Begin typing your search above and press return to search.

హైదరాబాదీయుల్లో షాకింగ్ కోణాన్ని చెప్పిన జైట్లీ

By:  Tupaki Desk   |   2 Oct 2016 4:47 AM GMT
హైదరాబాదీయుల్లో షాకింగ్ కోణాన్ని చెప్పిన జైట్లీ
X
ఒక షాకింగ్ కోణమిది. పలు అంశాలకు సంబంధించి హైదరాబాదీయుల గురించి గొప్పలు చెప్పుకున్నా.. తాజా విషయంలో టాప్ లో నిలిచినా గొప్పగా అయితే చెప్పలేని వ్యవహారమిది. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా వెల్లడించారు. ఈ వివరాలు విన్న వెంటనే.. హైదరాబాదీయుల్లో ఇలాంటి కోణం ఉందా? అని ముక్కున వేలేసుకునే పరిస్థితి. దేశంలో మహా.. మహా నగరాలకు మించిపోయిన తాజా కోణం ఏమిటన్నది చూస్తే..

బ్లాక్ మనీని వెలికి తీసేందుకు మోడీ సర్కారు చేపట్టిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి కార్యక్రమం సెప్టెంబరు 30 అర్దరాత్రి ముగిసిన సంగతి తెలిసిందే. బ్లాక్ మనీని వెనకేసిన వారు.. తమకు తాముగా స్వచ్చందంగా తమ బ్లాక్ మనీ వివరాలు తెలియజేసి.. అందులో 45 శాతం మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించిన పక్షంలో భవిష్యత్తులో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవటంతో పాటు.. వారి వివరాల్ని ఎప్పటికీ బయట పెట్టమంటూ ఐడీఎస్ పథకాన్ని ప్రవేశ పెట్టటం తెలిసిందే. నెలల పాటు సాగిన ఈ పథకం తాజాగా ముగిసింది. దీనికి సంబంధించిన వివరాల్ని జైట్లీ తాజాగా వెల్లడించారు.

మోడీ సర్కారు ప్రకటించిన ఐడీఎస్ పథకానికి భారీ స్పందన వచ్చినట్లుగా జైట్లీ ప్రకటించారు.దేశ వ్యాప్తంగా 64,275 మంది తమ ఆక్రమ ఆదాయాన్ని బయట పెట్టారు. ఇలా బయటపెట్టిన నల్లధనం మొత్తం విలువ రూ.65,250 కోట్లు. ఇందులో రూ.29,362 కోట్లు భారత సర్కారు బొక్కసానికి చేరనున్నాయి. ఇప్పటికిప్పుడు (ఈ ఆర్థిక సంవత్సరంలో) అయితే రూ.14,700 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. ఇక ఈ ఇష్యూలో షాకింగ్ కోణం ఏమిటంటే.. దేశ వ్యాప్తంగా నల్లధనాన్ని వెల్లడించిన వారిలో అత్యధికులు హైదరాబాద్ మహానగరానికి చెందిన వారు ఉండటం. దేశ ఆర్థిక రాజధానిగా చెప్పే ముంబయి మహానగరాన్ని సైతం బీట్ చేసి.. నల్లధనాన్ని ఆర్జించిన వారు తమ వివరాల్ని బయటపెట్టేశారని జైట్లీ వెల్లడించారు. హైదరాబాద్ సిటీ నుంచే దాదాపు రూ.13 వేల కోట్ల అప్రకటిత ఆదాయం వెల్లడైందని.. తర్వాతి స్థానాల్లో ముంబయి రూ.8500 కోట్లు.. ఢిల్లీ రూ.6500 కోట్లు.. కోల్ కతా రూ.4 వేల కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఈ పథకంలో తమ నల్లధన వివరాలు ప్రకటించిన వారు సగటున కోటి రూపాయిల మేర బ్లాక్ మనీ వివరాల్ని అందించినట్లుగా చెప్పొచ్చు.

ఆసక్తికరమైన మరో అంశం ఏమిటంటే.. బ్లాక్ మనీని గుట్టుచప్పుడు కాకుండా వెల్లడించటం కోసం 1951 నుంచి 1997 మధ్యలో దాదాపు పదిసార్లు ఇలాంటి పథకాన్ని ప్రకటించారు. వీటిల్లో 1985 -86 - 1997 సంవత్సరాల్లో ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి కార్యక్రమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత తాజాగా మోడీ సర్కారు జారీచేసిన ప్రకటననకు భారీ స్పందన వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. బ్లాక్ మనీకి సంబంధించి మోడీ సర్కారు సాధించిన మరో ఘనత ఏమిటంటే.. మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గడిచిన రెండేళ్లలో ఐటీ శాఖ భారీగా సోదాలు నిర్వహించటమే కాదు.. రూ.56,378 కోట్ల ఆక్రమాస్తుల్ని బయటకు తీసుకొచ్చింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని మరో రూ.16 వేల కోట్లను గుర్తించటం లాంటి కార్యక్రమాలతో స్వచ్ఛంద ఆదాయాన్ని ప్రజలు పెద్ద ఎత్తున ప్రకటించటానికి కారణమై ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. బ్లాక్ మనీని వెల్లడించిన వారిలో హైదరాబాదీయులు భారీగా ఉన్న వైనం చూస్తే.. హైదరాబాదీయుల్లో కనిపించని ‘సంపన్నులు’ ఓ రేంజ్లో ఉన్నారన్న మాట.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/