Begin typing your search above and press return to search.

రెడీ టు ‘కాంగ్రెస్ ముక్త భారత్’

By:  Tupaki Desk   |   20 May 2016 5:08 AM GMT
రెడీ టు ‘కాంగ్రెస్ ముక్త భారత్’
X
అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఈ దేశం నుంచి కాంగ్రెస్ ను తరిమేయడానికి ప్రజలు సిద్ధమవుతున్నారన్న సంకేతాలిచ్చాయి.. ఈశాన్యంలోని అస్సాం నుంచి నైరుతి - పశ్చిమ ప్రాంతంలో విస్తరించిన కేరళ.. దక్షిణాన ఉన్న తమిళనాడు వరకు అయిదు రాష్ట్రాలు దేశంలోని రెండు వేర్వేరు కొనల్లోని ప్రాంతాలు.. కానీ, ఎక్కడి ప్రజలనైనా, వారి తీర్పు మాత్రం ఒక్కటే, అది కాంగ్రెస్ ను తరిమేయడం. కేరళ - అస్సాంలలో కాంగ్రెస్ పాలన ఉంది. కాబట్టి ఇది కాంగ్రెస్ పాలనపై ముఖ్యంగా సోనియా-రాహుల్ నాయకత్వంపైనే తీర్పు అనుకోవాలి. బీజేపీ కలలుగంటున్న కాంగ్రెస్ ముక్త భారత్ మాట నిజమవుతున్నట్లుగా కనిపిస్తోంది.

బీహారు ఎన్నికలో బిజెపి ముక్త భారత్ అనే పిలుపు ఇచ్చారు నితీశ్ కుమార్. కాంగ్రెస్ కమ్యూనిస్టులు - ముస్లింలీగ్ - జెడియు - ఆర్‌ జెడి వంటి యాదవ వర్గాలు కలిసి భాజపాను ఓడించాయి. అలాగే ఢిల్లీలోనూ జరిగింది. 2016మే ఎన్నికల ఫలితాలు సోనియా-కారత్ లకు ఘోర పరాజయంగా భావించవచ్చు. ఇప్పుడు ఒక్కటంటే ఒక్క రాష్ట్రాన్నీ కాంగ్రెస్ గెలుచుకోలేదు. పైగా తాము అధికారంలో ఉన్న కేరళ - అస్సాంల్లో అధికారం కోల్పోయింది. కాశ్మీరు - అస్సాం - అరుణాచల్‌ ప్రదేశ్ - ఆలా ఒక్కొక్క రాష్ట్రాన్ని భాజపా వ్యూహాత్మకంగా స్వాధీనం చేసుకుంటూ వస్తున్నది. ఉత్తరాఖండ్‌ లో వారి వ్యూహం కొంచెం బెడిసికొట్టినా అక్కడా భాజపా పాగా వేయడానికి ఎంతో సమయం పట్టేలా లేదు.

కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో ఎందుకు ఓడిపోయింది? ప్రభుత్వ వ్యతిరేకత అని అస్సాంలో సర్ది చెప్పడానికి యత్నిస్తున్నారు. తురుణ్ గొగోయ్ వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి ఉంటే ప్రజలకు ముఖం మెత్తిందని సమానమిచ్చారు. అదే నిజమైతే బెంగాల్‌ లో మమతా బెనర్జీ మీద కూడా ముఖం మెత్తి ఉండాలి. కాని అలా జరగలేదు. శారదా స్కాం - కలకత్తా ఫ్లైఒవర్ కూలడం ఇవేవీ ఓటర్లను ప్రభావితం చేయలేదు. నిజానికి ఈ పాపాలన్నింటికీ మమత బాధ్యత వహించవలసిందే. ఒక్క శారదా స్కాంతోనే లక్షల మధ్యతరగతి కుటుంబాలు వీధినపడ్డాయి. ఐనా ప్రజలు కమ్యూనిస్టులకు అధికారాన్ని కట్టబెట్టడానికి ప్రజలు ఇష్టపడలేదు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు యాభైఏళ్లుగా బద్ధ శత్రువులుగా బెంగాల్‌ లో పోరాడారు. ఐనా బుద్ధదేవ్ భట్టాచార్య పక్కన రాహుల్ గాంధీని ఏచూరి సీతారాం కూర్చోబెట్టారు. ఈ వ్యూహం బెడిసికొడుతుందని ప్రకాశ్ కారత్ హెచ్చరించినా ఏచూరి వినలేదు. సరిగ్గా కారత్ చెప్పినట్టే జరిగింది. బెంగాల్‌ లో కమ్యూనిస్టులు వెనకటితో పోల్చినప్పుడు 30 సీట్లు కోల్పోగా అవన్నీ మమత ఖాతాలోకి వెళ్లాయి. ఇందుకు కారణం కమ్యూనిస్టు కార్యకర్తలు తమ పార్టీ కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక ఎదురు తిరిగారని సమాచారం.

‘విష్ణుమూర్తి దుర్మార్గుడు’ అని ఏచూరి సీతారాం రాజ్యసభలో ప్రసంగించారు. కలకత్తా కాళిక సెక్స్ వర్కర్ అంటూ కమ్యూనిస్టులు కరపత్రాలను విడుదల చేశారు. కలకత్తా కమ్యూనిస్టుల్లో చాలామంది కాళి భక్తులు ఉన్నారన్న సంగతిని ఏచూరి విస్మరించారు. బెంగాల్‌ కు సహజమైన సం స్కృతి ఉంది. దాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ప్రజలు ఎలా క్షమిస్తారు? ఇక కేరళ విషయానికొస్తే.. విఎస్ అచ్యుతానందన్ వయస్సు 93 సంవత్సరాలు. పార్టీలో పిన్నారాయ్ వర్గం ఆయనకు ప్రతికూలంగా ఉంది. అయినా ఎలా విజయం సాధించాడు? అంటే ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల పూర్తిగా విముఖుంగా ఉన్నారనే చెప్పాలి. ఈ ఎన్నికలతో కాంగ్రెస్ కు వచ్చిన కొత్త ప్రమాదం ఏంటంటే, అది ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ చేజారిపోవడం.

2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక స్వచ్ఛ్ భారత్ - మేకిన్ ఇండియా వంటి నినాదాలతోపాటు కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదాన్ని కూడా ప్రముఖంగా వినిపించారు. నరేంద్ర మోదీ కాంగ్రెస్ ముక్త భారత్ కల ఫలించాలంటే చెప్పుకోదగ్గ పెద్ద రాష్ట్రం కర్ణాటకను సిద్దరామయ్య - మల్లికార్జున ఖర్గేలనుంచి విముక్తం చేయాలి. ఎవరు ఏం చెప్పినా భారత్‌లో సోనియా-రాహుల్ శకం ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాల వల్ల రాజ్యసభలో భాజపా స్థానాలు పెరిగి బిల్లులు పాస్ చేయించుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. అస్సాంలో బంగ్లా చొరబాట్లు తక్షణం నిలిచిపోతాయి. అస్సాం తేయాకు తోటల్లో బిహారీలపై అత్యాచారాలు ఆగిపోవచ్చు. అన్నిటికీ మించి దేశం నుంచి కొద్దికాలంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడానికి ఇదే పునాది కావొచ్చు.