Begin typing your search above and press return to search.

రాజుగారి సెటైర్‌!..అచ్చెన్న‌ది ఉగ్ర‌రూప‌మేన‌ట‌!

By:  Tupaki Desk   |   28 March 2018 10:09 AM GMT
రాజుగారి సెటైర్‌!..అచ్చెన్న‌ది ఉగ్ర‌రూప‌మేన‌ట‌!
X
ఏపీ అసెంబ్లీలో ఇప్పుడు ర‌స‌వ‌త్త‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. స‌భ‌కు విప‌క్ష హోదాలో ఉన్న వైసీపీ గైర్హాజ‌రు కాగా... నిన్న‌టిదాకా అధికార టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిన బీజేపీనే ఇప్పుడు విప‌క్షంగా మారిపోయిన ప‌రిస్థితి. 2014 ఎన్నికల్లో క‌లిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీ... మొన్న‌టిదాకా క‌లిసే ముందుకు సాగాయి. అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా ప్ర‌త్యేక ప్యాకేజీ అని ఊరించిన బీజేపీ... చివ‌ర‌కు ప్యాకేజీ నిధులు కూడా విడుదల చేయ‌కుండా త‌న‌దైన శైలి వ్యూహాన్ని అమ‌లు చేయ‌డంతో గ‌తి లేని ప‌రిస్థితిలో ఎన్డీఏ కూట‌మి నుంచి టీడీపీ వైదొల‌గింది. అంత‌కు కాస్తంత ముందుగా న‌రేంద్ర మోదీ కేబినెట్ లోని త‌న ఇద్ద‌రు ఎంపీల‌తో మంత్రి ప‌ద‌వుల‌కు టీడీపీ రాజీనామా చేయిస్తే... చంద్ర‌బాబు కేబినెట్ లోని ఇద్ద‌రు బీజేపీ మంత్రులు కూడా త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేశారు. దీంతో అప్ప‌టిదాకా మిత్ర‌ప‌క్షాలుగా కొన‌సాగిన టీడీపీ - బీజేపీలు ఇప్పుడు వైరి వ‌ర్గాలుగా మారిపోయాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ రెండు పార్టీలు మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న స‌మ‌యంలోనూ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత‌గా ఉన్న విష్ణుకుమార్ రాజు... టీడీపీ పాల‌న‌పై చుర‌క‌లు వేసిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. ఇక స‌భ బ‌య‌ట టీడీపీ పాల‌న మొత్తం అవినీతిమ‌య‌మేన‌ని బీజేపీ ఎమ్మెల్సీ సొము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు గుప్పిస్తూనే ఉన్న సంగ‌తి కూడా తెలియ‌నిదేమీ కాదు. అయితే ఇప్పుడు ఆ రెండు పార్టీలు వైరివ‌ర్గాలు మారిన నేప‌థ్యంలో టీడీపీ పాల‌న‌పై విష్ణుతో పాటు సొము వీర్రాజు, ఇత‌ర బీజేపీ నేత‌లు కూడా నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్ర‌మంలో నేటి అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా ఆస‌క్తిక‌ర సంవాదం జ‌రిగింది.

