Begin typing your search above and press return to search.

న‌వ్యాంధ్ర‌లో బీజేపీ నినాదం ఏంటంటే!

By:  Tupaki Desk   |   20 Aug 2017 5:06 AM GMT
న‌వ్యాంధ్ర‌లో బీజేపీ నినాదం ఏంటంటే!
X
కేంద్రంలో రికార్డు స్థాయి మెజారిటీ సాధించిన క‌మ‌ల‌నాథులు ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల‌పై దృష్టి సారించారు. ఉత్త‌రాదిన చాలా రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ ద‌క్షిణాదిలో ఒక్క క‌ర్ణాట‌కను మిన‌హాయిస్తే... మిగిలిన రాష్ట్రాల్లో పెద్ద‌గా రాణించేందేమీ లేద‌నే చెప్పాలి. టీడీపీతో పొత్తు పెట్టుకుని మొన్న‌టి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన బీజేపీకి అటు తెలంగాణ‌తో పాటు ఇటు ఏపీలోనూ పెద్ద‌గా చెప్పుకోద‌గిన‌న్ని సీట్లు ద‌క్కలేదు. అయితే 2019 ఎన్నిక‌ల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌రింత బ‌లోపేతం అయ్యేందుకు ఆ పార్టీ అధిష్ఠానం ఇప్ప‌టినుంచే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇందులో భాగంగా ప్ర‌స్తుతం త‌న‌కు మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగుతున్న టీడీపీతో పొత్తు కొన‌సాగుతుందా? లేదా? అన్న విష‌యాన్ని కూడా డైల‌మాలోనే ప‌డేసిన క‌మ‌ల‌నాథులు కొత్త పొత్తుల కోసం ఎదురుచూస్తున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.

తెలంగాణ విష‌యాన్ని కాస్తంత ప‌క్క‌న‌బెడితే... న‌వ్యాంధ్ర‌లో ఆ పార్టీ ఇప్పుడున్న దానికంటే కూడా మ‌రింత‌గా మెరుగుప‌డాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో నవ్యాంధ్ర‌లో పార్టీ బ‌లోపేతం కోసం ఆ పార్టీ నేత‌లు ఓ కొత్త నినాదాన్నే అందుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 29న విజ‌య‌వాడ రానున్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఇక్క‌డే తిష్ట వేయ‌నున్నారు. ఈ సందర్భంగా పార్టీ కొత్త‌గా రూపొందించిన నినాదానికి షా తెర తీస్తార‌ని స‌మాచారం. ఇక దీనిపై ఇప్ప‌టికే ప‌లు మార్గాల నుంచి వ‌చ్చిన స‌మాచారం మేర‌కు దాదాపుగా అన్ని తెలుగు దిన‌ప‌త్రిక‌లు త‌మ నేటి సంచిక‌ల్లో ఆ కొత్త నినాద‌మేమిట‌నే విష‌యాన్ని ముందుగానే చెప్పేశాయి.

ఇక ఆ నినాదం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... *దంగ‌ల్ మే దౌడో... పార్టీకో మ‌జ‌బూత్ క‌రో (బరిలో ఉరుకు-పార్టీని బలోపేతం చేయి)* అన్న నినాదంతో ఆ పార్టీ ముందుకు సాగ‌నున్న‌ద‌ట‌. ఈ నినాదానికే తాము తొలి ప్రాధాన్య‌మిస్తామ‌ని ఆ పార్టీ పెద్ద‌లు బ‌హిరంగంగానే వ్యాఖ్యానిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. అస‌లు ఎన్నిక‌ల నాటికి టీడీపీతో ఉండాలా? లేదా? వైసీపీతో పొత్తు పెట్టుకోవాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తామని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. ఇక కొన్ని వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం... టీడీపీతో జ‌త క‌ట్టే విష‌యంలో ఆ పార్టీ అధిష్ఠానం చాలా వ్య‌తిరేకంగానే ఉన్న‌ట్లు స‌మాచారం. ఇదే నిజ‌మైతే.. కొత్త‌గా తాను అందుకునే నినాదంతో ఆ పార్టీ నేత‌లు టీడీపీని నిజంగానే దౌడు తీయించ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. చూద్దాం... మ‌రి ఏం జ‌రుగుతుందో!