Begin typing your search above and press return to search.

బీజేపీ వ్యూహం.. అఖిలేష్‌ను ఒంట‌రి చేసిందా?

By:  Tupaki Desk   |   21 Jan 2022 9:04 AM GMT
బీజేపీ వ్యూహం.. అఖిలేష్‌ను ఒంట‌రి చేసిందా?
X
బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(యూపీ) ఎన్నిక‌ల్లో వ్యూహాల‌పై వ్యూహాలు అమ‌లు చేస్తున్నా రు. ఇక్క‌డ బ‌లంగా పావులు క‌దుపుతున్న స‌మాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాద‌వ్‌నుఒంట‌రిని చేయాల‌ని ఎప్ప‌టి నుంచో బీజేపీ నేత‌లు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కుటుంబ స‌భ్యుల ను పార్టీలోకి చేర్చుకున్నారు. ఇప్ప‌టికే అఖిలేష్ త‌మ్ముడి భార్యకు బీజేపీ కండువా క‌ప్పారు. అదేవిధంగా మ‌రో నేత‌కు కూడా పార్టీ తీర్థం ఇచ్చారు. దీంతో దాదాపు అఖిలేష్ త‌ర‌ఫున గ‌ళం వినిపించే కుటుంబ స‌భ్యులు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు.

మ‌రోవైపు అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాద‌వ్ కూడా అనారోగ్య కార‌ణంగా మౌనంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో అఖిలేష్‌ను ఒంటరిని చేయ‌డం ద్వారా త‌మ వ్యూహాల‌ను సునాయాసంగా అమ‌లు చేయొచ్చ‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. అయితే..అఖిలేష్ మాత్రం.. తాను ఒంట‌రి అయినా.. రాష్ట్ర ప్ర‌జ‌లు త‌న‌కు అండ‌గా ఉన్నార‌ని.. తాను ఎలా ఒంట‌రి అవుతాన‌ని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు.. బీజేపీ త‌మ‌ను కుటుంబ పార్టీ అంటూ.. విమ‌ర్శించేద‌ని.. ఇప్పుడు అదే కుటుంబాన్ని త‌న పార్టీలోకి చేర్చుకుని.. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సందేశం పంపుతోంద‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.

సొంతమరదలు అపర్ణా బిస్త్‌ యాదవ్‌, ములాయం తోడల్లుడు ప్రమోద్‌ గుప్తా పార్టీని వదిలి బీజేపీ తీర్థం పుచ్చుకున్నా.. అఖిలేష్‌ వారిని ప‌ట్టించుకోలేదు. ఎందుకు పార్టీ మారుతున్నార‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించ‌లేదు. ఎస్పీ అంటే కుటుంబ పార్టీ అని ఇన్నాళ్లూ ఆరోపిస్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు మా కుటుంబసభ్యులను చేర్చుకొని మా మీద ఉన్న నిందను తుడిపేస్తున్నందుకు, బరువు తగ్గిస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నాన‌ని అఖిలేష్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఎప్పటినుంచో బీజేపీవైపు మొగ్గుచూపుతూ కంట్లో నలుసులా తయారైన ఇంటి కోడలు పార్టీ ఫిరాయించడా నికి సిద్ధమైందని తెలిసినా ఆమెను అఖిలేశ్‌ నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఎస్పీ ఓ కుటుంబ పార్టీ, తండ్రి, కుమారుడు, బాబాయ్‌, కోడళ్లదే పెత్తనం తప్ప ఇంకెవరికీ చోటులేదని బీజేపీ గత ఎన్నికల్లో ప్రచారం చేసి సాధ్యమైనంతమేరకు నష్టాన్ని చేకూర్చింది. ఈసారి అలాంటి వెసులుబాటును మోడీ లాంటి వాక్చాతుర్యం ఉన్న నేతలకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో మొత్తం కుటుంబాన్ని దూరంపెట్టి ఒంటరిగానే అఖిలేశ్ రంగంలోకి దిగారు. మ‌రి ఇది బీజేపీకి లాభిస్తుందా? లేక అఖిలేష్‌ను సీఎంను చేస్తుందా? అనేది వేచి చూడాలి.