Begin typing your search above and press return to search.

మోదీ టూర్ ను బీజేపీ భలే వాడుకుందే.. టీఆర్ఎస్ పై నెగెటివిటీనే కారణమా?

By:  Tupaki Desk   |   27 May 2022 12:32 PM GMT
మోదీ టూర్ ను బీజేపీ భలే వాడుకుందే.. టీఆర్ఎస్ పై నెగెటివిటీనే కారణమా?
X
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను రాష్ట్ర బీజేపీ చక్కగా వాడుకుంది. రాష్ట్రంలోని అధికార పార్టీ, సీఎంపై విమర్శలకు వేదిక చేసుకుంది. ఇది అనూహ్యమే. వాస్తవానికి మోదీ ప్రధాని హోదాలో ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడ బీజేపీ శ్రేణులకు కాస్త సమయం ఇస్తారు. అదికూడా విమానాశ్రయంలో ఆగి పరిస్థితిని తెలుసుకుంటారు. అంతే.. అంతకుమించి ఉండదు. ఆ కాస్త సమయంలోనే ప్రధానికి పార్టీ పరంగా చెప్పాల్సింది చెప్పేస్తారు. ఆయా రాష్ట్రాల నేతలు. ఉదాహరణకు కొద్ది రోజుల కిందట మోదీ ఏపీలోని తిరుపతి వచ్చారు. అక్కడ వెళ్తూవెళ్తూ మానాశ్రయంలో ఆడి ఏపీ బీజేపీ నేతలతో సంభాషించారు.

హైదరాబాద్ లో జరిగింది అనూహ్యం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) ద్విదశాబ్ది ఉత్సవాలకు మోదీ గురువారం హైదరాబాద్ వచ్చారు. దాదాపు 2 గంటలు నగరంలో ఉన్నారు. వాస్తవానికి చూస్తే ప్రధాని పర్యటన అధికారిక కార్యక్రమైన ఐఎస్ బీ వేడుకకే పరిమితం కావాలి. అయితే.. ప్రధాని స్థాయి వ్యక్తి.. అది కూడా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తుతూ ప్రత్యామ్నాయ జాతీయ వేదికను సిద్ధం చేస్తున్న తరుణంలో రాష్ట్రానికి వస్తుంటే ఆ చాన్స్ ను అలా వదిలేస్తే ఎలా? ఇదే విషయం బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు కూడా ఆలోచించినట్లున్నారు. విమానాశ్రయం -ఐఎస్ బీ కార్యక్రమం మధ్యలో ఓ వేదికను ఏర్పాటు చేసి టీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే రాజకీయంగా ఫాయిదా ఉంటుందని భావించింది.

బేగంపేట ఎయిర్ పోర్ట్ వేదికగా..గురువారం నాటి హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన వేదిక నుంచి మాట్లాడిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా మోదీ.. ఏకంగా కేసీఆర్ ది కుటుంబ పాలన అంటూ ధ్వజమెత్తారు.

అంతేగాక అమరవీరుల త్యాగాలను ప్రస్తావించారు. అయితే, ఈ సభ ప్రధాని షెడ్యూల్ లో ఉన్నదా? లేదా? అన్నది పక్కనపెడితే.. మోదీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చిట్టచివరి సభకు వస్తారనేది నిన్నటివరకు బీజేపీ నేతలు చెప్పారు. కానీ, అనూహ్యంగా దీనికంటే ముందే బేగంపేట సభ వేదికగా తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. అలా.. మోదీ హైదరాబాద్ టూర్ ను పార్టీ పరంగా మలుచుకుంది బీజేపీ.

టీఆర్ఎస్ తో అవగాహన అనుమానాలు పటాపంచలు సాక్షాత్తు మోదీనే.. టీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయడం అంటే తెలంగాణ అధికార పార్టీతో తమకు ఏస్థాయిలోనూ అవగాహన లేదని బీజేపీ స్పష్టంగా చెప్పినట్లే. ఇది కాషాయ పార్టీ కార్యకర్తల్లో ఏమూలనో ఉన్న అనుమానాలను, ప్రజల్లో రేకెత్తతున్న సందేహాలను, కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు వారికి ఉపయోగపడే సాధనం.

టీఆర్ఎస్ పై ప్రజల్లో నెగెటివిటీ ఉందని నివేదిక మరీ ముఖ్యంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కేంద్రానికి నిఘా నివేదికలు వెళ్లినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం తగ్గకుండా ముందుకెళ్లి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అందులోభాగంగానే నిన్నటి ప్రధాని పర్యటనలోనూ అధికారం గురించి ప్రస్తావన వచ్చింది. ఇక మోదీ బేగంపేటలో సభలో మాట్లాడతారని, అక్కడ బహిరంగ సభ వేదిక సిద్ధం చేస్తున్న ఫొటోలను ప్రధాన మీడియా గుర్తించలేకపోయింది. ప్రధాని పర్యటన రొటీన్ కార్యక్రమం అనుకుందే తప్ప అందులోని ప్రత్యేక ఏర్పాట్లను గమనించలేదు. ప్రధాని స్థాయి వ్యక్తి పర్యటనలో జరుగుతున్న పరిణామాలను గుర్తించలేకపోవడం కొంత చిత్రమే.