Begin typing your search above and press return to search.

గెలిచి ఓడటం అంటే ఎలా ఉంటుందో రుచి

By:  Tupaki Desk   |   24 Oct 2019 11:45 AM GMT
గెలిచి ఓడటం అంటే ఎలా ఉంటుందో రుచి
X
కాలం ఎప్పుడూ ఒకరికే అనుకూలాంగా ఉండదు. సానుకూలంగా ఉన్నప్పుడు చెలరేగిపోతే.. ప్రతికూల పరిస్థితుల్లో తల పట్టుకోవటం మినహా చేసేదేమీ ఉండదు. ఇప్పుడు మోడీషాలకు ఇలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పాలి. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ నడుస్తోందని.. తమకు మించినోళ్లు ఎవరూ లేరని.. విజయం తమదేనని.. ఎన్నికల్లో పోటీ చేయటం చాలు.. అధికారాన్ని కట్టబెట్టేస్తారన్న విశ్వాసం.. దాన్ని పెంచి పెద్ద చేసేలా మీడియా రిపోర్టులతో ఎక్కడికో వెళ్లిపోయిన మోడీషాలను నేల మీదకు తీసుకొచ్చారు ఓటర్లు.

అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో విజయం సాధించినా.. పూర్తిగా అస్వాదించలేని దుస్థితి. గతంతో పోలిస్తే ఏకంగా ఇరవైకు పైగా సీట్లు తగ్గిపోవటం ఒక ఎత్తు అయితే.. తన మిత్రుడు తనకు టర్మ్స్ డిక్టేట్ చేసే స్థితిలోకి రావటాన్ని మోడీషాలు కచ్ఛితంగా సహించలేరు. మహారాష్ట్రలో పరిస్థితి ఇలా ఉంటే.. హర్యానాలో పరిస్థితి మరింత దారుణం.

గెలవటం ఖాయమని.. సంబరాలు చేసుకోవటమే ఆలస్యమన్నట్లుగా ఫీలైన దానికి భిన్నంగా హర్యానా ప్రజలు ఇచ్చిన షాకింగ్ తీర్పుకు అప్పుడు వికెట్లు పడిపోవటం మొదలైంది. హర్యానా బీజేపీ అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి ఖట్టర్ ఢి్ల్లీకి పరుగులు పెడుతు వెళ్లారు. అధికారం అందినట్లే అంది.. అందకుండా ఉండిపోయే పరిస్థితి. దీంతో.. పవర్ ను ఎలా చేజిక్కించుకోవాలన్న దానిపై బిజీబిజీగా పావులు కదుపుతున్న పరిస్థితి.

ఇలా.. గెలిచిన చోట తిప్పలే.. గెలవని చోటా తిప్పలతో గెలిచి ఓడిన విచిత్రమైన కండిషన్లోకి మోడీషాలు ఇప్పుడు ఉన్నారని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితుల్లో.. బలవంతపు నవ్వుతో బండి నడిపిస్తున్న వైనం చూస్తే.. తమకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని వారే మాత్రంఊహించలేదని చెప్పక తప్పదు.