Begin typing your search above and press return to search.

గోవాలో బీజేపీకి బలం వచ్చేసింది..సీఎంగా పారీకర్

By:  Tupaki Desk   |   13 March 2017 4:11 AM GMT
గోవాలో బీజేపీకి బలం వచ్చేసింది..సీఎంగా పారీకర్
X
ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు రాష్ట్రాలకు ఉత్తరప్రదేశ్ లో అద్బుత విజయాన్ని సాధించిన బీజేపీ..ఉత్తరాఖండ్ లోనూ తన దూకుడును ప్రదర్శించింది. అయితే..మిగిలిన మూడు రాష్ట్రాల్లో వెనుకబడిందనే చెప్పాలి.పంజాబ్ లో దారుణ పరాజయాన్ని చవిచూసిన బీజేపీ.. మెజార్టీకి కాస్త తక్కువగా వచ్చిన గోవా..మణిపూర్ లలో ప్రభుత్వాన్నిఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు షురూ చేసిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు రానప్పటికీ.. పొత్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన ప్రకటనకు సానుకూల స్పందన వచ్చేసింది. మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలున్న గోవాలో బీజేపీ విజయం సాధించిన స్థానాలు కేవలం 13 మాత్రమే. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ కు మరో నాలుగు స్థానాలు అధికంగా వచ్చాయి. ప్రభుత్వాన్ని ఒంటరిగా ఏర్పాటు చేసే అవకాశం ఇరు పార్టీలకు లేని పరిస్థితుల్లో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలాన్ని తాము ఇస్తామని జీఎఫ్ పీ పేర్కొంది.

గోవాలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసమే తాము బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లుగా ఆ పార్టీ స్పష్టం చేసింది. అంతేకాదు..గోవా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత..కేంద్రమంత్రి మనోహర్ పారీకర్ కానీ సీఎం పగ్గాలు చేతబట్టిన పక్షంలో తమ మద్దతు ఇస్తామనివారు తేల్చేశారు. దీంతో.. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న మనోహర్ పారీకర్ తన పదవికి రాజీనామా చేసి.. గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. పారీకర్ కారణంగానే తాము మద్దతు లేఖ ఇచ్చామని. ఆయనే కానీలేకుంటే తాము బీజేపీకి మద్దతు ఇచ్చే వాళ్లం కాదని చెప్పుకొచ్చారు.

సీట్ల పరంగా తక్కువ వచ్చిన గోవా రాష్ట్రంలో ఓట్ల పరంగా బీజేపీకి ఎక్కువ ఓట్లు రావటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. 28.4 శాతం ఓట్లను చేజిక్కించుకున్న కాంగ్రెస్ కు 17 సీట్లు రాగా.. 32.5 శాతం ఓట్లను తమ ఖాతాలో వేసుకున్న బీజేపీ మాత్రం కాంగ్రెస్ కన్నా నాలుగు సీట్లు వెనుకబడి ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. అంతే కాదు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్లు..నోటాను ఎక్కువగా వినియోగించుకున్నది గోవా రాష్ట్ర ఓటర్లే కావటం గమనార్హం. మొత్తం ఓటర్లలో 1.2శాతం మంది నోటా ఓటు వేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జీఎఫ్ పీ మద్దతు ఆదివారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

తమ నేతృత్వంలో ప్రభుత్వాన్నిఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ గోవా గవర్నర్ మృదులా సిన్హాను కోరారు. పారీకర్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పిన గవర్నర్.. బల నిరూపణకు 15 రోజుల సమయాన్ని ఇచ్చారు.దీంతో.. గోవాలో బీజేపీ సర్కారు ఏర్పడటం పక్కా అని తేలిపోయింది. గవర్నర్ నిర్ణయానికి ముందు.. పారీకర్ ప్రభుత్వానికి స్థానిక పార్టీలతోసహా..పలువురు ఇండిపెండెంట్లు మద్దతు ఇవ్వనున్నట్లు లేఖ ఇవ్వటంతో బీజేపీ ప్రభుత్వానికి మొత్తం 22 మంది శాసనసభ్యులు మద్దతు ఇవ్వనున్నట్లు తేలింది. దీంతో పారీకర్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని గవర్నర్ ఇస్తూ నిర్ణయాన్నితీసుకున్నారు.

మరోవైపు పూర్తిస్థాయి మెజార్టీ రాని మణిపూర్ లోనూ పరిణామాలు బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయి. ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలం బీజేపీకి లేని సంగతి తెలిసిందే. గోవాలో మాదిరే మణిపూర్ లోనూ కాంగ్రెస్ కంటే బీజేపీకి ఏడు సీట్ల బలం తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలాన్ని స్థానిక పార్టీలు ఇచ్చేందుకు ముందుకు రావటంతో.. బీజేపీ సర్కారు ఏర్పాటు చేయటానికి అవకాశం ఉన్నట్లుగా చెప్పాలి.

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 10 మంది ఎమ్మెల్యేల మద్దతును నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ.. ఒక ఎమ్మెల్యే బలం ఉన్నలోక్ జనశక్తి పార్టీలు ఓకే చెప్పేశాయి. దీంతో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన పదిమందిలోఐదుగురు బీజేపీ వైపునకు వచ్చేయగా. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా వ్యవహరిస్తున్ననాగాపీపుల్స్ ఫ్రంట్ కూడా మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వీరితో పాటు తృణమూల్ కాంగ్రెస్ఎమ్మెల్యే ఒకరు.. ఒకకాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా బీజేపీ సర్కారుకు తమ మద్దతు ఇవ్వనున్నట్లు చెప్పటంతో.. మణిపూర్ లోనూ బీజేపీ అధికారపక్షంగా అవతరించనుంది. బీజేపీ మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలంతా ఆ రాష్ట్ర గవర్నర్ నజ్మా హెప్తుల్లాను కలిసి తాము బీజేపీ ప్రభుత్వానికి బాసటా నిలవనున్నట్లుగావెల్లడించారు. దీంతో.. మణిపూర్ లోనూ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లే. ప్రభుత్వఏర్పాటుకు సంబంధించిన కీలక పరిణామాలు సోమవారం చోటు చేసుకోవటం ఖాయమని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/