Begin typing your search above and press return to search.

మోడీ మ‌ళ్లీ ఎందుకు...ఎలా గెలిచారంటే..

By:  Tupaki Desk   |   18 Dec 2017 9:48 AM GMT
మోడీ మ‌ళ్లీ ఎందుకు...ఎలా గెలిచారంటే..
X
గుజరాత్... సామాన్యుల‌కు కూడా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని రాష్ట్రం. 22 ఏళ్లుగా బీజేపీకి పట్టం కడుతున్న ప్రధాని మోడీ సొంతగడ్డ. ఆ గ‌డ్డ‌మీదే...మ‌ళ్లీ మోడీ విజ‌యం సాధించారు. అనూహ్య రీతిలో తిరిగి క‌మ‌ల వికాసాన్ని ఆచ‌ర‌ణ‌లో చూపారు. అయితే ఆ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క ఏం కాదు. నిజంగా మోడీకి `లిట్మ‌స్ టెస్ట్‌`. అయిన‌ప్ప‌టికీ గెలిచాడు. ఇప్పుడు కూడా 2012లో సాధించిన 115 స్థానాల కంటే తక్కువే వచ్చినా.. వరుసగా ఆరోసారి అధికారంలోకి రావడంలో బీజేపీ విజయవంతమైంది. దీనికి కారణం మళ్లీ ఆ ఒక్కడే. అంతా అనుకున్నట్లే ప్రధాని మోడీయే అన్నీ తానై బీజేపీని నడిపించారు.

వాస్త‌వానికి ఎన్నిక‌ల వేడి మొద‌ల‌య్యేముందు ఏ గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటూ సీఎం నుంచి పీఎంగా ప్రమోషన్ పొందారో ఆ రాష్ట్రంలో ఎన్నికలంటే బీజేపీకి ఇక తిరుగుండదు అన్నదే చాలా మంది అభిప్రాయం. కానీ గుజరాత్ ఎన్నికల ప్రచారం ఒక స్టేజీకి చేరిన త‌ర్వాత పరిస్థితి అలా లేదు. కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీ త‌న‌ ప్రచారాన్ని కొత్త‌పుంత‌లు తొక్కించారు. మరోవైపు పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. ఇంకోవైపు దళిత నేత జిగ్నేష్ మేవానీ - ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్.. ఇలా బీజేపీపై ముప్పేట దాడి మొదలైంది. దీనికితోడు ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు - జీఎస్టీ నిర్ణయాలతో ఎక్కువగా నష్టపోయింది గుజరాతే అన్న అభిప్రాయం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ విజయం నల్లేరుపై నడక ఏమాత్రం కాదని అర్థమైపోయింది. పైకి 150 స్థానాలు గెలుస్తామని చెబుతున్నా.. లోపల మాత్రం ఆందోళన చెందుతూనే ఉన్నది. అయిన‌ప్ప‌టికీ... ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి సారించిన మోడీ.. బీజేపీకి మరో అద్భుత విజయాన్ని కట్టబెట్టారు.

ప్ర‌ధాని హోదాలో న‌రేంద్ర మోడీ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాలు...నోట్ల రద్దు - జీఎస్టీలాంటి ఆర్థిక విధానాలు సామాన్యుడి నడ్డి విరిచిన మాట నిజమే. కానీ గుజరాత్ ఎన్నికల్లో దానిని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేలా మోడీ ప్రచారం నిర్వహించారు. అవినీతిని అంతమొందించడంలో భాగంగానే తాను ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నానని, దీర్ఘకాలంలో ఈ ఫలాలు సామాన్యుడికి అందుతాయన్న తన వాదనను ఓటర్లకు ఎక్కించడంలో మోడీ విజయవంతమయ్యారు. ఈ రెండు నిర్ణయాల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మోడీ తన మాటల చాతుర్యంతో కొంతైనా తగ్గించగలిగారు.

