Begin typing your search above and press return to search.

యూపీ గెలుపు ‘అంతకు మించి’ ఎందుకంటే..

By:  Tupaki Desk   |   11 March 2017 4:51 PM GMT
యూపీ గెలుపు ‘అంతకు మించి’ ఎందుకంటే..
X
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీ సాధించిన విజయం సంచలనంగా ఎందుకు మారిందన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయి. మోడీ పరివారానికి యూపీ ప్రజలు ఇచ్చింది మామూలు విజయం కాదని.. అంతకు మించిందని చెప్పక తప్పదు.

మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు 325 స్థానాల్లో బీజేపీ గెలిచిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు..సంచలనంగా మారింది. ఇంత భారీ మెజార్టీని సాదిస్తుందన్న విషయాన్ని బీజేపీ నేతలు సైతం అంచనా వేయలేదనే చెప్పాలి.సీనియర్ జర్నలిస్టులు సైతం.. యూపీ ఎన్నికల సందర్భంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి..బీజేపీకి వచ్చే స్థానాలు 250కు మించవని తేల్చేశారు.కానీ.. ఎవరి ఊహాలకు అందని రీతిలో 325 స్థానాల్లో విజయం సాధించటంతో సర్వేలతో పాటు..ప్రత్యర్థి పార్టీలకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారని చెప్పకతప్పదు.

యూపీలో బీజేపీ సాధించిన విజయం.. మామూలు విజయం లాంటిది కాదని..అంతకు మించిందని చెప్పక తప్పదు. దీనికి సముచితమైన కారణం లేకపోలేదు. తాజాగా యూపీ సంచలన విజయం తర్వాత బీజేపీ తిరుగులేని రాజకీయ శక్తిగా దేశంలో అవతరించనుంది. ఇక..మోడీకి తిరుగులేదని చెప్పక తప్పదు. అంతేకాదు.. ఇంతకాలం రాజ్యసభలో బీజేపీ బలం లేకపోవటంతో.. కీలకమైన బిల్లుల్ని పాస్ చేయలేక కిందామీదా పడుతోంది. ఈ సమస్యకు యూపీ ఫలితం చెక్ పెట్టనుంది.

యూపీలో సాధించిన సంచలన విజయంతో.. త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అధిక్యం భారీగా పెరగటమే కాదు.. కొద్దినెలల్లో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కోరుకున్న అభ్యర్థి రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ముందు వరకూ బీజేపీ కోరుకున్న వ్యక్తి రాష్ట్రపతి అయ్యేందుకు దాదాపు 66 వేల ఎలక్ట్రోల్ కాలేజ్ ఓట్లు లోటుగా ఉండేవి. తాజా ఫలితంతో ఆ కొరత తీరిపోవటమే కాదు.. మరింత బలం చేతిలోకి వచ్చేసిన పరిస్థితి.

ఇంతకాలం కీలకనిర్ణయాలు ఏమైనా తీసుకోవాలంటే.. కీలకమైన యూపీ ఎన్నికలు ఒక బూచిగా చూపించేవారు. పెద్ద నోట్ల రద్దు ఎపిసోడ్ లో ప్రజల్లో మోడీ సర్కార్ అంటే తీవ్రవ్యతిరేకత ఉన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి.అయితే.. అవన్నీ ఉత్త మాటలేనని తేలిపోయింది. తాజాగా వెలువడిన యూపీ ఫలితం పుణ్యమా అని.. మరో రెండేళ్లలో జరిగే లోక్ సభ ఎన్నికల మీద కూడా ఎంతోకొంత ప్రభావం చూపిస్తుందనటంలో సందేహం లేదని చెప్పక తప్పదు.

మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముస్లిం మైనార్టీలు ప్రాబల్యంఎక్కువగా ఉండే పూర్వాంచల్ ప్రాంతంలో కూడా బీజేపీ ఘన విజయాన్నిసాధించిందంటే.. బీజేపీకి మైనార్టీల ఓట్లు ఎంతోకొంత మేర పడినట్లు చెప్పక తప్పదు. అదే నిజమైన పక్షంలో.. అది మరో సంచలన అంశంగా మారుతుందన్నది మర్చిపోకూడదు. ఇదంతా చూస్తే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. యూపీ ఫలితం మాత్రం మోడీ అండ్ కోకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందనటంలో సందేహం లేదని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/