Begin typing your search above and press return to search.

మమత మిస్టేక్ ను వాడేసుకుంటున్న బీజేపీ

By:  Tupaki Desk   |   12 Dec 2020 1:30 PM GMT
మమత మిస్టేక్ ను వాడేసుకుంటున్న బీజేపీ
X
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై పశ్చిమబెంగాల్లో జరిగిన దాడిని కమలంపార్టీ రాజకీయంగా బాగా వాడుకుంటోందా ? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జేపీ నడ్డా వాహనాలపై దాడులు జరగటం నిజంగా దురదృష్టమే. అయితే ఆ నడ్డా టార్గెట్ గా ఎవరు ఆయనపై దాడి చేయలేదు. కేవలం కాన్వాయ్ పై మాత్రమే దాడి జరిగింది. సరే నడ్డాపై దాడి జరిగినా లేకపోతే కాన్వాయ్ పై దాడి జరిగినా తప్పు తప్పే అనటంలో సందేహం లేదు.

వచ్చే ఏడాదిలో పశ్చిమబెంగాల్లో ఎన్నికలు ఉండటం వల్ల దాడి ఘటనను బీజేపీ బాగా పెద్దదిగా చేసేస్తోంది. కాన్వాయ్ పై దాడి ఘటనపై గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇవ్వటం, ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయటం రాజకీయంలో భాగమనే అనిపిస్తోంది. ఇది చాలదన్నట్లుగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా కేంద్రహోంశాఖ నుండి సమన్లు అందాయి. అయితే దీన్ని మమత అడ్డుకున్నారు. ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీకి పిలిపించటమంటే ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవటమంటే మండిపడ్డారు.

ఓ చిన్న ఘటనపై ఇటు గవర్నర్, అటు కేంద్రం చాలా సీరియస్ గా స్పందించటమే ఆశ్చర్యంగా ఉంది. నడ్డానో లేకపోతే రాష్ట్రపార్టీ నేతలో స్పందించారంటే అర్ధముంది. ఇక్కడ రాజకీయం అని ఎందుకు అనుమానంగా ఉందంటే ఓసారి చరిత్రను గమనిస్తే అర్ధమవుతుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన అమిత్ షా పైన కూడా అప్పట్లో దాడి జరిగాయి. స్వయంగా అమిత్ షా కూర్చున్న కారుపైనే బండరాళ్ళు , కర్రలు, చెప్పులు వేశారు. అప్పట్లో అమిత్ కేంద్ర హోంశాఖ మంత్రే కాకుండా పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ఉన్నాడు.

అమిత్ కారుపై దాడిచేసిన వాళ్ళని పోలీసులు, కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు వీడియో ఫుటేజీల ద్వారా గుర్తించారు కూడా. అయినా ఎవరు ఇంతలా అప్పట్లో రియాక్టవ్వలేదు. కేంద్రహోంశాఖ స్పందించలేదు, గవర్నర్ నివేదికను పంపలేదు. అప్పటి ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీకి రమ్మని సమన్లు ఇవ్వలేదు. ఏదో పార్టీపరంగా ఆందోళనలు చేసి ఊరుకొన్నారు. పశ్చిమబెంగాల్లో జరిగింది కూడా ఇలాంటి దాడే అయినపుడు ఇంతగా ఎందుకు రియాక్షన్ కనబడోతోంది ?

ఎందుకంటే కేవలం ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే అని అర్ధమైపోతోంది. ఎలాగైనా బెంగాల్లో అధికారం అందుకోవాలన్న వ్యూహంతో బీజేపీ పావులు కదుపోతోంది. అయితే చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా సానుకూలం కావటం లేదు. అందుకనే ఏ చిన్న అవకాశం దొరికినా పెద్దదా చేసేస్తోంది బీజేపీ. పైగా నడ్డా కాన్వాయ్ పై దాడి చేసింది టిఎంసి కార్యకర్తలని కూడా నిర్ధారణ కాలేదు. అయినా సరే మమతా ప్రభుత్వంపై గవర్నర్ వ్యాఖ్యలు చేసేయటం, నివేదిక ఇఛ్చేయటమంటే రాజకీయ కోణమే ఎక్కువగా కనబడుతోంది.