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు - విష్ణుకుమార్ రాజుల మ‌ధ్య సాగిన ఈ సంవాదం... నిజంగానే ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఎలాంటి ఉద్య‌మం సాగించాల‌న్న విష‌యంపై చ‌ర్చించేందుకు చాలా ఆల‌స్యంగా అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని చంద్ర‌బాబు ఏర్పాటు చేయ‌గా... ఆ స‌మావేశానికి వైసీపీ, జ‌న‌సేన‌తో పాటుగా బీజేపీ కూడా బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన అచ్చెన్న‌... ఈ మూడు పార్టీలు క‌లిసిపోయాయ‌ని, ఏపీకి అన్యాయం చేయ‌డానికి కంకణం క‌ట్టుకున్నాయ‌ని ఆరోపించారు. దీంతో కాస్తంత వేగంగానే స్పందించిన రాజు... అచ్చెన్న వ్యాఖ్య‌ల‌ను అక్క‌డిక‌క్క‌డే ఖండించేశారు. అస‌లు వైసీపీ, జ‌న‌సేన‌ల‌తో తాము ఎక్క‌డ క‌లిశామో చెప్పాల‌ని అచ్చెన్న‌ను డిమాండ్ చేశారు. బీజేపీలో బీ అంటే భారతీయ జనతా పార్టీ అని, జే అంటే జగన్ అని, పీ అంటే పవన్ అని అచ్చెన్నాయుడు కామెంట్ చేస్తున్నారని... వాళ్లతో తాము ఎక్కడ కలిశామని ఆయన ప్రశ్నించారు. తాము కలిసినట్టు మీరెక్కడైనా చూశారా? కెమెరాలతో ఏమైనా షూట్ చేశారా? అని దాదాపుగా నిల‌దీసినంత ప‌నిచేశారు. అసెంబ్లీకి వచ్చినప్పుడు మాత్రమే తాను జగన్ ను కలిశానని... చాలా కాలంగా ఆయన సభకు కూడా రావడం లేదని చెప్పారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ను ఒక్కసారి చూశామని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడుతూ విష్ణు ఘాటుగానే స్పందిచారు. ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం త‌న రాజకీయ వ్యూహాల్లో భాగంగా నిర్వ‌హించిన స‌మావేశాన్ని గ్ర‌హించే ఆయా పార్టీలు హాజ‌రుకాలేద‌ని విష్ణుకుమార్ రాజు అన్నారు. `టీడీపీ త‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో భాగంగా ఈ స‌మావేశం నిర్వ‌హించింది. దానికి మేం మా విధానం ప్ర‌కారం హాజ‌రుకాలేదు. దీనికి ఇత‌ర పార్టీల‌తో పొత్తు పెట్ట‌డం గ‌ర్హ‌నీయం.` అని మండిప‌డ్డారు. `వైసీపీ అధినేత జగ‌న్‌ - జ‌న‌సేన నాయ‌కుడు ప‌వ‌న్‌ కు మేం ఎందుకు చెప్తాం? నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు మిత్ర‌ప‌క్షంగా ఉన్న మంత్రి అచ్చెన్నాయుడే మా మాట విన‌లేదు...ఆయ‌న ఎలా వింటారు?` అంటూ సూటిగా ప్ర‌శ్నించారు.

అంత‌టితో ఆగ‌ని రాజు... *అధ్యక్షా అచ్చెన్నాయుడు గారు చాలా గొప్పగా చెబుతారు. లేనిది ఉన్నట్టు - ప్రజలు నమ్మేటట్టు... అబ్బ... ఏమి చెబుతారు? ఆయన చెప్పిన దాంట్లో ఏ మాత్రం వాస్తవం లేదు. మేం చెబితే పవన్, జగన్ లు వింటారా? అంతెందుకు... నేన‌ను చెప్పింది అచ్చెన్నాయుడు కూడా వినరు. ఎవరి పార్టీ స్టాండ్ వారికుంటుంది. అఖిలపక్షానికి రాకపోవడానికి రకరకాల రాజకీయ కారణాలు ఉంటాయి. పదేళ్ల క్రితం ఆ ప్రభుత్వం అలా చేసింది, ఇలా చేసిందని అందరూ న‌న్నే చూపిస్తున్నారు. అప్పటి ప్రభుత్వంలో నేను లేదని, అప్పుడు నేను ఎమ్మెల్యేను కూడా కాదు. అచ్చెన్నాయుడు గారైతే ఊగిపోతూ నాపై వేలెత్తి చూపిస్తూ మాట్లాడుతున్నారు. అధ్యక్షా, అచ్చెన్నాయుడిని చూస్తేనే భయం వేస్తోంది. ఆయన వస్తేనే నాకు దడ పుడుతోంది. అధ్యక్షా... అచ్చెన్నాయుడు, ఆయన ఉగ్రరూపాన్ని నాపై చూపించకూడదని మీ ద్వారా కోరుతున్నా* అని రాజుగారు త‌న‌దైన శైలిలో అచ్చెన్న‌పై సుదీర్ఘ కంప్లైంటే చేశారు. మొత్తంగా అచ్చెన్న తీరును ఆయ‌న మాట‌తోనే ఎండ‌గ‌డుతూ రాజుగారు... నిజంగానే అచ్చెన్న వ్య‌వ‌హార స‌ర‌ళిని తూర్పార‌బ‌ట్టేశార‌న్న వాద‌న వినిపిస్తోంది.