Begin typing your search above and press return to search.

కన్నడ నాట మళ్లీ బీజేపీ సర్కారేనా?

By:  Tupaki Desk   |   8 July 2019 2:49 PM GMT
కన్నడ నాట మళ్లీ బీజేపీ సర్కారేనా?
X
రాజకీయ ముసలం.. ఈ పేరు వింటేనే కర్ణాటక ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి క్లిస్టర్ క్లియర్ మెజారిటీ రాని వైనమే ఇందుకు కారణభూతంగా నిలిస్తే... అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీని అడ్డుకునేందుకు అటు కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులు - పై ఎత్తుల నేపథ్యంలో కన్నడ నాట నిత్యం రాజకీయ సంక్షోభమే కనిపిస్తోంది. ఈ తరహా పరిస్థతి ఇప్పుడు పతాక స్థాయికి చేరిందని చెప్పక తప్పదు. ఇప్పటికే 14 మంది సంకీర్ణ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసేసి ముంబై స్టార్ హోటల్ లో సరికొత్తగా ఏర్పాటు చేసిన శిబిరానికి చేరిపోయారు. మరికొంత మంది కూడా ఇదే బాటన నడవనున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గడచిన రెండు - మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే... కన్నడ నాట కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ సర్కారుకు నూకలు చెల్లిపోయాయని - త్వరలోనే బీజేపీ నేతృత్వంలో కొత్త సర్కారు కొలువు దీరడం ఖాయమేనని చెప్పక తప్పదు.

ఆ లెక్క ఎలాగో చూద్దాం పదంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 224. అంటే 113 సీట్లు దక్కించుకున్న పార్టీ క్లియర్ మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి 105 సీట్లు రాగా... కాంగ్రెస్ కు 78 - జేడీఎస్ కు 37 సీట్లు వచ్చాయి. దీంతో ఏ ఒక్క పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ రాలేదన్న మాట. అయితే అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని గవర్నర్ ఆహ్వానించడంతో బీజేపీ నేత - మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే సభలో మెజారిటీ నిరూపించుకోకుండానే ఆయన పదవి దిగేశారు. ఆ తర్వాత బీజేపీని అదికారానికి దూరంగా ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో పావులు కదిపిన కాంగ్రెస్... తన కంటే కూడా తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ కు సీఎం పోస్టు ఆఫర్ చేసి సంకీర్ణానికి మొగ్గ తొడిగింది. ఈ క్రమంలో జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా సంకీర్ణ సర్కారు ఏర్పాటైంది.

అయితే ఈ సర్కారును కూల్చేందుకు ఎప్పటికప్పుడు తనదైన శైలి ప్లాన్లు వేసిన బీజేపీ... ప్రస్తుతం ఓ బ్రాహ్మాండమైన పథకాన్ని రచించింది. అందులో భాగంగానే సంకీర్ణంలోని 14 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ఆమోదించాలా? వద్దా? అన్నది స్పీకర్ అభిష్ఠానికి వదిలేస్తే... విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వీరి రాజీనామాలకు ఆమోదం ఖాయమేనని తెలుస్తోంది. ఇదే జరిగితే... సభలో మొత్తం సభ్యుల సంఖ్య 214కు చేరుతుంది. అప్పుడు మెజారిటీ 106 సీట్లే మెజారిటీ మార్కుగా మారుతుంది. ఇప్పటికే బీజేపీకి 105 మంది సభ్యులు ఉండగా... బీఎస్పీకి చెందిన ఒకే ఒక సభ్యుడు బీజేపీలో చేరిపోయేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఈ లెక్కన బీజేపీ సర్కారు క్లియర్ మెజారిటీతోనే ఉన్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ లెక్కలను సరిచూసుకునే బీజేపీ నయా ప్లాన్ ను అమలు చేస్తోందన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.