Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో క‌మ‌లం వాళ్ల‌ను ఊడ్చేస్తోందా...?

By:  Tupaki Desk   |   12 July 2019 6:34 AM GMT
తెలంగాణ‌లో క‌మ‌లం వాళ్ల‌ను ఊడ్చేస్తోందా...?
X
వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీజేపీ.. ఆ దిశ‌గానే వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌ కు ప్ర‌త్యామ్నాయంగా నిల‌వాల‌న్న క‌సితో ముందుకు దూకుతోంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా మారుతోంది. ఇదే అద‌నుగా ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌లను బీజేపీకిలోకి లాగి - టీఆర్ ఎస్‌ కు ధీటుగా ఎదిగేంద‌కు చ‌క‌చ‌కా అడుగులు వేస్తోంది. నిజానికి.. తాజా ప‌రిస్థితులు కూడా అందుకు అనుకూలంగానే క‌నిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా రాష్ట్ర కాంగ్రెస్ కీల‌క నేత‌లు కొంద‌రు ఇప్ప‌టికీ బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌ రెడ్డి తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ బ‌తికే ప‌రిస్థితి లేద‌ని - టీఆర్ ఎస్‌ కు ప్ర‌త్యామ్నాయం బీజేపీయేన‌ని బ‌హిరంగంగా చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లం రేపాయి. ఇక ఆయ‌న కూడా ఇదే విష‌యంపై స్ప‌ష్టంగానే ఉన్నారు. ఇక తర్వాత త‌న‌తోపాటు మ‌రికొంద‌రు కీల‌క నేత‌ల‌ను కూడా బీజేపీలోకి తీసుకెళ్లే ప‌నిలో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌ రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తార‌నే టాక్ బ‌లంగానే వినిపిస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న కేంద్ర‌మంత్రి నితిన్‌ గ‌డ్క‌రిని క‌ల‌వ‌డంతో ఈ ఊహాగానాల‌కు మ‌రింత బ‌లం చేకూర్చుతోంది.

కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా వినిపిస్తోంది. ఆయ‌న కూడా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ కండువా కప్పుకొని సాయంత్రానికే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి మళ్లీ క‌మ‌లం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. వీరంద‌రూ కూడా బీజేపీ నేత రాంమాధ‌వ్‌ తో చ‌ర్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో ఆయా జిల్లాల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌ను కూడా లాగేంద‌కు క‌మ‌లం నేత‌లు గ‌ట్టిప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. టీఆర్ ఎస్ నేత డీఎస్ కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా.. ఆయ‌న అమిత్‌ షాతో ఆయ‌న భేటీ కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా పార్టీ అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల‌తోనే స‌త‌మ‌త‌మ‌వుతోంది త‌ప్ప‌.. పార్టీ బ‌లోపేతానికి... శ్రేణుల్లో ఉత్సాహం నింప‌డానికి క‌నీస చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే పార్టీ ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం కూడా త‌మ‌దారి తాము చూసుకునే పనిలో ప‌డ్డారు. వీరంద‌రినీ కూడా లాగేందుకు బీజేపీ నేత‌లు ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న పార్టీ స‌భ్య‌త్వ న‌మోదులో ఇదే అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. ఈ ప‌రిస్థితుల్లో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ త‌న‌ను తాను ఎలా కాపాడుకుంటుందో చూడాలి మ‌రి.