరోవైపు కేంద్రంపై రైతులు గుర్రుగా ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో యూపీలో ఓ కేంద్ర మంత్రి కుమారుడు రైతులపై కారు ఎక్కించడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఈ సంఘటన దేశవ్యాప్త ఆందోళనకు తెరలేపింది. దీంతో రైతులంతా కేంద్రానికి, యూపీ సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతున్నారు. యూపీలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సంఘటలన్నీ కూడా యూపీలో బీజేపీకి మైనస్ గా మారుతున్నాయి.

మోదీ మాత్రం వీటన్నింటిని పారద్రోలేలా ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే యూపీలో లక్షల కోట్ల రూపాయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. యూపీని అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల్లోని వ్యతిరేకతను పారద్రోలేలా మోదీ పావులు కదుపుతున్నారు. అయినప్పటికీ మోదీలో కొంత టెన్షన్ నెలకొందనే టాక్ విన్పిస్తోంది. మరీ మోదీ పాచిక యూపీలో ఏమేరకు పారుతుందో అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!