Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను చీల్చే బాధ్యత ఈటలకు!

By:  Tupaki Desk   |   5 July 2022 6:29 AM GMT
కేసీఆర్ ను చీల్చే బాధ్యత ఈటలకు!
X
తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ ఇప్పటికే రకరకాలు వ్యూహాలు రచిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సక్సెస్ కావడంతో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇక పార్టీని పటిష్ట పరిచేందుకు చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 'ముందస్తు' ఊహాగానాలు ఎక్కువగా వస్తుండడంతో కొంత మంది నాయకులు పార్టీలు మారేందుకు రెడీగా ఉన్నారు.

ముఖ్యంగా టీఆర్ఎస్ లో అసంతృప్త నేతలు ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నాయకులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అలాంటి వారికి ఆఫర్లు ప్రకటించి పార్టీలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ బాధ్యతలను ఈటల రాజేందర్ కు అప్పగించారు. బీజేపీలో చేరిక కమిటీ కన్వీనర్ గా ఈటలను నియమించారు. ఇంతకాలం రాజేందర్ కు ప్రాధాన్యం లేదని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు ఈ బాధ్యతను అప్పగించడంతో పార్టీ కోసం ఇక సీరియస్ గా పనిచేయనున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన చేరిక వెనక ఈటల రాజేందర్ ఉన్నట్ల సమాచారం. అలాగే టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అసంతృప్త నేతలెవరో ఈటలకు తెలుసు.

వారిని రప్పించేందుకు కూడా ఆయన వ్యూహం రచించే అవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త నేతలు అదును చూసి ఇతర పార్టీల్లోకి వెళ్లనున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్తితుల్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో చెప్పలేమని భావిస్తున్నారు. బీజేపీ పుంజుకుంటున్నా.. రాను రాను ఏ విధంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉందని వాపోతున్నారట.

ఇటీవల టీఆర్ఎస్ కు చెందిన కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరారు. కానీ బీజేపీ వైపు చూడడం లేదు. దీంతో ఈటలకు ఈ బాధ్యత అప్పగిస్తే ఆయన హామీతో చాలా మంది బీజేపీలో చేరే అవకాశం ఉందని అధిష్టానం భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ కు చేరికల కమిటీ కన్వీనర్ గా నియమించినట్లు సమాచారం. ఈటల నే కాకుండా గరికపాటి మోహన్ రావు, చాడ సురేశ్ రెడ్డి లాంటి వారికి కూడా కొన్ని బాధ్యతలు అప్పగించారు. దీంతో వీరంతా పార్టీ కోసం సీరియస్ గా పనిచేయనున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీలో చేరిన తరువాత ఆయనను బీజేపీ కేడర్ గెలిపించుకుంది. అయితే అప్పటి నుంచి ఈటలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రచారం సాగింది. కానీ కొందరు అధ్యక్ష పగ్గాలు ఇస్తారని అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బండి సంజయ్ ను పక్కకు తప్పిస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. అయినా ఈటలకు పెద్ద బాధ్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయనకు చేరికల కమిటీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈటల తనకు అప్పజెప్పిన బాధ్యతలను సక్సెస్ చేస్తారా..? లేదా..? అనేది చూడాలి.