Begin typing your search above and press return to search.

టీయారెస్ మీద బీజేపీ గురి...వైసీపీకి కిరికిరి!

By:  Tupaki Desk   |   6 Dec 2022 10:30 AM GMT
టీయారెస్ మీద బీజేపీ గురి...వైసీపీకి కిరికిరి!
X
తెలంగాణా రాజకీయాల్లో బీజేపీ దూకుడు చేస్తోంది. కేసీయార్ నేరుగా మోడీని ఢిల్లీని ఢీ కొంటున్నారు. ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. దాంతో తమ మార్క్ టచ్ ని బీజేపీ చూపిస్తోంది. దేశంలో చాలా రాష్ట్రాలో ఆపరేషన్ కమలం అన్న దాన్ని దిట్టంగా అమలు చేసి ప్రత్యర్ధులకు చుక్కలు చూపించిన బీజేపీకి ఇపుడు కేసీయార్ లెక్క కాదని కాషాయ నేతలు అంటున్నారు.

అయితే ఎవరితో అయినా పెట్టుకోండి కానీ చాణక్యుడికే పాఠాలు చెప్పే మా కేసీయార్ తో అసలు పెట్టుకోవద్దు అంటూ గులాబీ పార్టీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. కేసీయార్ జిల్లాల టూర్లలో సమావేశాలలో ఇదే చెబుతున్నారు. ఈ నేపధ్యంలో బస్తీ మే సవాల్ అంటూ అటూ ఇటూ కూడా ఎత్తులు పై ఎత్తులతో ఫైటింగ్ భీకరంగా సాగుతోంది.

మునుగోడు ఉప ఎన్నికలను తెచ్చి కేసీయార్ మీద గెలిచి దెబ్బ తీద్దామని బీజేపీ చూసింది. అయితే అది రివర్స్ అయింది. అక్కడ టీయారెస్ విజయం సాధించింది. ఈ లోగా బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారంలో ఉన్న స్వాములు నడిపిన ఫాం హౌజ్ ఆపరేషన్ ఫెయిల్ అయింది. టీయారెస్ వారి గుట్టూ మట్టూ పట్టేసింది. ఈ క్రమంలో అరెస్టులు సిట్ ఏర్పాటు చేసి బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ నే సిట్ ముందుకు రప్పించాలన్న టీయారెస్ పంతంతో బీజేపీ పెద్దలు కూడా దూకుడే అంటున్నారు.

అలా కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగిపోయాయి. ఈడీ, సీబీఐ, ఐటీ వంటివి వరసబెట్టి దాడులు చేస్తూ రియల్ ఎస్టేట్ మాఫియా మీద పడ్డాయి. వాళ్లకు కావాల్సినవి దొరికాయి. ఆ ఊపుతో లింకుల మీద లింకులు అల్లుకుంటూ మరింత మంది మీద దాడులు చేస్తున్నారు ఢిల్లీలో లిక్కర్ స్కాం విషయం కూడా అలాగే ఉంది. అందులో పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతూ తీగ లాగి డొంకను కదల్చే ప్రయత్నం జరుగుతోంది.

ఇలా వరసబెట్టి సాగుతున్న ఈ దాడులలో తెలంగాణా మంత్రులు, ఎంపీలు సహా కీలక నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. టీయారెస్ కు అన్ని విధాలుగా అండగా ఉంటున్నట్లుగా భావిస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా మీదనే కేంద్ర దర్యాప్తు సంస్థలు పడడంతో వచ్చే ఎన్నికల్లో ఏ ఆర్ధిక సాయమూ గులాబీ పార్టీకి అందచేయకుండా అడ్డుకోవాలన్న మాస్టర్ ప్లాన్ దాగుతుంది.

ఈ నేపధ్యంలో అక్కడ తీగ లాగితే ఏపీలో కూడా డొంక కదులుతోంది. లిక్కర్ స్కాం లో చూస్తే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి పేర్లు బయటకు వచ్చాయి. అదే లిక్కర్ స్కాం లో చూస్తే ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి పేరు వచ్చింది. ఇపుడు లేటెస్ట్ గా చూస్తే వంశీరామ్ బిల్డర్స్ పై ఐటీ దాడులు చేస్తే విజయవాడలోని వైసీపీ నేతల ఇళ్ళలో రీసౌండ్స్ వస్తున్నాయి. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, వల్లభనేని వంశీకి కూడా ఈ వ్యవహారాలు చుట్టుకున్నాయని అంటున్నారు.

దీన్ని బట్టి చూస్తూంటే రానున్న రోజుల్లో మరెన్ని తీగలు కదులుతాయి. దాని వల్ల డొంక ఎక్కడ దాకా ఉందో ఎవరెవరు బయటకు వస్తారో అన్న టెన్షన్ అయితే ఏపీలోని వైసీపీ నేతలలో ఉంది అంటున్నారు. అంతా బాగున్నపుడు ఓకే. అప్పట్లో అంటే కొన్నేళ్ళ క్రితం టీయారెస్ వైసీపీ రెండు పార్టీలూ బీజేపీతో క్లోజ్ రిలేషన్స్ మెయింటెయిన్ చేశాయి. ఆ విధంగా కొంతకాలం నడచింది. అంతా సాఫీగా సాగిపోయింది.

ఆ సమయంలో రెండు చోట్లా అధికారంలో ఉన్న పార్టీలు వారి నేతల మధ్య సాన్నిహిత్యంతో వ్యాపార వ్యవహారాలు చాలా లావాదేవీలు జరిగాయి. ఇపుడు సడెన్ గా కేంద్రం టీయారెస్ ని టార్గెట్ చేసింది. దాంతో టీయారెస్ నేతలతో కలసి మెలసి ఉన్న వారు, వారితో కలసి వ్యాపారాలు చేసే ఆంధ్రా లీడర్స్ కూడా టార్గెట్ అవుతున్నారు. వారిలో వైసీపీ నేతలు ఉన్నా అసలు స్పేర్ చేయడం లేదు. నిజానికి కేంద్రంతో వైసీపీ సన్నిహితంగానే ఉంటోంది.

అయినా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న తరహాలో బీజేపీ కేంద్ర పెద్దలు ఉన్నారు. అదే సమయంలో తమతో ఎవరైనా పెట్టుకున్నా తోక జాడించినా ఇదే రకంగా ఉంటుంది అని వైసీపీకి తెలియాలని గట్టిగా చెబుతున్నరా అన్న చర్చ వస్తోంది. మొత్తానికి గులాబీ తోటలో కాషాయ కలకలం కాదు కానీ ఏపీలో ఫ్యాన్ పార్టీకి కూడా బిగ్ ట్రబుల్స్ ఎదురవుతున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతదూరం వెళ్తుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.