Begin typing your search above and press return to search.

రత్నప్రభ తప్ప ఇంకెవరు దొరకలేదా ?

By:  Tupaki Desk   |   26 March 2021 12:30 PM GMT
రత్నప్రభ తప్ప ఇంకెవరు దొరకలేదా ?
X
పార్టీలోనే చాలామంది నేతలు ఆశ్చర్యపోతున్నారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ తరపున మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పోటీ చేయబోతున్నారు. నిజానికి ఈమె ఎవరో చాలామందికి తెలీదు. కర్నాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన రత్నప్రభ కొంతకాలం మన రాష్ట్రంలో కూడా పనిచేశారు. డిప్యుటేషన్ పూర్తవ్వగానే తిరిగి కర్నాటకకు వెళ్ళిపోయారు. అక్కడే చీఫ్ సెక్రటరిగా పనిచేసి రిటైర్ అయ్యారు.

ఉపఎన్నిక అనివార్యమైన దగ్గర నుండి దాసరి శ్రీనివాసులు అనే మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరు కూడా వినిపించింది. అయితే వివిధ కారణాల వల్ల ఢిల్లీ నాయకత్వం రత్నప్రభ వైపే మొగ్గు చూపటంతో ఆమె పేరే ఖరారైంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అదేపనిగా ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని తీసుకొచ్చి పోటీ చేయిస్తున్న పార్టీలో పోటీకి సీనియర్ నేతలే కరువయ్యారా ? అనే డౌటు పెరిగిపోతోంది.

ఒకపుడు మాజీమంత్రి రావెల కిషోర్ బాబు పేరు కూడా ప్రముఖంగానే వినిపించింది. నిజానికి రత్నప్రభకన్నా రావెలే కరెక్టు అని పార్టీలోనే చర్చ జరుగుతోంది. మరి రత్నప్రభనే ఒప్పించి ఎందుకు పోటీలోకి దింపుతున్నారో చాలామంది నేతలకు అర్ధం కావటంలేదు. నిజానికి రాష్ట్రంలో కమలంపార్టీ పరిస్ధితే అంతంత మాత్రం. కేవలం మీడియా సమావేశాల్లోను, ట్విట్టర్లోను, టీవీ డిబేట్లలో మాత్రమే పార్టీ బలంగా కనిపిస్తుంటుంది.

క్షేత్రస్ధాయిలో జనాల్లో పట్టున్న నేతల సంఖ్య చాలా చాలా తక్కువనే చెప్పాలి. తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను పార్టీ ఉనికన్నదే దాదాపు లేదు. ఎందుకంటే మొన్ననే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జరిగింది. ఈ కార్పొరేషన్లోని 50 డివిజన్లలో బీజేపీ పోటీచేసింది కేవలం 8 అంటే 8 డివిజన్లలో మాత్రమే. నిజంగానే పార్టీ అంత బలంగా ఉండుంటే మిగిలిన 42 డివిజన్లలో ఎందుకని పోటీ చేయలేదు.

ఇక్కడ పెద్ద ట్విస్టు ఏమిటంటే పోటీ చేసిన 8 డివిజన్లలో కలిపి కమలంపార్టీకి వచ్చిన ఓట్లు సుమారు 300. వచ్చిన ఓట్లను బట్టే కమలంపార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్ధమైపోతోంది. ఇంతోటి పార్టీకి అభ్యర్ధిని ఖరారు చేయటానికే నెలలు పట్టింది. పైగా రత్నప్రభ ఎవరనే విషయం పార్టీలోనే చాలామందికి తెలీదంటే ఇక మామూలు జనాల గురించి చెప్పాల్సిన అవసరమేలేదు.