Begin typing your search above and press return to search.

ఇంకో మ‌హ‌మ్మారి.. 8 మంది బ‌లి!

By:  Tupaki Desk   |   9 May 2021 6:30 AM GMT
ఇంకో మ‌హ‌మ్మారి.. 8 మంది బ‌లి!
X
క‌రోనాతోనే బెంబేలెత్తి పోతుంటే.. ఇప్పుడు మ‌రో మ‌హ‌మ్మారి జ‌నం ప్రాణాలు తోడేస్తోంది. అది కూడా కొవిడ్ నుంచి బ‌య‌ట‌ప‌డిన వారిలోనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. బ్లాక్ ఫంగ‌స్ గా పిలిచే.. మ్యూకోర్ మైకోసిస్ ఇన్ఫెక్ష‌న్ బారిన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కు 8 మంది మ‌ర‌ణించారు.

ఇలాంటి కేసులు ఉత్త‌ర భార‌తంలోనే ఎక్కువ‌గా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌నిపోయిన 8 మంది కూడా మ‌హారాష్ట్ర‌కు చెందిన వారే. ఈ రాష్ట్రంతోపాటు ఢిల్లీ, పుణె, గుజ‌రాత్ లో ఈ త‌ర‌హా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్న ఈ ఫంగ‌స్ కార‌ణంగా.. ఛాతిలో నొప్పి, ఊపిరి అంద‌క‌పోవ‌డం, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలు క‌లిగిస్తోంది. దీంతోపాటు చూపు కోల్పోయే ప్ర‌మాదాన్ని కూడా క‌లిగిస్తోంద‌ని తెలుస్తోంది.

కొవిడ్ చికిత్స తీసుకున్న వారిలోనే ఈ ప‌రిస్థితి ఎక్కువ‌గా క‌నిపించ‌డానికి ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు నిపుణులు. ఇమ్యునిటీ త‌క్కువ‌గా ఉన్న‌వారికి అనివార్యంగా స్టెరాయిడ్స్ అందించాల్సి వ‌స్తోంది. అయితే.. స్టెరాయిడ్స్ వ‌ల్ల ఆరోగ్యానికి చాలా న‌ష్టం క‌లుగుతుంది. ప్ర‌ధానంగా కాలేయంపై ప్ర‌భావం చూప‌డంతోపాటు ఇత‌ర అవ‌య‌వాల‌కూ న‌ష్టం క‌లిగిస్తాయ‌ని చెబుతున్నారు.

కొవిడ్ చికిత్స‌లో ఇవ‌న్నీ తీసుకున్న వారు మ‌రింత‌గా వీక్ అయిపోతార‌ని, అలాంటి వారిపై బ్లాక్ ఫంగ‌స్ దాడి చేస్తోంద‌ని చెబుతున్నారు. చ‌క్క‌టి ఆహారం తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌డం, కంటినిండా నిద్ర‌పోవ‌డం, భ‌య‌ప‌డ‌కుండా ఆనంద‌మైన జీవితాన్ని సాగించ‌డం ద్వారా ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వొచ్చ‌ని చెబుతున్నారు నిపుణులు.