Begin typing your search above and press return to search.

జైపూర్ మేయరమ్మ పదవిని పీకేసిన రాష్ట్ర సర్కార్

By:  Tupaki Desk   |   8 Jun 2021 3:30 PM GMT
జైపూర్ మేయరమ్మ పదవిని పీకేసిన రాష్ట్ర సర్కార్
X
జైపూర్ మేయర్ పదవిని నిర్వహిస్తున్న బీజేపీ మహిళా నేత సౌమ్య గుర్జార్ పదవిని పీకేశారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో.. ఆ రాష్ట్రంలో మరో రాజకీయ రగడ షురూ అయినట్లుగా చెబుతున్నారు. మేయర్ పదవిని నిర్వహిస్తున్న సౌమ్య బీజేపీకి చెందిన వారు కాగా.. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది. ఇంతకీ ఇంతటి అనూహ్య పరిణామాలకు కారణం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.

ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించే వర్కుకు సంబంధించి ఒక కంపెనీకి ఇవ్వాలని మేయర్ నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన సమావేశంలో.. మేయర్ నిర్ణయాన్ని కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వాగ్వాదం పెరగటమే కాదు.. శ్రుతిమించి రాగాన పడినట్లు చెబుతున్నారు. సమావేశంలో కమిషనర్ చేసిన వాదనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు ఆయనపై భౌతికదాడికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. దీంతో సమావేశాన్ని మధ్యలోనే వాయిదా వేసిన కమిషనర్ యగ్యా మిత్ర వెళ్లిపోయారు.

అనంతరం కమిషనర్ పై భౌతిక దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ముగ్గురు నేతలు బీజేపీకి చెందిన వారు కాగా.. ఒకరు ఇండిపెండెంట్ గా చెబుతున్నారు. అధికారిపై వ్యవహరించిన తీరుతో సీరియస్ అయిన రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మేయర్ ను పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వును జారీ చేసింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ పార్టీకి చెందిన వారి చేతిలో మేయర్ పదవి లేని కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా వారు ఆరోపిస్తున్నారు. చూస్తుంటే జైపూర్ మేయర్ వ్యవహారం రాజకీయ రగడగా రూపాంతరం చెందటం ఖాయమన్నట్లుగా చెబుతున్నారు.