Begin typing your search above and press return to search.

బీజేపీ టిక్కెట్లు అమ్ముతున్నారు..త్వరపడండి.. !

By:  Tupaki Desk   |   23 Dec 2022 4:30 PM GMT
బీజేపీ టిక్కెట్లు అమ్ముతున్నారు..త్వరపడండి.. !
X
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) టిక్కెట్లు అమ్ముకుంటుందా..?! ఒక్కో టికెట్ ధర ఎంత..? టికెట్ దక్కితే గెలుపు ఖాయమేనా..? కావాలనుకున్న చోట ఇస్తారా..? ఇప్పుడీ ప్రశ్నలు తెలంగాణ రాజకీయంలో దుమారం లేపుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని మోసానికి పాల్పడ్డ సురభి శ్రీనివాస్ అనే వ్యక్తిని సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. గీతా మాధురికి టికెట్ ఇస్తామని ఓ హోటల్ లో డబ్బులు డిమాండ్ చేసినందుకు ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే సురభి శ్రీనివాస్ రాష్ట్ర బీజేపీకి ఏంటి సంబంధం అని పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈయనకు సంబంధాలున్నాయా? ఢిల్లీ నుంచి బీజేపీ ఏజెంట్లకు కూడా రాష్ట్ర బీజేపీ నేతలతో సంబంధాలు లేవు. మరి ఈ సురభి శ్రీనివాస్ ఎవరు? అన్నది తేలాల్సి ఉంది. అయితే బీజేపీ టికెట్ కోసం ఆయన చేసిన దందాపై కమలం పార్టీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అసలు బీజేపీలో ఏం జరుగుతోంది..? నిజంగానే బీజేపీ టికెట్లు అమ్ముకుంటుందా..?

తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ దూకుడు మీదుంది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేస్తోంది. అటు పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలతో ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. కీలక నాయకులను కమలం పార్టీలో చేర్చుకొని పార్టీ బలం పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఇతర పార్టీ నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి బాగా పట్టున్న స్థానాల్లో టికెట్ దక్కించుకోవడానికి ఆరాటపడుతున్నారు. అయితే డిమాండ్ ఉన్న స్థానాల్లో బీజేపీ టికెట్లు అమ్ముకుంటుందన్న ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.

టికెట్ల అమ్మకం ఆరోపణ రాష్ట్ర నేతలకు వర్తించదనే చెప్పాలి. సాధారణంగా బీజేపీ నుంచి టికెట్ పొందాలంటే స్థానిక నాయకుల ద్వారా రాష్ట్ర నాయకులను సంప్రదించాల్సి ఉంటుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ తో పాటు డీకే ఆరుణలు కలవాల్సి ఉంటుంది. కానీ కొందరు రాష్ట్ర పార్టీతో సంబంధం లేని ఇతర వ్యక్తులను కలవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాకుండా పార్టీ టిక్కెట్ల వ్యవహారం ఓ హోటల్ లో జరగడం మరింత చర్చనీయాంశంగా మారుతోంది.

గత నెలలో బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ తతంగం అంతా బీజేపీనే చేసిందని రాష్ట్ర అధికార పార్టీ ఆరోపించింది. అంతేకాకుండా ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ వీడియోను ప్రసారం చేయించారు. మోదీ, షాలు తెలంగాణలో తమ పార్టీ నాయకులను 400 కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని అన్నారు.కానీ ఆ విషయంలో కేంద్ర, రాష్ట్ర బీజేపీలు తమతో సంబంధం లేదని వాదించారు. ఇదంతా అధికార పార్టీ కుట్ర అని ఆరోపించారు.

ఇప్పుడు తాజాగా మరోవ్యక్తి బీజేపీ టికెట్ ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేయడం ఆసక్తిగా మారింది. సికింద్రాబాద్ పరిధిలో టికెట్ ఇప్పిస్తామని గీతామాధురి అనే మహిళకు సురభి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆశ చూపాడు. అందుకు డబ్బులు డిమాండ్ చేశాడని గీతామాధురి ఆరోపిస్తోంది. ఈ వ్యవహారమంతా ఓ హోటల్ లో జరిగిందని ఆమె ఫిర్యాదు మేరకు మోండా మార్కెట్ పోలీసులు శ్రీనివాస్ ను అరెస్టు చేశారు. ఆయన వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో విచారిస్తున్నారు. అయితే బీజేపీ నిజంగానే టికెట్లు అమ్ముకుంటుందా..? అయితే ఈ విషయం రాష్ట్ర నేతలకు ఎందుకు తెలియడం లేదు..? అనే చర్చ పార్టీలోనూ మొదలైంది. అసలు ఇదంతా చేయిస్తుంది ఎవరు..? అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు.

వచ్చే ఎలక్షన్ ఫెస్టివల్ లో తెలంగాణే కీలకంగా మారనుంది. ఉత్తరాదిలో దాదాపుగా పాగా వేసిన కేంద్ర బీజేపీ దక్షిణాదిలో తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కేంద్రంలోని కొందరు వ్యక్తులు అక్రమ దందా కొనసాగిస్తున్నారా..? అని అనుకుంటున్నారు. అయితే రాష్ట్ర నేతలకు ఎలాంటి సమాచారం లేకుండా కేంద్ర బీజేపీ వ్యవహారాలు నిర్వహించకపోవచ్చని అంటున్నారు. అలా చేస్తే పార్టీకి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇతర పార్టీకి చెందిన వారే ఈ పనులు చేయిస్తున్నారా..? అని అనుకుంటున్నారు.

ఏదీ ఏమైనా తెలంగాణలో దూకుడు పెంచుతున్న బీజేపీకి ఇలాంటి వ్యవహారాలు చిక్కులు తేనున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర నేతలు అలర్ట్ కాకపోతే రాను రాను మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తితో ఆ పార్టీలోని కొందరు నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ సమయంలో టిక్కెట్ల కొనుగోలు వ్యవహారంతో బీజేపిపై దెబ్బ పడే అవకాశం ఉంది. అయితే బీజేపీ పట్టున్న స్థానాల్లో టికెట్ దక్కించుకునేందుకు కొందరు డబ్బులు పెట్టడానికి వెనుకాడే ప్రసక్తి లేదని తెలుస్తోంది. అందుకు తాజా వ్యవహారమే నిదర్శనం. ఇలాంటి వారికి టికెట్ కేటాయించినా వారు తమ సంపాదనను రెట్టింపు చేసుకోవడానికి మరిన్ని అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తపడపోతే మొదటికే మోసం రానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.