Begin typing your search above and press return to search.

రోడ్డుపై ఈ రచ్చ ఏంటి సోము?

By:  Tupaki Desk   |   8 Jun 2022 8:32 AM GMT
రోడ్డుపై ఈ రచ్చ ఏంటి సోము?
X
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలీసులపై వీరంగం వేశారు. నడి రోడ్డుపై రచ్చ రచ్చ చేశారు. కోనసీమ జిల్లాలోని రావులపాలెం వద్ద తన కారును ఆపారంటూ వీరంగం సృష్టించారు. తను కారును ఆపే ధైర్యం ఉందా మీకు అంటూ పోలీసులపై దౌర్జన్యం చేశారు. తన కారును ఎందుకు ఆపారంటూ శివాలెత్తారు. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డుగా నిలబడ్డ ఎస్సైని పక్కకి తోసిపారేశారు.

ఈ ఘటనను వీడియో తీస్తున్న కానిస్టేబుల్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సోము వీర్రాజుతో పాటు ఉన్న మరో బీజేపీ నేత సైతం పోలీసులపై చిందులు తొక్కారు. తమను ఎందుకు వెళ్లనివ్వరని నిలదీశారు. తమను ఆపడానికి మీకెవడు హక్కు ఇచ్చాడంటూ మండిపడ్డారు. నీతో మాట్లాడేది ఏంటి.. జిల్లా ఎస్పీతోనే మాట్లాడతాను.. ఫోన్ కలిపి ఇవ్వంటూ ఎస్సైపై రుబాబు చేశారు.

పోలీసులు ఆయనను అనునయించి.. పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసినా సోము వీర్రాజు వినిపించుకోలేదు. మీరు చెప్తే నేను వినేది ఏంటంటూ చిందులు తొక్కారు. ఎస్పీతో మాట్లాడతానని.. ముందు ఎస్పీకి ఫోన్ చేసి ఇవ్వంటూ ఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా నిలబడ్డ ఎస్సైని పక్కకు తోసేశారు. అడ్డుకోబోయిన పోలీసు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోనసీమ జిల్లాలో ఇటీవల జరిగిన అల్లర్లు, విధ్వంసం నేపథ్యంలో జిల్లా అంతటా సెక్షన్‌ 144, సెక్షన్‌ 30 అమలులో ఉన్నాయని పోలీసులు ఆయనకు నచ్చే చెప్పే ప్రయత్నం చేసినా సోము వీర్రాజు వినిపించుకోలేదు. ఈ క్రమంలో తన కారు ముందు ఆగి ఉన్న లారీ డ్రైవర్ పైనా సోము వీర్రాజు శివాలెత్తారు. ముందు నువ్వు లారీ తీయరా అంటూ డ్రైవర్ క్యాబిన్ డోర్ పై డబా డబా బాదారు. అతడు కదలకపోయేసరికి లారీ డ్రైవర్ క్యాబిన్ డోర్ తీసి లారీ తీయరా.. అంటే తీయవేంటి అని మండిపడ్డారు. లారీ ముందు పోలీసులు అడ్డంగా నుంచిని ఉంటే తాను ఎలా పోవాలని లారీ డ్రైవర్ ప్రశ్నించడంతో సోము వీర్రాజు మరింత ఆగ్రహంతో ఊగిపోయారు.

మరోవైపు పోలీసులు సోము వీర్రాజును పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో సహనం కోల్పోయిన సోము వీర్రాజు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైని తోసేసి బెదిరింపులకు దిగారు. నా కారు ఎవడు ఆపమన్నారు ? పై వాళ్లు చెప్పేది ఏంటి? వాళ్లకేం సంబంధం అంటూ ఎస్సైతో వాగ్వివాదానికి దిగారు. నేను మీతో మాట్లడను ఎస్పీతోనే మాట్లడతా అంటూ రచ్చ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకెవడు ఇచ్చాడంటూ శివాలెత్తారు. అడుగడుగునా ఆంక్షలతో పోలీసుల భద్రతతో రాష్ట్రాన్ని ఎంతకాలం పాలిస్తారని సోము వీర్రాజు నిలదీశారు.

కాగా అమలాపురం అల్లర్లు, విధ్వంసానికి సంబంధించి బాధితులు, కేసులు నమోదైన బాధితుల కుటుంబాల పరామర్శకు సోము వీర్రాజు బయలుదేరి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 144 సెక్షన్ ఉంది కాబట్టి సోము వీర్రాజు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. అర గంటపాటు సోము వీర్రాజును జొన్నాడ వద్ద ఆపేశారు. ఆ తర్వాత రావులపాలెం వెళ్లేందుకు మాత్రం పోలీసులు ఆయనను అనుమతించారు.