Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ రాజ‌కీయంపై క‌మ‌ల్ కామెంట్ ఇదే

By:  Tupaki Desk   |   25 Sep 2017 9:52 AM GMT
ర‌జ‌నీ రాజ‌కీయంపై క‌మ‌ల్ కామెంట్ ఇదే
X
త‌మిళ‌సూప‌ర్ స్టార్‌ - త‌లైవా ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ ప్ర‌వేశం విష‌యం ఇంకా ఊగిసలాట‌లోనే ఉంది. ఇటీవ‌ల కాలంలో తమిళనాడులో పెద్ద ఎత్తున రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారిన నేప‌థ్యంలో పాల‌న గాడిత‌ప్పింది. ఈ క్ర‌మంలో ఇక‌ - తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తే బాగుంటుంద‌ని అనుకుంటున్న‌ట్టు ర‌జ‌నీ త‌న మిత్రుల వ‌ద్ద అన్నారు. అయితే, దీనిపై ఇంకా ఆయ‌న ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేదు. అయితే, ర‌జ‌నీ త‌మ పార్టీలోకి వ‌స్తే ఆహ్వానిస్తామ‌ని బీజేపీ ఎప్ప‌టి నుంచో చెబుతోంది. ముఖ్యంగా ర‌జ‌నీలోని ఆధ్యాత్మిక భావ‌న‌లు బీజేపీకి - ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలానికి ద‌గ్గ‌ర‌గా ఉంటాయ‌ని బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి కూడా చెప్పుకొచ్చారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా రాజ‌కీయాల‌పై మాట్లాడిన విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కూడా ర‌జ‌నీ రాజ‌కీయాల‌పై ఆస‌క్తికర కామెంట్ చేశాడు. త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని చెప్పిన క‌మ‌ల్‌... రాజకీయాల్లోకి వస్తున్న విషయం రజనీకాంత్‌ కు చెప్పిన‌ట్టు తెలిపాడు. రజనీ తనకు మంచి స్నేహితుడని, ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించాడు. అయితే, ఈ విష‌యంలో ర‌జ‌నీని ఎలాంటి బ‌ల‌వంతం చేయ‌బోన‌న్నాడు. ఓ ర‌కంగా రజనీకి బీజేపీయే కరెక్ట్‌ అని వ్యాఖ్యానించాడు. ర‌జ‌నీ భావాలు, బీజేపీ భావాలూ ఒక‌టే అనే రీతిలో వ్యాఖ్యానించాడు క‌మ‌ల్‌.

‘రజనీకాంత్‌ తో తరచుగా మాట్లాడుతుంటాను. అతడు నాకు మిత్రుడు. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న విషయం ఆయనతో చెప్పాను. ఇప్పటికైతే ఎటువంటి ప్రణాళికలు లేవు. ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఆయనుకున్న మత విశ్వాసాలను బట్టి చూస్తే బీజేపీ మంచి భాగస్వామి అవుతారనిపిస్తోంది. నేను హేతువాదిని. కులవ్యవస్థకు నేను వ్యతిరేకిని. అలాగని నేను కమ్యూనిస్టును కాదు. నేను అభిమానించే కథానాయకుల్లో కొంత మంది కమ్యూనిస్టులు ఉన్నారు. తమిళనాడులో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అందుకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను’ అని కమల్ చెప్పాడు. దీంతో ర‌జ‌నీ మ‌న‌సులో ఏముందో ఇప్ప‌టికే అర్ధ‌మైపోయింద‌ని అంటున్నాయి త‌మిళ రాజ‌కీయ వ‌ర్గాలు.