Begin typing your search above and press return to search.

ఆయ‌న రావ‌డంతో బీజేపీ గుప్పిట్లోకి గోవా

By:  Tupaki Desk   |   12 March 2017 11:02 AM GMT
ఆయ‌న రావ‌డంతో బీజేపీ గుప్పిట్లోకి గోవా
X
ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల ఫలితాల్లో బీజేపీకి అధికార పీఠం ద‌క్కుతుందా లేదా స‌స్పెన్స్ మిగిల్చిన గోవాలో అంతా సెట్ అయిపోయింది. తాజా స్కెచ్ ప్ర‌కారం గోవా పీఠం బీజేపీకే దక్కనుంది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 13 సీట్లే దక్కినప్పటికీ ఆ పార్టీయే అధికారం కైవసం చేసుకోనుంది. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవటంతో బీజేపీ నేతలు చక్రం తిప్పారు. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్‌ పార్టీ సహా ఇతరులు 10 సీట్లు గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. వీరంతా బీజేపీకి మద్దతిచ్చేలా గోవా మాజీ సీఎం, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ చర్చలు జరిపారు. అంతా సెట్ చేసేశారు. దీంతో ఇక గోవాలో బీజేపీ ప్రభుత్వమే అధికారం చేపట్టనుంది. ఐతే 17 స్థానాల్లో గెల‌వ‌డం ద్వారా...గోవాలో తామే లార్జెస్ట్ పార్టీగా అవతరించామని కాంగ్రెస్ తెలిపింది. తమకే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతోంది.

ఎన్నిక‌ల ప‌లితాల్లో గోవాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా మెజారిటీ రాకపోవడం గమనార్హం. బీజేపీకి 13 స్థానాలే వచ్చాయి. కాంగ్రెస్ 17 స్థానాలతో మెజార్టీలో ఉంది. మహారాష్ట్రవాడి గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ, స్వతంత్రులు చెరో మూడుస్థానాలు గెలుపొందారు. ఎన్సీపీకి ఒక సీటు వచ్చింది. గత ఎన్నికల్లో బీజేపీకి 21 స్థానాలు వచ్చాయి. బీజేపీ గెలిస్తే తన సొంతరాష్ర్టానికి సీఎంగా రావొచ్చన్న ఊహాగానాల నడుమ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన రక్షణమంత్రి మనోహర్ పారికర్‌కు ఈ ఎన్నికల ఫలితాలతో ఎదురుదెబ్బ తగిలింది. అయితే దీన్నుంచి తేరుకున్న పారిక‌ర్ తిరిగి బీజేపీ పీఠం చేప‌ట్టేలా పావులు క‌దిపారు.

ఫ‌లితాల అనంత‌రం పారిక‌ర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ కూడా రేసులో ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అందరికీ అవకాశం ఉన్నందున‌....చిన్నపార్టీల మద్దతుతో మేం అధికారంలోకి వస్తే సుస్థిర పాలన అందిస్తామ‌ని పారికర్ ప్ర‌క‌టించి దాన్ని ఆచ‌ర‌ణ‌లో చూపారు. మ‌రోవైపు మంద్రేమ్‌లో మట్టికరిచిన సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ గోవా గవర్నర్ మృదుల సిన్హాకు తన రాజీనామాను సమర్పించారు. ఈయనతో పాటు ఆరుగురు బీజేపీ మంత్రులు ఓడిపోయారు. కాగా, ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి కూడా చేదు ఫలితమే దక్కింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/