Begin typing your search above and press return to search.

యూపీలో బీజేపీకి మిత్రుడి షాక్

By:  Tupaki Desk   |   19 March 2018 5:21 AM GMT
యూపీలో బీజేపీకి మిత్రుడి షాక్
X
ఒక చేతితో ఎంత బ‌లంగా ఊపినా రాని శ‌బ్ధం.. రెండు చేతులు క‌లిపిన‌ప్పుడు వ‌చ్చే సౌండ్ తో సంబంధ‌మే ఉండ‌దు. అందుకే అంటారు.. మిత్రుడి లేని జీవితం వృధా అని. క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం. కానీ.. చేతిలో అధికారంలో ఉన్న‌ప్పుడు ఇలాంటివేమీ గుర్తుకు రావు స‌రిక‌దా.. మ‌న‌కు మించిన తోపులు ఎవ‌రుంటార‌న్న అహం మొత్తంగా క‌మ్మేస్తుంటుంది. అయితే.. దేశ ప్ర‌జ‌లు దేనినైనా స‌హిస్తారు కానీ.. ఆకాశ‌మంత అహాన్ని భ‌రించ‌లేరు. అందుకే.. అవినీతి విష‌యంలో చూసీచూడ‌న‌ట్లుగా ఉండే జ‌నం.. హ‌ద్దులు మీరిన ఆహాన్ని మాత్రం వెనువెంట‌నే తుంచి పారేయాల‌నుకుంటారు.

అహంతో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించిన ఏ ప్ర‌భుత్వం.. ఏ నాయ‌కుడు ఎక్కువ కాలం మ‌న‌గ‌లిగిన చ‌రిత్ర భార‌త‌దేశ రాజ‌కీయాల్లో క‌నిపించ‌దు. ఇంత చిన్న విష‌యాన్ని మోడీషాలు మాత్రం గుర్తించ‌లేక‌పోతున్నారు. త‌మ‌కు అద్భుత‌మైన మెజార్టీని తెచ్చి పెట్టిన యూపీలో.. త‌మ‌కు కంచుకోట లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో దారుణ‌మైన ఓట‌మి ఎదురైనా.. బీజేపీ అగ్ర‌నేత‌ల‌కు కించిత్ బాధ లేద‌న్నది వారి నోట వ‌స్తున్న మాట‌ల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మాన‌దు. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికి జ‌రిగిన డ్యామేజ్ చాల‌ద‌న్న‌ట్లుగా కొత్త కొత్త స‌మ‌స్య‌ల్ని త‌మ తీరుతో తెచ్చుకుంటున్నారు మోడీషాలు.

తాజాగా జ‌రుగుతున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో యూపీలో ఎనిమిది స్థానాలు బీజేపీ గెలుచుకునే అవ‌కాశం ఉంది. మ‌రో రెండు స్థానాల విష‌యానికి వ‌స్తే.. మిత్రుల స‌హ‌కారంతో ఒక స్థానాన్ని.. మ‌రో స్థానాన్ని విప‌క్షానికి ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. మిత్రుల‌తో మంచిగా వ్య‌వ‌హ‌రించి అయితే ఆ స్థానాన్ని త‌మ ఖాతాలో వేసుకోవ‌టం.. లేదంటే మిత్రుల‌కు ఇవ్వ‌ట‌మో చేయాలి. కానీ.. మిత్రుడితో మాట్లాడ‌కుండా.. తాము ఏమైనా చేయ‌గ‌ల‌మ‌న్న ధీమాతో తొమ్మిది మంది రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించింది బీజేపీ.

ఈ తీరుతో హ‌ర్ట్ అయ్యారు బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన సుహెల్దేవ్ భార‌తీయ స‌మాజ్ పార్టీ నేత‌లు. మిత్ర‌ధ‌ర్మాన్ని పాటించే విష‌యంలో బీజేపీ త‌ప్పు చేసింద‌ని ఆయ‌న మండిప‌డుతున్నారు.

న‌లుగురు ఎమ్మెల్యేలున్న ఆ పార్టీ.. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ నేత‌లు బీజేపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వ‌ర‌ని ప్ర‌క‌టించ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఒక రాజ్య‌స‌భ సీటును గెలుచుకోవ‌టానికి 28 మంది స‌భ్యులు అవ‌స‌రం. ఎనిమిది మంది ఎంపీల‌ను ఎన్నుకోవ‌టానికి అవ‌స‌ర‌మైన బ‌లం బీజేపీకి ఉంది. తొమ్మిదో సీటును గెల్చుకోవాలంటే మాత్రం.. త‌మ‌కున్న బ‌లానికి అద‌నంగా మ‌రో తొమ్మిది మంది మ‌ద్ద‌తు అవ‌స‌రం. అందులో మిత్ర‌ప‌క్షం న‌లుగురిని తీసేస్తే.. మ‌రో ఐదుగురిని విప‌క్షం నుంచి ఓట్లు వేయించుకోవ‌చ్చ‌న్న‌ది బీజేపీ నేత‌ల ఆలోచ‌న‌. అయితే.. మిత్ర‌ప‌క్షం తాజాగా రివ‌ర్స్ లోకి రావ‌టంతో ఇప్పుడు ఏమీ చేయాలో పాలుపోని ప‌రిస్థితిలోకి బీజేపీ చిక్కుకుంది. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌లితాల షాక్ ను క‌వ‌ర్ చేసుకుంటున్న బీజేపీకి.. తాజాగా మిత్ర‌ప‌క్షం చేసిన ప్ర‌క‌ట‌న ఇబ్బందికి గురి చేస్తుంద‌న్న మాట వినిపిస్తోంది.