Begin typing your search above and press return to search.

బ్లాక్‌ ఫంగస్‌ విజృంభణ : వ్యాక్సిన్ల కొరత .. వైద్యనిపుణులు ఆందోళన !

By:  Tupaki Desk   |   27 May 2021 6:34 AM GMT
బ్లాక్‌ ఫంగస్‌ విజృంభణ : వ్యాక్సిన్ల కొరత .. వైద్యనిపుణులు ఆందోళన !
X
ముందు చూస్తే గోయ్యి, వెనుక చూస్తే నొయ్యి ... ప్రస్తుతం దేశంలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కరోనా మహమ్మారి భారిన పడి , ఎలాగోలా కోలుకుంటే వారిలో కొందరిపై బ్లాక్‌ ఫంగస్‌ స్వైరవిహారం చేస్తోంది. మధుమేహవ్యాధి నియంత్రణ లేని, అతిగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్‌ వినియోగించిన వారిలో విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో 11,717 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డారు. చికిత్సలో ఒక్కొక్కరికి 100 చొప్పున యాంఫోటెరిసిన్‌–బి ఇంజక్షన్లు అవసరం. అంటే, ఇప్పుడు వ్యాధిబారిన పడినవారికే 11.71 లక్షల ఇంజక్షన్లు కావాలి. ప్రస్తుతం దేశంలో 5 సంస్థలు నెలకు 1,63,747 ఇంజక్షన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి.

మరో 5 సంస్థలకు వాటిని ఉత్పత్తి చేసేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చింది. ఈ 10 సంస్థలు జూన్‌ నాటికి నెలకు 2,55,114 వయల్స్‌ మాత్రమే ఉత్పత్తి చేయగలవు. విదేశాల నుంచి తొమ్మిది లక్షల ఇంజక్షన్లను దిగుమతి చేసుకోవడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందులో జూన్‌ కు 3.15 లక్షల వయల్స్‌ వస్తాయని చెబుతోంది. ఈ లెక్కన జూన్‌ నాటికి నెలకు 5.70 లక్షల వయల్స్‌ మాత్రమే అందుబాటులోకి వస్తాయి. నానాటికీ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతుండటంతో, ఆ వ్యాధి చికిత్సలో వాడే కీలకమైన యాంఫోటెరిసిన్‌ బి ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా మారుతుందని వైద్యనిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సరైన సమయం గా భావించి ,కొందరు ఈ టీకాలని బ్లాక్ మార్కెట్ కి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి రోగికి రోజుకు 3, 4 డోసుల చొప్పున కొన్ని వారాలపాటు ఇవ్వాల్సి ఉంటుంది. వివిధ ఫంగస్‌ వ్యాధుల చికిత్సలోను రెండు దశాబ్దాలుగా ఈ ఇంజక్షన్‌ను ఉపయోగిస్తున్నారు. దేశంలో భారత్‌ సీరమ్స్‌ అండ్‌ వ్యాక్సిన్స్, బీడీఆర్‌ ఫార్మాస్యూటికల్స్, సన్‌ ఫార్మా, సిప్లా, లైఫ్‌ కేర్‌ ఇన్నొవేషన్స్‌ సంస్థలు మాత్రమే ఈ ఇంజక్షన్లను ఉత్పత్తి చేస్తున్నాయి.

గతంలో వీటి తయారీలో ఏడాదికి 100 నుంచి 150 కిలోల లిపిడ్లు వరకు అవసరమయ్యేవి. ఈ ఫంగస్‌ కేసులు కనిష్ఠస్థాయిలో నమోదవడం వల్ల ఆ ఇంజెక్షన్లకు కొరత ఉండేది కాదు. కానీ.. 2 నెలలుగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ ఇంజక్షన్లకు డిమాండ్‌ పెరిగింది. ప్రపంచంలో లిపిడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల వాటిని దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. అవసరం ఎక్కువగా ఉంది. ఓ వైపు దిగుమతి చేసుకుంటూనే ఉత్పత్తి సామర్థ్యం పెంచడం ద్వారా డిమాండ్‌ మేరకు ఇంజక్షన్లను అందుబాటులోకి ఉంచడానికి చర్యలు చేపట్టామని కేంద్రం చెబుతోంది. ఈ క్రమంలో నాట్కో ఫార్మాస్యూటికల్స్, ఆలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్, గుపిక్‌ బయోసైన్సెస్, ఎమెక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్, లిక్య సంస్థలకు ఆ ఇంజక్షన్ల ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. ఈ 10 సంస్థల ద్వారా దేశీయంగా జూన్‌ నాటికి 2,55,114 వయల్స్‌ అందుబాటులోకి వస్తాయి. జూన్‌ లో మిలాన్‌ ల్యాబ్స్‌ ద్వారా 3.15 లక్షల వయల్స్‌ దిగుమతి చేసుకుంటామని కేంద్రం చెబుతోంది. వీటితో కలిపి జూన్‌ నాటికి 5,70,114 ఇంజక్షన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. కానీ.. ఈ ఇంజక్షన్లు ఇప్పటికే బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడినవారికే సరిపోవని.. ఇకపై నమోదయ్యే కేసుల మాటేమిటని వైద్యనిపుణులు ఆందోళన చెందుతున్నారు.