Begin typing your search above and press return to search.

అల‌ర్ట్ః ఏపీలో విస్త‌రిస్తున్న‌ బ్లాక్ ఫంగస్‌!

By:  Tupaki Desk   |   21 July 2021 11:30 PM GMT
అల‌ర్ట్ః  ఏపీలో విస్త‌రిస్తున్న‌ బ్లాక్ ఫంగస్‌!
X
ఇన్నాళ్లూ క‌రోనాతోనే బెంబేలెత్తి పోతే.. ఇప్పుడు బ్లాక్ ఫంగ‌స్ వ‌ణికిస్తోంది. మ్యూకోర్ మైకోసిస్ ఇన్ఫెక్ష‌న్ గా పిలిచే బ్లాక్ ఫంగ‌స్.. ఏపీలో క్ర‌మంగా విస్త‌రిస్తోంది. మొద‌ట్లో.. ఉత్త‌ర భార‌తంలోనే ఎక్కువ‌గా బ‌య‌ట‌ప‌డ్డ ఈ కేసులు.. ఆ త‌ర్వాత సౌత్ కు సైతం విస్త‌రించాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్న ఈ ఫంగ‌స్ కార‌ణంగా.. ఛాతిలో నొప్పి, ఊపిరి అంద‌క‌పోవ‌డం, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

అయితే.. ఈ వైర‌స్ కార‌ణంగా చూపు కోల్పోయే ప్ర‌మాదం ఉండ‌డంతో.. ఆందోళ‌న మ‌రింత తీవ్ర‌మ‌వుతోంది. చూపుకోల్పోవ‌డంతోపాటు నోట్లో ఫంగ‌స్ తీవ్రంగా వ్యాపించి ద‌వ‌డ తీసేయాల్సి రావ‌డం వంటి విప‌రీతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కొవిడ్ చికిత్స తీసుకున్న వారికి ఎక్కువ‌గా స్టెరాయిడ్స్ వాడిన‌ప్పుడు ఇమ్యూనిటీ దెబ్బ‌తిన‌డంతో.. ఈ ఫంగ‌స్ వ్యాపిస్తోంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఏపీలోని విశాఖ జిల్లాలో క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతున్నా.. బ్లాక్ ఫంగ‌స్ కేసులు మాత్రం నిత్యం పెరుగుతున్నాయి. అదే స‌మ‌యంలో.. బ్లాక్ ఫంగ‌స్ మ‌ర‌ణాలు కూడా పెరుగుతూ ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప్ర‌స్తుత లెక్క‌ల ప్ర‌కారం.. ఇప్ప‌టి వ‌ర‌కు విశాఖ జిల్లాలో 350 మంది వ‌ర‌కు బ్లాక్ ఫంగ‌స్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో 32 మంది వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన‌ట్టు అధికారులు చెబుతున్నారు.

థ‌ర్డ్ వేవ్ విజృంభించే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిక‌లు రావ‌డంతోపాటు.. కేసులు కూడా పెరుగుతున్న నేప‌థ్యంలో.. ఈ త‌ర‌హా ప‌రిస్థితులు క‌నిపిస్తుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కొవిడ్ నుంచి భ‌య‌ట‌ప‌డిన‌వారు చ‌క్క‌టి ఆహారం తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌డం, కంటినిండా నిద్ర‌పోవ‌డం, భ‌య‌ప‌డ‌కుండా ఆనంద‌మైన జీవితాన్ని సాగించ‌డం ద్వారా ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వొచ్చ‌ని చెబుతున్నారు నిపుణులు.