Begin typing your search above and press return to search.

విదేశాల‌కు వేల కోట్లు వెళ్లిపోతున్నాయ‌ట‌!

By:  Tupaki Desk   |   27 Nov 2017 5:06 AM GMT
విదేశాల‌కు వేల కోట్లు వెళ్లిపోతున్నాయ‌ట‌!
X
మోడీ అధికారంలోకి వ‌స్తే చాలు.. విదేశాలకు తీసుకెళ్లి దాచేసిన కోట్లాది రూపాయిల బ్లాక్ మ‌నీని భార‌త్‌కు తెచ్చేస్తాన‌ని.. వాటిని భార‌తీయుల ఖాతాలోకి వేసేస్తాన‌ని చెప్పిన మోడీ మాట‌ల్ని న‌మ్మేయ‌ట‌మే కాదు.. ఓట్లు గుద్ది పారేశారు. మోడీ అధికారంలోకి వ‌చ్చి దాదాపు నాలుగేళ్లు ద‌గ్గ‌ర ప‌డుతున్న ప‌రిస్థితి. ఇప్ప‌టి వ‌ర‌కూ దేశం నుంచి త‌ర‌లివెళ్లిన కోట్లు ఏమో కానీ ఒక్క పైసా తిరిగి తీసుకొచ్చింది లేదు.

బ్లాక్ మ‌నీ ముచ్చ‌ట‌ను ప‌క్క‌న పెడితే.. వైట్ మ‌నీ సైతం ఫారిన్‌కు త‌ర‌లిపోతున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మోడీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన త‌ర్వాత విదేశాల‌కు న‌గ‌దు పంపించుకునే విష‌యంలో ఉన్న ఆంక్ష‌ల్ని స‌వ‌రించారు. ఫారిన్‌కు పంపే న‌గ‌దు విలువ‌ను భారీగా పెంచేస్తూ రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణ‌యం తీసుకుంది. గ‌తంలో ఉన్న ప‌రిమితుల‌కు భిన్నంగా స‌ర‌ళీకృత చెల్లింపుల ప‌థ‌కం కింద ఏటా పంపే న‌గ‌దు విలువ‌ను ప‌దిరెట్లు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.

అప్ప‌టి నుంచి విదేశాల‌కు పంపే న‌గ‌దు విలువ అంత‌కంత‌కూ పెరుగుతుంద‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. 2015 జూన్ లో సుమారు రూ.915 కోట్లు విదేశాల‌కు త‌ర‌లిపోగా.. 2017 సెప్టెంబ‌రు నాటికి ఈ మొత్తం రూ.7100 కోట్లకు చేరిన‌ట్లు తేలింది. 2015తో పోలిస్తే 2017 నాటికి విదేశాల‌కు త‌ర‌లివెళ్లే న‌గ‌దు 8 రెట్లు పెరిగిన‌ట్లుగా ఇన్ స్టారెమ్ నివేదిక తేల్చింది.

ఇక‌.. వార్షిక లెక్క‌ల్లోనూ భారీ వ్య‌త్యాసం న‌మోదైన విష‌యాన్ని స‌ద‌రు నివేదిక వెల్ల‌డించింది. 2015 ఏడాదిలో విదేశాల‌కు బ‌దిలీ అయిన న‌గదు రూ.10,400 కోట్లు అయితే.. 2016 నాటికి విదేశాల‌కు బదిలీ అయిన మొత్తం రూ.30వేల కోట్ల‌కు పెర‌గ‌టం గ‌మ‌నార్హం. ఇంత భారీగా న‌గ‌దు బ‌దిలీ ఎందుకు జ‌రిగింది? దేని కోసం ఇంత మొత్తాన్ని బ‌దిలీ చేస్తున్నార‌న్న విష‌యాన్ని చూస్తే ఆస‌క్తిక‌ర అంశాలు క‌నిపిస్తాయి. విదేశాల‌కు బ‌దిలీ అయిన న‌గ‌దు మొత్తంలో అత్య‌ధిక భాగంగా విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కేన‌ని స‌ద‌రు నివేదిక వెల్ల‌డించింది.

విదేశీ ప‌ర్య‌ట‌న‌ల కోసం 31.43 శాతం.. విదేశాల్లో ఉన్న‌స‌న్నిహితుల జీవ‌నానికి 26.55 శాతం.. విదేశాల్లో విద్య కోసం 18.88 శాతం ఖ‌ర్చు చేసిన‌ట్లుగా తేలింది. మ‌రో ఏడు సంవ‌త్స‌రాల వ్య‌వ‌ధిలో ఇప్పుడున్న బ‌దిలీ అవుతున్న దానికి భారీగా న‌గ‌దు బ‌దిలీ కావ‌టం ఖాయ‌మంటున్నారు. 2024 నాటికి ఏటా రూ.1.60ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కూ విదేశాల‌కు న‌గ‌దు బ‌దిలీ కావ‌చ్చ‌న్న అంచ‌నాను వ‌ర‌ల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ అంచ‌నా వేస్తోంది.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమింటంటే.. విదేశాల్లో ఆస్తుల కొనుగోలు విష‌యంలోనూ భార‌తీయులు ఆస‌క్తి పెరుగుతుంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. 2017-18 తొలి ఐదు నెల‌ల్లో విదేశాల్లో ఆస్తుల కొనుగోలు కోసం దేశం నుంచి పంపిన మొత్తం ఏకంగా 23.5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని తేలింది. ఇలా ప‌లు కోణాల్లో న‌గ‌దును బ‌దిలీ చేస్తున్న వైనం అంత‌కంత‌కూ పెరుగుతోది. చూస్తుంటే.. విదేశాల నుంచి రావాల్సిన మొత్తం పైసా రాకున్నా.. విదేశాల‌కు అధికారికంగా బ‌దిలీ అవుతున్న మొత్తం వేల కోట్ల నుంచి ల‌క్ష‌ల కోట్ల దిశ‌గా ప‌రుగులు తీయ‌టం గ‌మ‌నార్హం.