Begin typing your search above and press return to search.

క‌మ‌ల‌నాథులు క్లారిటీ ఇచ్చేశారే?

By:  Tupaki Desk   |   12 Aug 2017 10:25 AM GMT
క‌మ‌ల‌నాథులు క్లారిటీ ఇచ్చేశారే?
X
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌కు సంబంధించి కాసేప‌టి క్రితం టీడీపీ మిత్ర‌ప‌క్షం బీజేపీ కాస్తంత క్లారిటీ ఇచ్చేలా చాలా ఆల‌స్యంగానైనా ఓ ప్ర‌క‌ట‌న ఇచ్చేసింది. ఇటు రాష్ట్రంలోనే కాకుండా అటు కేంద్రంలోనూ టీడీపీ, బీజేపీ మిత్ర‌ప‌క్షాలుగానే కొన‌సాగుతున్నాయి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో రెండు పార్టీలు క‌లిసే పోటీ చేశాయి. అంతేకాకుండా బీజేపీ ఆధ్వ‌ర్యంలోని ఎన్డీఏ కూట‌మిలో టీడీపీ కీల‌క భాగ‌స్వామిగా ఉన్న విష‌య‌మూ మ‌న‌కు తెలిసిందే. ఈ క్ర‌మంలో కాసేప‌టి క్రితం విజ‌యవాడ‌లో జ‌రిగిన బీజేపీ ప‌దాధికారుల స‌మావేశంలో క‌మ‌ల‌నాథులు... నంద్యాల బైపోల్స్ స‌హా కాకినాడ పుర‌పాలిక ఎన్నిక‌ల్లోనూ టీడీపీతో జ‌ట్టుక‌ట్టే వెళతామ‌ని ప్ర‌క‌టించారు. వెరిస వైసీపీతో ఆ పార్టీకి పెరుగుతున్న సాన్నిహిత్యం నేప‌థ్యంలో జ‌నం మ‌దిలోని చాలా అనుమానాల‌ను నివృత్తి చేస్తున్న‌ట్లుగా బీజేపీ ప్ర‌క‌ట‌న చేసింద‌న్న‌ వాద‌న వినిపిస్తోంది.

చాలా కాలం నుంచి క‌లిసే ప‌య‌నిస్తున్న ఈ రెండు పార్టీలు... నంద్యాల బైపోల్స్‌ లోనూ తమ రెండు పార్టీలు మిత్ర‌ప‌క్షాలుగానే కొన‌సాగుతాయ‌ని, టీడీపీ అభ్య‌ర్థికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని బీజేపీ నేత‌లు తేల్చేశారు. నంద్యాల ఉప ఎన్నిక‌కు సంబంధించి నామినేష‌న్ల ప్ర‌క్రియ ఎప్పుడో ముగిసింది. నామినేష‌న్ ప‌రిశీల‌న‌, ఉప‌సంహ‌ర‌ణ కూడా ముగిసింది. బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థుల సంఖ్య‌ను ఖ‌రారు చేసిన ఎన్నిక‌ల క‌మిష‌న్ పోలింగ్ ప్రక్రియ‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఈ క్ర‌మంలో బీజేపీ నుంచి వెలువ‌డిన ఈ కొత్త ప్ర‌క‌ట‌న పెద్ద‌గా ప్ర‌భావ‌మేమి చూపించ‌కున్నా... టీడీపీతో ఆ పార్టీ మైత్రిని మాత్రం మ‌రోసారి ప్ర‌క‌టించిన‌ట్లైంది.

అస‌లు నంద్యాల లాంటి ప్రాంతాల్లో బీజేపీకి పెద్ద‌గా బ‌ల‌గ‌మేమీ లేద‌నే చెప్పాలి. అస‌లు ఆ పార్టీ వెంట న‌డిచే వారి సంఖ్య చాలా త‌క్కువ‌నే విషయం ఆ పార్టీ నేత‌ల‌కు కూడా తెలిసిందే. ఈ క్ర‌మంలో టీడీపీకి తాము మ‌ద్ద‌తిస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌గానే... పెద్ద‌గా ఓట్లు వ‌చ్చి ప‌డతాయ‌న్న భావ‌న కూడా లేదు. ప‌నిలో ప‌నిగా కాకినాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌కు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో తాము టీడీపీతోనే క‌లిసి బ‌రిలోకి దిగుతామ‌ని కూడా బీజేపీ నేత‌లు ప్ర‌క‌టించారు. ఇక అక్క‌డ కూడా బీజేపీకి పెద్ద‌గా బ‌ల‌గ‌మేమీ లేదు. చేస్తే గీస్తే.. టీడీపీతో క‌లిసి పోటీలోకి దిగాలి. లేదంటే చ‌ప్పుడు చేయ‌కుండా కూర్చోవాల్సిందే. ఏది ఏమైనా ఇక‌ముందు కూడా టీడీపీతోనే తాము క‌లిసి సాగుతామ‌ని బీజేపీ నేత‌లు ప్ర‌క‌టించిన‌ట్లుగా ఈ తాజా ప్ర‌క‌ట‌న తేల్చి చెప్పిన‌ట్లైంది.