Begin typing your search above and press return to search.

క‌రోనాను మించిన ద‌డ‌.. ఏపీని కుదిపేస్తున్న బ్లాక్ ఫంగ‌స్‌!

By:  Tupaki Desk   |   19 Sep 2021 4:08 PM GMT
క‌రోనాను మించిన ద‌డ‌.. ఏపీని కుదిపేస్తున్న బ్లాక్ ఫంగ‌స్‌!
X
క‌రోనా ఈ ప్ర‌పంచాన్ని కుదిపేసిన విష‌యం తెలిసిందే. అయితే.. క‌రోనా.. మ్యూటేష‌న్ అనేక రూపాల్లో బాధితుల‌పై ప్ర‌భావం చూపింది. ఈ క్ర‌మంలోనే బ్లాక్ ఫంగ‌స్‌(మ్యుకర్‌ మైకోసిస్‌) .. క‌రోనా బాధితుల‌కు శాపంగా మారింది. క‌రోనా వ‌చ్చి.. న‌య‌మైన వారిలో చాలా త‌క్కువ మందికే బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చినా.. దీనివ‌ల్ల క‌ళ్లు పోయిన వారు.. ప్రాణాలు పోయిన వారు కూడా ఉన్నారు.. అదేస‌మ‌యంలో దీనికి చికిత్స కోసం.. భారీగా ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి కూడా వ‌చ్చింది. ఇలా.. క‌రోనాను మించిన విధంగా బ్లాక్ ఫంగ‌స్ భ‌య పెట్టింద‌నే చెప్పాలి. దీనికి మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా మిన‌హాయింపు కాకుండా పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం.

వాస్త‌వానికి ఏపీలో బ్లాక్ ఫంగ‌స్‌ సోకింది అతికొద్దిమందికే అయినా బాధిత కుటుంబ సభ్యుల‌ను వ‌ణించింద‌నే చెప్పాలి. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొదటి, సెకండ్‌ వేవ్‌ కలిపి 20 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు.. అంటే.. క‌రోనా అనంత‌రం వ‌చ్చిన మ్యూటేష‌న్‌.. కేవలం 0.24 శాతం మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన కేసులను బట్టి చూస్తే.. ప్రతి 10 వేల మందిలో ఇద్దరికి బ్లాక్ ఫంగ‌స్ సోకింది. కానీ వెయ్యి మందికి చేసిన చికిత్స ఖ‌ర్చు ఈ ఇద్దరికే అయినట్టు అంచనా వేశారు. ఖరీదైన మందులు, దీర్ఘకాలం మందులు వాడాల్సి రావడం దీనికి కారణమ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికీ 337 మంది బాధితులుగానే!

ఈ బ్లాక్‌ ఫంగస్ జబ్బుకు ఇప్పటికీ 337 మందికి చికిత్స కొనసాగుతూనే ఉంది. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బాగా తగ్గుముఖం పట్టినా దీర్ఘకాలిక చికిత్స చేయాల్సి ఉన్నందున చికిత్సను కొనసాగించాల్సి వస్తోంది. రోగులు పూర్తిగా కోలుకునే వరకూ నెలల తరబడి చికిత్స చేయాల్సి ఉంటుంది. దీనికోసం యాంఫొటెరిసిన్ బీ, పొసకొనజోల్‌ ఇంజక్షన్లతో పాటు పొసకొనజోల్‌ మాత్రలూ తరచూ ఇవ్వాల్సి ఉంది.

క‌రోనాలో గుంటూరు.. బ్లాక్ ఫంగ‌స్‌లో చిత్తూరు!!

క‌రోనా కేసుల్లో క‌ర్నూల జిల్లా త‌ర్వాత గుంటూరు టాప్‌లో నిలిచిన విష‌యం తెలిసిందే. అన్ని ఆసుప‌త్రులు నిండిపోయి.. రోగులను ప‌క్క జిల్లాల‌కు.. పొరుగు రాష్ట్రాల‌కు కూడా త‌ర‌లించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు బ్లాక్ ఫంగ‌స్ విషయంలోనూ గుంటూరు టాప్ 2లో ఉంది. ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న బ్లాక్ ఫంగ‌స్ కేసుల్లో 337 మంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా 132 మంది గుంటూరు జిల్లాలోనే ఉన్నారు. ఎక్కువ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 804 చిత్తూరు జిల్లాలో నమోదయ్యాయి. ఇది సోకిన బాధితుల్లో అత్యల్పంగా ఒకే ఒక్కరు విజయనగరం జిల్లాలో మృతిచెందారు. ఈ జిల్లాలో ఇప్పటివరకూ నమోదైంది కూడా 26 కేసులే. కోవిడ్‌తో పాటు బ్లాక్‌ ఫంగస్‌నూ ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. బ్లాక్‌ఫంగస్‌ మందుల కోసమే ప్రభుత్వం రూ.110 కోట్లు వ్యయం చేసిన‌ట్టు వైద్య ఆరోగ్య శాఖ చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.