Begin typing your search above and press return to search.

కన్నడ నాట ఆగని ఆపరేషన్ ఆకర్ష్..!

By:  Tupaki Desk   |   5 Sept 2019 11:38 AM IST
కన్నడ నాట ఆగని ఆపరేషన్ ఆకర్ష్..!
X
ఒకసారి టార్గెట్ చేశాక.. అపాయం పొంచి ఉంటుంది. ఇలాంటి వేళ ఏ చిన్న పొరపాటు జరిగినా మొదటికే మోసం రావటం ఖాయం. ఈ విషయాన్ని బాగానే గుర్తించినట్లుంది మోడీషాలు. ఆ మధ్యన జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం చేతి వరకూ వచ్చి.. చివర్లో చేజారిన నేపథ్యంలో.. ఏలాగైనా కన్నడ నాట కాషాయ జెండా ఎగరాలని తపించిన కమలనాథులు ఎట్టకేలకు తమ ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయటం తెలిసిందే. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేసి.. తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకూ బీజేపీ అధినాయకత్వం నిద్ర పోలేదనే చెప్పాలి.

చేతికి చిక్కిన అధికారం ఏ క్షణంలో అయినా చేజారిపోతుందోనన్న ముందస్తు భయాందోళనలు ఆ పార్టీని మరింత అలెర్ట్ చేయటమే కాదు.. బొటాబొటిగా ఉన్న మెజార్టీని పెంచుకునే క్రమంలో.. మొన్నటిదాకా నిర్వహించిన ఆపరేషన్ ఆకర్షన్ ను మరికొంతకాలం పొడిగించాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. తాము ఏ ప్లాన్ అయితే వేశామో.. సరిగ్గా అదే ప్లాన్ ను కాంగ్రెస్.. జేడీఎస్ లు అమలు చేసే ప్రమాదం పొంచి ఉందన్న భావన బీజేపీని మరింత జాగ్రత్తగా ఉండేలా చేస్తోంది.

తమ పార్టీకి చెందిన 10-15 మందిని తీసుకెళ్లగలిగితే తమ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అలాంటి అవకాశం లేకుండా చేసేందుకు వీలుగా ప్రతిపక్ష పార్టీకి చెందిన మరో పాతిక మంది వరకూ ఎమ్మెల్యేల్ని టార్గెట్ చేసే దిశగా పావులు కదుపుతోంది. పలు నామినేషన్ పదవుల్ని ఇస్తామన్న ఆశ చూపించి.. పార్టీలోకి తీసుకురావటం ద్వారా విపక్షాల బలాన్ని దెబ్బ తీయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హాట్ హాట్ గా ఉన్న కర్ణాటక రాజకీయాలు.. మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ తో మరింత వేడెక్కటం ఖాయమంటున్నారు.