Begin typing your search above and press return to search.

న‌రం లేని నాలుక‌.. బండి సంజ‌య్‌ డొల్ల హామీలు..!

By:  Tupaki Desk   |   6 Aug 2022 10:30 AM GMT
న‌రం లేని నాలుక‌.. బండి సంజ‌య్‌ డొల్ల హామీలు..!
X
న‌రం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది.. అనే సామెత ఊరికే రాలేదు. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వ్యాఖ్య‌ల‌తో అది మ‌రోసారి నిరూపిత‌మైంది. మొద‌టి, రెండో విడ‌త ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర‌ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న బండి తాజాగా మూడో విడ‌త పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. యాదాద్రి నుంచి మొద‌లైన ఈ యాత్ర వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళి ఆల‌యం వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

అయితే.. యాత్ర‌లో భాగంగా ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు ఆయ‌న రాజ‌కీయ ప‌రిణితిని అనుమానించేలా ఉన్నాయి. నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడడం.. కార్య‌క‌ర్త‌ల‌ చేత చ‌ప్ప‌ట్లు కొట్టించుకోవ‌డం మిన‌హా ఆయ‌న చేస్తుంది ఏమీ లేదు. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే త‌మ ప్ర‌భుత్వం ఏమేం చేస్తుందో.. ఎలాంటి అభివృద్ధి ప‌థ‌కాలు తెస్తుందో ఏక‌రువు పెడుతున్నారు. అయితే ఆయ‌న హామీల్లో చాలా వాటిపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌ల‌గ‌డం లేదు.

త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే మొద‌టి సంత‌కం ఉచిత విద్య‌, వైద్యం అందిస్తామ‌ని చెబుతూ న‌వ్వుల పాల‌వుతున్నారు. ఎక్క‌డైనా ప్రైవేటులో ఉచితంగా వైద్యం పొందే అవ‌కాశం ఉందా అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అలాగే ఉచిత విద్య ఏవిధంగా సాధ్య‌మో చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, కేసీఆర్ కు కూడా సాధ్య‌ప‌డ‌ని ఉచిత విద్య ప‌థ‌కానికి ఎలాంటి మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందిస్తారో బండి స్ప‌ష్టంగా చెప్ప‌డం లేదు. కేసీఆర్ ప్ర‌భుత్వం చెప్పిన కేజీ టు పీజీ విద్య ఏవిధంగా సాగుతుందో ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

అంత‌వ‌ర‌కు ఎందుకు.. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో వ‌ర‌ద‌ల్లో బండి పోతే బండి ఫ్రీ.. అని హామీ ఇచ్చారు. అది ఏమైంది అని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. హామీల్లో సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించ‌కుండానే ఏది ప‌డితే అది మాట్లాడుతూ ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అవుతున్నార‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఆయ‌న గ్లోబెల్స్ ప్ర‌చారంతో బండి సాగిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు కూడా విమ‌ర్శిస్తున్నాయి. ఆయ‌న మాట‌ల డొల్ల‌త‌నానికి తాజా ఉదాహ‌ర‌ణే నిద‌ర్శ‌నంగా చెప్ప‌వ‌చ్చు.

ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర‌లో భాగంగా భువ‌న‌గిరిలో మాట్లాడుతూ.. త‌మ ప్ర‌భుత్వంలో జ‌ర్న‌లిస్టుల‌కు రైల్వే పాసులు, ఇళ్లు నిర్మించి ఇస్తామ‌ని.. ఆయుష్మాన్ భార‌త్ లో చేరుస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో జ‌ర్న‌లిస్టులంద‌రూ అవాక్కయ్యారు. ఎందుకంటే రైలు టికెట్ల‌లో రాయితీని తొల‌గించింది బీజేపీ ప్ర‌భుత్వ‌మే. క‌రోనా స‌మ‌యం నుంచి రైళ్ల‌ల్లో సీనియ‌ర్ సిటిజ‌న్లు, విక‌లాంగులు, జ‌ర్న‌లిస్టుల‌కు రాయితీ తీసేసింది.

ఇటీవల లోక్ స‌భ‌లో కూడా కేంద్ర మంత్రి ఇకపై ఎవ‌రికీ రాయితీలు ఉండ‌వ‌ని.. కేవ‌లం 75 ఏళ్లు దాటిన వృద్ధుల‌కు, విక‌లాంగుల‌కు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంది అని చెప్పారు. మ‌రి ఆ విష‌యం ఒక ఎంపీ అయిన బండి సంజ‌య్ కు తెలియ‌దా అని జ‌ర్న‌లిస్టులు ప్ర‌శ్నిస్తున్నారు. మోదీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది బండి సంజయ్ ఎలా పున‌రుద్ధ‌రిస్తార‌ని సూటిగా అడుగుతున్నారు. రైళ్ల‌ల్లో పాసులే ఇవ్వ‌లేని వారు ఇక ఇళ్లు ఎలా ఇస్తార‌ని నిల‌దీస్తున్నారు. ఆయ‌న రాజ‌కీయ అవ‌గాహ‌న‌పై సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఈ అంశంపై బండి సంజ‌య్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.