Begin typing your search above and press return to search.

బీజేపీ ఉపాధ్యక్షుడుణ్ని కొట్టి పారేశారు

By:  Tupaki Desk   |   2 Feb 2017 5:09 AM GMT
బీజేపీ ఉపాధ్యక్షుడుణ్ని కొట్టి పారేశారు
X
స్థాయిలు కొన్నిసార్లు లెక్కలోకి రావు. చుట్టూ ఉన్న పరిస్థితులు.. సమయం.. సందర్భం చూసుకొని బరిలోకి దిగాలి. కానీ.. అలాంటివేమీ చూసుకోకుండా దిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయం తాజాగా కేరళ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుల వారికి బాగానే అర్థమై ఉంటుంది. తాజాగా ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.

తాము చేపట్టిన ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా మారటంతో పరిస్థితిని కంట్రోల్ తేవటం కోసం పోలీసులు మూడో కన్ను తెరిచారు. దీంతో.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా లాఠీఛార్జ్ చేయటం మొదలెట్టారు. ఈ ఘటనలో పలువురు నేతలు.. జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. అలా గాయపడిన వారిలో కేరళ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీ వావా కూడా ఉండటం గమనార్హం.

కేరళ రాష్ట్రంలో ‘‘కేరళ లా అకాడమీ’’ సుదీర్ఘంగా నడుస్తున్న ప్రైవేటు లా కాలేజ్. ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ లక్ష్మీ నాయర్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కాలేజీ విద్యార్థులు గడిచిన మూడు వారాలుగా సమ్మె చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా బీజేపీ నాయకుల నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని భారీగా చేపట్టారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు.

తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ బుధవారం తిరువనంతపురంలో ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధరన్ లా కాలేజ్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి మద్దుతుగా విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనబాట పట్టటంతో.. ఇది కాస్తా హింసాత్మకంగా మారింది. ఆందోళనకారుల్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో.. ఆందోళనకారులు మరింత చెలరేగిపోవటంతో వ్యవహారం టియర్ గ్యాస్ వదిలే వరకూ వెళ్లింది. ఈ పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వావాకు టియర్ గ్యాస్ షెల్ తల మీద తగలటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆందోళనల్ని నిర్వహించే సమయంలో అదుపు తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకుల మీద ఉంది. లెక్క తేడా వస్తే.. పరిస్థితులు ఇలానే ఉంటాయి మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/