Begin typing your search above and press return to search.

బీజేపీ.. జ‌గ‌దీప్ ను ఉపరాష్ట్ర‌ప‌తిగా నిల‌బెట్ట‌డానికి కార‌ణాలు ఇవేనా?

By:  Tupaki Desk   |   18 July 2022 4:05 AM GMT
బీజేపీ.. జ‌గ‌దీప్ ను ఉపరాష్ట్ర‌ప‌తిగా నిల‌బెట్ట‌డానికి కార‌ణాలు ఇవేనా?
X
ఆగ‌స్టు 10తో ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ప‌ద‌వీకాలం ముగియ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉపరాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున‌ త‌ర‌ఫున ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి జ‌గ‌దీప్ ధ‌న‌క‌ర్, 19 విప‌క్ష పార్టీల త‌ర‌ఫున మార్గ‌రెట్ అల్వా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా బీజేపీ.. ఉపరాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి జ‌గ‌దీప్ ధ‌న‌క‌ర్ ను ఎంచుకోవ‌డం వెనుక అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. అవి ఏమిటంటే..

జ‌గ‌దీప్ ధ‌న‌క‌ర్ రైతు కుటుంబం నుంచి వ‌చ్చారు. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాలు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. రైతులు నెల‌ల త‌ర‌బ‌డి దేశ రాజ‌ధానిలో నిర‌స‌లు, ధ‌ర్నా చేశారు.

దీంతో మోడీ ప్రభుత్వం ఆ చ‌ట్టాల‌ను ఉప‌సంహ‌రించుకుంది. ఈ నేప‌థ్యంలో రైతుల్లో త‌మ‌పై ఉన్న ఆగ్ర‌హాన్ని పోగొట్టుకోవ‌డానికి రైతు బిడ్డ అయిన జ‌గ‌దీప్ ధ‌న‌క‌ర్ ను ఎంపిక చేశార‌ని అంటున్నారు.

ఇక జ‌గ‌దీప్ ధ‌న‌క‌ర్ జాట్ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. జాట్లు.. రాజ‌స్థాన్, పంజాబ్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ల్లో భారీ సంఖ్య‌లో విస్త‌రించి ఉన్నారు. అలాగే జాట్లు ఓబీసీల్లో ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఓబీసీలు ఎవ‌రూ ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌దవిని చేప‌ట్ట‌లేదు.

ప్ర‌ధానంగా జాట్లు వ్య‌వ‌సాయ రంగంలో ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో రైతులు వారే. ఈ నేప‌థ్యంలో జాట్ల మ‌ద్ద‌తును బీజేపీకి ద‌క్కేలా చేయ‌డంతోపాటు రైతుల్లో బీజేపీపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను పోగొట్ట‌డానికి జ‌గ‌దీప్ ధ‌న‌క‌ర్ ను ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించార‌ని చెబుతున్నారు. మ‌రోవైపు రాజ‌స్థాన్ లో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. అలాగే ఆ త‌ర్వాత హ‌ర్యానాలో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో జాట్ల మ‌ద్ద‌తు త‌మ‌కు ద‌క్కేలా చేయ‌డానికే బీజేపీ జ‌గ‌దీప్ ను ఎంపిక చేసింద‌ని చెబుతున్నారు.

అదేవిధంగా జ‌గ‌దీప్ ధ‌న‌క‌ర్ లా చ‌దివారు. సుప్రీంకోర్టు న్యాయ‌వాదిగా కూడా ప‌నిచేశారు. గ‌తంలో ఎమ్మెల్యేగా, కేంద్ర మంత్రిగానూ ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ గా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నకు రాజ్యాంగ అంశాల‌పై మంచి ప‌రిజ్ఞానం ఉంద‌ని అంటున్నారు. ఇది రాజ్య‌స‌భ చైర్మ‌న్ గా ఉండేది ఉప‌రాష్ట్ర‌ప‌తే కాబ‌ట్టి.. త‌మ‌కు లాభిస్తుంద‌ని బీజేపీ ఆలోచ‌న‌గా ఉంద‌ని వివ‌రిస్తున్నారు.