Begin typing your search above and press return to search.

ఆటో డ్రైవ‌ర్ వ‌ద్ద 65 ల‌క్ష‌లు

By:  Tupaki Desk   |   11 Dec 2016 8:45 AM GMT
ఆటో డ్రైవ‌ర్ వ‌ద్ద 65 ల‌క్ష‌లు
X
పెద్ద నోట్ల వ్య‌వ‌హారం కొంద‌రి పంట పండిస్తోంది.ఇప్ప‌టికే పోస్టల్ శాఖ‌కు చెందిన కొంద‌రిని పోలీసులు అరెస్టు చేయ‌గా..తాజాగా ఇది మ‌రో మలుపు తిరిగింది. బషీర్‌బాగ్ పరిశ్రమల భవన్ సబ్ పోస్టుమాస్టర్ జనార్దన్‌రెడ్డి,సీనియర్ సూపరింటేండెంట్ సుధీర్‌బాబుతో కలిసి కమీషన్ పద్ధతిలో రూ.80 లక్షల నోట్లు మార్చినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇటు ఇబ్రహీంపట్నంలో ఆటోడ్రైవర్ తులసీరాం నాయక్ ఇంట్లో సుధీర్‌బాబుకు చెందిన రూ.65.66 లక్షల నగదును సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పెద్ద నోట్ల రద్దుతో పోస్టాఫీసుకు వచ్చిన నగదుతో కమీషన్ దందా చేసిన హైదరాబాద్ సిటీ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ పోస్టల్ అధికారి సుధీర్‌బాబు వ్యవహారంలో మరో కేసు నమోదైంది. సబ్ పోస్టుమాస్టర్ కే జనార్దన్‌రెడ్డి కమీషన్ పద్ధతిలో నగదు మార్చినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. సుధీర్‌బాబుతో కలిసి జనార్దన్‌రెడ్డి రూ.80 లక్షల కొత్త కరెన్సీ నోట్లు పక్కదారి పట్టించినట్టు అధికారులు ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న జనార్దన్‌రెడ్డి కోసం గాలిస్తున్నామని సీబీఐ వర్గాలు తెలిపాయి. జనార్దన్‌రెడ్డి, సుధీర్‌బాబులపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుతో పోస్టల్ నగదు మార్పిడిలో సీబీఐ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. పోస్టల్ సిబ్బంది, ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నాక ఇప్పటివరకు రూ.92.68 లక్షల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ అధికారులు వివరించారు.

పాత నోట్లకు 30 శాతం కమీషన్‌తో కొత్త నోట్లు ఇచ్చిన సుధీర్‌బాబు ఆ నగదును హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలో ఓ ఆటోడ్రైవర్ ఇంట్లో దాచిపెట్టాడు. సుధీర్‌బాబుకు తెలిసిన దువ్యానాయక్ అనే స్నేహితుడు బంధువు తులసీరాం నాయక్ ఇబ్రహీంపట్నం మంచాలరోడ్డు ప్రగతినగర్‌లో ఉంటున్నాడు. ఆటోడ్రైవర్ తులసీరాం ఇంట్లో ఈ నగదు పెడితే ఎవరికి అనుమానం రాదని భావించాడు. ఈ విషయాన్ని సీబీఐ అధికారులకు సుధీర్‌బాబు చెప్పగా, ఆ రోజు సాయంత్రం తులసీరాం ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంట్లోని బట్టలమూటలో ఉన్న 65.66 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తులసీరాం ఇంట్లో సుధీర్‌బాబు కమీషన్ నగదు 65.66 లక్షల నగదు గత 14 రోజులుగా ఉన్నది. ప్రగతినగర్‌లో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడంపై స్థానికంగా కలకలం రేగింది. ఇంత పెద్ద మొత్తంలో సుధీర్‌బాబు నోట్ల మార్పిడి ఎవరికి చేశాడన్న కోణంలో సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

మ‌రోవైపు వారం రోజుల క్రితం నారాయణగూడలో పట్టుబడ్డ రూ.95 లక్షల నగదు కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. పాత నోట్లు తీసుకొని కమీషన్ పద్ధ్దతిలో కొత్త నోట్లు చేరవేసేందుకు ప్రయత్నించినట్టు పట్టుబడ్డ ముఠా విచారణలో తెలిపింది. అయితే ఎవరి కోసం ఈ నగదు మార్చేందుకు ప్రయత్నించారు? వారికి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నగదుతో పాటు వారి వద్ద ఇంకెంత నల్ల ధనం ఉంటుందన్న కోణంలో సీబీఐ వర్గాలు ఆరాతీస్తున్నాయి. ఈ నగదు వ్యాపారులదని, రెండు పార్టీలు చేతులు మారి తమ వద్దకొచ్చిందని ప్రాథమిక విచారణలో నిందితులు వెల్లడించినట్టు నారాయణగూడ పోలీసుల ద్వారా తెలిసింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు మార్చేందుకు ఒప్పుకున్న పార్టీ ఎవరు? వారికి కొత్త నోట్లు ఎలా వచ్చాయన్న కోణంలో సీబీఐ అధికారులు విచారించనున్నారు.