Begin typing your search above and press return to search.

నితీశ్ పుణ్య‌మా అని మోడీ చెల‌రేగిపోయే ఛాన్స్‌

By:  Tupaki Desk   |   31 July 2017 4:44 AM GMT
నితీశ్ పుణ్య‌మా అని మోడీ చెల‌రేగిపోయే ఛాన్స్‌
X
ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల లెక్క ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. మోడీ లాంటి నేత గురి పెడితే ఒక్క దెబ్బ‌కు రెండేంది.. ప‌లు పిట్ట‌లకు దెబ్బ ప‌డ‌టం ఖాయం. తాజాగా అలాంటిదే చోటు చేసుకుంద‌ని చెప్పాలి. బీహార్ లో నితీశ్ ఎపిసోడ్ తో.. అంత పెద్ద రాష్ట్రాన్ని గంట‌ల వ్య‌వ‌ధిలో త‌మ వ‌శం చేసుకున్న మోడీ బ్యాచ్‌ కు.. మ‌రో భారీ ల‌బ్థి చేకూరింద‌ని చెబుతున్నారు.

నితీశ్ తీసుకున్న నిర్ణ‌యం లాలూ అండ్ కోల‌కు భారీ షాక్ ఇవ్వ‌టంతో పాటు.. కాంగ్రెస్ పార్టీకి శ‌రాఘాతంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అదే స‌మ‌యంలో మోడీ బ్యాచ్‌ కు భారీ ప్ర‌యోజ‌నం చేకూరింది కూడా. ప్ర‌జ‌లు బంప‌ర్ మెజార్టీతో గెలిపించిన‌ప్ప‌టికీ.. పెద్ద‌ల స‌భ (రాజ్య‌స‌భ)లో బ‌లం లేక‌పోవ‌టంతో కీల‌క‌మైన బిల్లుల్ని చ‌ట్టాలుగా మార్చే విష‌యం మోడీ స‌ర్కారుకు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. చాలా సంద‌ర్భాల్లో ఆర్డినెన్స్ లు జారీ చేయ‌టం ద్వారా బండి లాగిస్తున్నారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్.. పాల‌న‌కు ఆర్డినెన్స్ ల జారీ స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని వ్యాఖ్యానించ‌టం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే నితీశ్ పుణ్య‌మా అని.. రాజ్య‌స‌భ‌లో మోడీ ప‌రివారానికి బ‌లం పెరిగింద‌ని చెప్పాలి. తాజా జేడీయూ మ‌ద్ద‌తుతో రాజ్య‌స‌భ‌లో మోడీ బ్యాచ్ బ‌లం 89కు పెరిగింద‌ని చెప్పాలి. మిత్ర‌ప‌క్షాలు కాన‌ప్ప‌టికీ వివిధ అంశాల్లో మోడీకి మ‌ద్ద‌తు ఇస్తున్న అన్నాడీఎంకే.. టీఆర్ఎస్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ త‌దిత‌ర ప్రాంతీయ పార్టీల‌తో పాటు స్వ‌తంత్రులు.. నామినేటెడ్ స‌భ్యుల్ని కూడా క‌లుపుకుంటే అధికార కూట‌మి బ‌లం 121గా చెప్పాలి.

మొత్తం 243 మంది స‌భ్యులున్న స‌భ‌లో మెజార్టీ కావాలంటే 123 మంది స‌భ్యుల అవ‌స‌రం ఉంది. అంటే.. మెజార్టీకి అవ‌స‌ర‌మైన దానికి రెండు అంటే రెండు సీట్లు మాత్ర‌మే త‌క్కువ అవుతుంది.

కేంద్ర‌మంత్రి అనిత్ ద‌వే మ‌ర‌ణంతో ఖాళీ అయిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఒక రాజ్య‌స‌భ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిచే అవ‌కాశం ఉండ‌టం.. గుజ‌రాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెందిన ఒక స్థానాన్ని బీజేపీ వ‌శం చేసుకునే ప్ర‌య‌త్నం ముమ్మ‌రంగా జ‌రుగుతున్న నేప‌థ్యంలో రాజ్య‌స‌భ‌లో అవ‌స‌ర‌మైన మెజార్టీ సొంత‌మైన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. గుజ‌రాత్ నుంచి రెండు స్థానాల్ని ద‌క్కిన పక్షంలో ఎన్డీఏ బ‌లం 91కి పెరుగుతుంది. యూపీ నుంచి తొమ్మిది రాజ్య‌స‌భ స్థానాల‌కు జ‌రిగే ఎన్నిక‌ల్లో 8 సీట్లు గెలిస్తే ప్ర‌స్తుత వ‌ర్షాకాల స‌మావేశాల్లో అధికార‌ప‌క్షానికి భారీ ఊర‌ట‌గా మార‌నుంద‌ని చెప్పాలి. తాజాగా పెరిగే బ‌లంతో.. మోడీ త‌న పాల‌న‌లో దూకుడును మ‌రింత పెంచొచ్చ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా వ‌చ్చిన బ‌లంతో మ‌రిన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేందుకు వెసులుబాటు ల‌భిస్తుంది. విప‌క్షాల‌కు ఈ ప‌రిణామం ఇబ్బందిక‌రంగా ఉంటే.. అధికార‌ప‌క్షానికి ఇది అనుకూలంగా మారుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.