త‌న రాష్ట్రం గురించి న‌రేంద్ర‌మోడీ మొద‌టి నుంచి చెప్తున్న మాట. నేనే అభివృద్ధి.. నేనే గుజరాత్ అంటూ గుజరాత్ మోడల్ అభివృద్ధిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రచారంలో మొదట్లో సహజంగానే అభివృద్ధి నినాదంతోనే మోడీ ఇలా బరిలోకి దిగారు. రోడ్లు - సాగు - తాగునీరు - శాంతిభద్రతలు - విద్యుత్ సరఫరా - విద్యాభివృద్ధి - పారిశ్రామికీకరణ.. ఇలా ప్రతి రంగంపై బీజేపీ అభివృద్ధి మోడల్‌ను వివరిస్తూ వెళ్లారు. మరోవైపు ఇదే గుజరాత్ మోడల్ అభివృద్ధిని కాంగ్రెస్ హేళన చేస్తూ ప్రచారం మొదలుపెట్టింది. సూట్ బూట్ సర్కార్ అన్న కాంగ్రెస్ విమర్శలకు దీటుగా.. ప్రధానంగా మిడిల్ క్లాస్ - బలహీన వర్గాలను ఆకర్షిస్తూ మోడీ ప్రచారం సాగింది. దీంతో ఆ వ‌ర్గాల మ‌న‌సు గెల‌వ‌గ‌లిగింది.

ఇక త‌మ కీల‌క అస్త్రమైన హిందుత్వ అనే పదునైన అస్త్రాన్ని సరైన సమయంలో మోడీ మరోసారి తన ప్రచారానికి వాడుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నియామకం ఇక లాంచనమే అన్న సమయంలో వాళ్లది ఔరంగాజేబ్ పాలన అంటూ ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ వస్తే ఇక ముస్లిం రాజ్యమే అన్నట్లుగా ప్రచారం నిర్వహించారు. అయోధ్యకు - ఎన్నికలకు ముడిపెట్టిన కపిల్ సిబల్ వ్యాఖ్యలను అనుకూలంగా మలచుకున్నారు. రామ మందిరానికి కాంగ్రెస్ అడ్డుపడుతున్నదన్నదని చెప్పడం మొదలుపెట్టారు. ఇక గుజరాత్‌ లో తనను ఓడించడానికి కాంగ్రెస్ ఏకంగా పాకిస్థాన్‌ తోనే చేతులు కలిపిందన్న ఆరోపణ అసలు మోడీ ప్రచారానికే హైలైట్. ఇది ఓటర్లలో ఆయన పట్ల ఓ రకమైన సింపథీని క్రియేట్ చేయగలిగింది. త‌ద్వారా హిందుత్వ ఓట్ల‌ను బీజేపీ ఖాతాలో చేర్చాయి.

అనూహ్యరీతిలో...ప్ర‌తిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా మోడీజీకి అస్త్రం అందించింది. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పరోక్షంగా మోడీకి పెద్ద సాయమే చేశారు. ఆయన చేసిన నీచ్ ఆద్మీ కామెంట్స్‌ ను ప్రధాన అస్త్రంగా మలచి మళ్లీ కాంగ్రెస్‌ పైకే వదిలారు మోడీ. కాంగ్రెస్ తనను తక్కువ జాతి వ్యక్తి అంటూ అవమానిస్తున్నదని చెప్పుకున్నారు. ఓ పబ్లిక్ ర్యాలీలో అయితే ఏకంగా 15 నిమిషాల పాటు కాంగ్రెస్, ఇతర ప్రతి పక్షాల వాళ్లు తనను ఎన్నేసి మాటలన్నారో సుదీర్ఘంగా వివరించారు. మొత్తానికి... `నన్ను నమ్మండి.. అందరూ వ్యతిరేకంగా ఉన్న సమయంలో మీరు నాకు అండగా ఉంటారా లేదా? ఢిల్లీలో కూర్చున్న నేను కాకపోతే మీ పనులు ఎవరు చేస్తారు? ఈ సమయంలో నాకు అండగా నిలుస్తారా లేదా?` అన్న మోదీ ప్రశ్నలకు గుజరాత్ ఓటర్లు తమ సమాధానం చెప్పేశారు. మరో ఐదేళ్ల బీజేపీ పాలనకు ఓకే చెప్పారు. మోడీ త‌న వ్య‌తిరేక‌త‌ను త‌నే అధిగ‌మించ‌గ‌లిగారు అంటూ నిపుణులు చెప్తున్నారు. ప్ర‌స్తుత స‌మాచారం ప్ర‌కారం ఫ‌లితాలు ఈ విధంగా ఉన్నాయి.

గుజ‌రాత్ మొత్తం సీట్లు -182

పార్టీ విజ‌యం

బీజేపీ 99
కాంగ్రెస్‌ 80
ఇత‌రులు 03