Begin typing your search above and press return to search.

బీజేపీ మాస్టర్ ప్లాన్..టీఆర్ ఎస్- కాంగ్రెస్ షాక్

By:  Tupaki Desk   |   11 Sep 2018 10:51 AM GMT
బీజేపీ మాస్టర్ ప్లాన్..టీఆర్ ఎస్- కాంగ్రెస్ షాక్
X
అఖండ భారతంలో తన ప్రచారంతో బీజేపీని అధికారంలోకి తెచ్చారు ప్రధాని నరేంద్రమోడీ.. ఒక్కడంటే ఒక్కడే అన్నీ తానై వ్యవహరించి సొంతంగా బీజేపీకి మెజార్టీని కట్టబెట్టారు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ప్రధాని హోదాలో మోడీ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు ఎక్కువయ్యాయి. నోట్లరద్దు - జీఎస్టీ సహా పలు నిర్ణయాలు దేశప్రజల కోపానికి కారణమయ్యాయి. దీంతో బీజేపీపై శోభ తగ్గింది.

ఉత్తరాదిలో బీజేపీ ప్రభ తగ్గుతూ వస్తోంది. ఆ పార్టీపై వత్యిరేకతతో ఉప ఎన్నికల్లో ఓట్లు - సీట్లు తగ్గుతున్నాయి. దీంతో బీజేపీ ఇప్పుడు ఆపరేషన్ దక్షిణాదిపై పెట్టింది. కర్ణాటకలో అధికారంలోకి చేరువగా వచ్చి దూరమైంది. తమిళనాట ప్రాంతీయ పార్టీలను కబళించే ప్రయత్నాల్లో ఉంది. ఇక ఇప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఫోకస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రంపై పడింది. కానీ ఇక్కడ బలమైన టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కష్టమని తెలిసి బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది.

బీజేపీకి తెలంగాణలో నాయకులు కొరత పట్టి పీడిస్తోంది. సరైన అభ్యర్థులు కూడా పార్టీ తరఫున పోటీచేసేందుకు లేకుండా పోయారు. దీంతో కాంగ్రెస్ - టీఆర్ ఎస్ లలో టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులపై బీజేపీ కన్నేసింది. తమ నియోజకవర్గాల్లో బలంగా ఉన్న నాయకులను తమ పార్టీలోకి తీసుకొని టికెట్లు ఇచ్చి బలపడాలని బీజేపీ వ్యూహం రచించినట్టు తెలిసింది.

తెలంగాణ రాష్ట్రసమితి ఇప్పటికే 105మంది అభ్యర్థులను ప్రకటించగా టికెట్ ఆశించి భగపడ్డ నేతలు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు.. ఇందులో కొందరు కాంగ్రెస్ వైపు చూస్తుండగా.. మరికొందరు ఇతర పార్టీల వైపు ఆకర్షిస్తున్నారు. ఇందులో బలమైన నేతలను ఆకర్షించాలని బీజీపీ ప్లాన్ చేస్తోంది. వారిని బీజేపీలోకి చేర్పించుకొని టికెట్ ఇచ్చి బలం పుంజుకోవాలని భావిస్తోంది. దీనిపై బీజేపీ అధిష్టానం కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

2019 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమనే ప్రచారాన్ని బీజేపీ నేతలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో చేరి బీజేపీ తరఫున పోటీచేసే వారికి కార్పొరేషన్ పదవులు ఇస్తామని కమలదళం హామీ ఇస్తున్నట్టు తెలిసింది. ఈ వ్యూహంతోనే కాంగ్రెస్ - టీఆర్ ఎస్ లోని రెబల్ అభ్యర్థులను ఆకర్షించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరి..