Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రాను టార్గెట్ చేసిన బీజేపీ ?

By:  Tupaki Desk   |   7 April 2022 4:51 AM GMT
ఉత్తరాంధ్రాను టార్గెట్ చేసిన బీజేపీ ?
X
ఉత్తరాంధ్రా జిల్లాలలో జెండా పాతాలని బీజేపీ చూస్తోంది. మూడు కాస్తా ఆరు జిల్లాలు అయిన ఉత్తరాంధ్రాలో పట్టు సాధిస్తే ఏపీలో ఎంతో కొంత ఉనికి నిలబడుతుంది అన్నది ఆ పార్టీ ఆలోచన. సోము వీర్రాజు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక మొదట ఉత్తరాంధ్రా మీదనే తనదైన శైలిలో చూపు ఉంచారు.

ఆయన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేత కావడంతో పొరుగున ఉన్న ఉత్తరాంధ్రాతో మంచి అనుబంధం ఉండడంతో ఇక్కడ నుంచే నరుక్కురావాలని చూశారు. అప్పట్లో వీర్రాజు వైసీపీ, టీడీపీలలో ఉన్న అసంతృప్తి నాయకులకు గేలం వేశారు. అయితే విజయనగరం జిల్లాకు చెందిన గద్దె బాబూరావు ఒక్కరే బీజేపీలో చేరారు.

ఆ తరువాత వలసలు వెల్లువలా ఉంటాయనుకున్నా సాధ్యపడలేదు. ఇక టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా టచ్ చేశారు. ఇక టీడీపీలో ఒకనాడు చురుకైన పాత్ర పోషించి మంత్రిగా పనిచేసిన పడాల‌ అరుణను కూడా కమలం నీడకు చేర్చారు.

మొత్తం మీద చూసుకుంటే బీజేపీలో ఒక దశలో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు, విజయనగరం జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులు చేరుతారని ప్రచారం జరిగినా అది వట్టి మాటే అని తరువాత రోజులలో తేలిపోయింది.

ఈలోగా బీజేపీకి దేశంలో కూడా కొంత ఎదురుగాలి వీచడంతో ఈ చేరికలు కోరికలూ అలాగే ఆగిపోయాయి. ఇపుడు మళ్లీ ఉత్తరాది ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఏపీలో కూడా కొంత సందడి చేయడానికి ఆ పార్టీ నాయకులు చూస్తున్నారు. ఉత్తరాంధ్రాలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరిట సోము వీర్రాజుతో పాటు కీలక నేతలు అంతా మూడు నాలుగు రోజులు ఉత్తరాంధ్రా అంతటా కలియతిరగనున్నారు. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ డియోధర్ కూడా ఈ మూడు రోజులూ ఉత్తరాంధ్రాలో ఉంటారని తెలుస్తోంది. ఈసారి ఇతర పార్టీల నుంచి నేతలను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని చూస్తున్నారు.

అయితే బీజేపీ ఉత్తరాంధ్రా జిల్లాల మీద చూపిస్తున్న ప్రేమ అంతా కపటమైనదని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. ముందు ఉత్తరాంధ్రాను ఆదుకునేలా వెనకబడిన జిల్లాల ప్రత్యేక ప్యాకేజి ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపితే ఈ జిల్లాల మీద ఎంతో కొంత చిత్తశుద్ధి ఉన్నట్లుగా అర్ధం చేసుకోగలమని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఉత్తరాంధ్రా సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగం అన్న అంశాల మీద బీజేపీ చేపడుతున్న యాత్ర ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది చూడాలి.