Begin typing your search above and press return to search.

సైబ‌రాబాద్‌ లో పేలుడు..తీవ్ర‌త ఎంత ఎక్కువంటే..?

By:  Tupaki Desk   |   14 July 2018 4:25 AM GMT
సైబ‌రాబాద్‌ లో పేలుడు..తీవ్ర‌త ఎంత ఎక్కువంటే..?
X
ప్ర‌ధాన మీడియాలో ఒక్క మీడియా సంస్థ మాత్ర‌మే ప‌ట్టించుకుంది కానీ.. మ‌రే మీడియా దృష్టిని ఆక‌ర్షించ‌ని ఈ ఉదంతం తీవ్ర‌త‌కు ల‌క్ష‌లాది మంది సైబ‌రాబాద్ ప్ర‌జ‌లు ఉలిక్కిప‌డ్డారు. శుక్ర‌వారం సాయంత్రం సుమారు 6.50 గంట‌ల స‌మ‌యంలో పెద్ద శ‌బ్ధం. ఏదో పిడుగు ప‌డిన‌ట్లు మోత‌. కిటికీలు అదిరిన‌ట్లు శ‌బ్దం వ‌చ్చింది. అయితే.. అది కేవ‌లం రెండంటే రెండు సెక‌న్లు మాత్ర‌మే.

ఊహించ‌ని ఈ ప‌రిణామానికి ఒక్క‌సారి ఉలిక్కిప‌డినా.. కిటీకీలో నుంచి చూసినోళ్లు.. బ‌య‌ట‌కు వ‌చ్చి వీధుల్లో చూసినోళ్ల‌కు ఏమీ క‌నిపించ‌లేదు. చుట్టూ ఉన్న ప‌రిస‌రాల‌న్నీ ప్ర‌శాంతంగా క‌నిపించాయి. ఆకాశం మ‌బ్బు ప‌ట్టి ఉండ‌టం.. ఎక్క‌డో పిడుగు ప‌డిందేమోన‌న్న భావ‌న‌లో ఎవ‌రి ప‌నుల్లో వారు ఉండిపోయారు. అయితే.. ఇలాంటి అనుభ‌వం ఎదురైన వారంద‌రికి కొన్ని గంట‌ల త‌ర్వాత తెలిసిన వైనం ఉలిక్కిప‌డేలా చేయ‌ట‌మే కాదు.. న‌గ‌రంలో నివ‌సించే ప్ర‌జ‌ల ప్రాణాలు ఎంత అపాయంలో ఉన్నాయ‌న్న విషయం అర్థ‌మైనంత‌నే వ‌ణికే ప‌రిస్థితి.

రెండంటే రెండు సెక‌న్ల పాటు పెను శ‌బ్దం.. కిటికీలు అదిరిన ప్రాంతానికి ప‌ది కిలోమీట‌ర్ల దూరంలో (ఘ‌ట‌న చోటు చేసుకున్న నాలుగు దిక్కులా ఇదే ప‌రిస్థితి అంటున్నారు) ప‌రిస్థితి మ‌రింత భీత‌వాహంగా ఉంది. సైబ‌రాబాద్ ప‌రిధిలోని పుప్పాల‌గూడ నిమిలి న‌గ‌ర్ స‌మీపంలో ఫీనిక్స్ సెజ్ లో ఈ పేలుడు చోటు చేసుకుంది.

పేలుడు జ‌రిగిన ప్రాంతానికి ప‌ది కిలోమీట‌ర్ల దూరానికే శ‌బ్దం వినిపించిన‌ప్పుడు.. ఘ‌ట‌నా స్థ‌లంలో ప‌రిస్థితి ఎలా ఉందన్న‌ది చూస్తే.. కాసేపు షాక్ తినాల్సిందే. ఈ పేలుడు తీవ్ర‌త‌కు టిప్ప‌ర్ ఒక‌టి 30 అడుగుల ఎత్తుకు ఎగిరి ప‌డ‌ట‌మే కాదు.. తునాతున‌క‌లై.. దాదాపు అర‌కిలోమీట‌ర్ వ‌ర‌కూ వీటి శ‌కలాలు ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. ఇంత పేలుడు ఎలా చోటు చేసుకుంది? దీనికి కార‌ణం ఏమిట‌న్న‌ది చూస్తే.. సెజ్ లో నిర్మాణానికి అడ్డుగా భూమిలో ఉన్న రాతిని బ్లాస్ట్ చేసేందుకు డిటోనేట‌ర్ల‌ను తీసుకొచ్చారు. అధికారికంగా అనుమ‌తి తీసుకున్న‌ప్ప‌టికీ.. వాటిని తీసుకొచ్చిన విధానంలో ప్ర‌ద‌ర్శించిన నిర్ల‌క్ష్యం భారీ పేలుడుకు కార‌ణ‌మైంద‌ని తెలుస్తోంది.

అదృష్ట‌వ‌శాత్తు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు లేవు కానీ.. ఒక‌వేళ ఉండి ఉంటే మాత్రం దారుణ‌మైన ప‌రిస్థితులు చోటు చేసుకునేవ‌న్న అభిప్రాయాన్నిపోలీసు అధికారులు త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చెప్పుకోవ‌టం గ‌మ‌నార్హం. డిటోనేట‌ర్లు లాంటి శ‌క్తివంత‌మైన పేలుడు ప‌దార్థాల్ని తీసుకొచ్చేట‌ప్పుడు ప్ర‌త్యేకమైన వాహ‌నంలో.. పలు జాగ్ర‌త్త‌లు తీసుకొని రావాల్సి ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా టిప్ప‌ర్ లో పెద్ద ఎత్తున తీసుకొచ్చార‌న్న మాట వినిపిస్తోంది.

టిప్ప‌ర్ లో నుంచి డిటోనేట‌ర్ల‌ను ఉంచి.. డ్రైవ‌ర్‌.. మ‌రొక‌రు ప‌క్క‌కు వెళ్లినప్పుడు ఈ పేలుడు చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి టిప్ప‌ర్‌ తునాతున‌క‌లై.. చివ‌ర‌కు ఒక భారీ రేకు ముక్క‌లా మారింద‌ని చెబుతున్నారు. ఈ మొత్తం ఘ‌ట‌న‌లో అదృష్టం ఏమంటే.. టిప్ప‌ర్ డ్రైవ‌ర్‌..అక్క‌డే ఉన్న మ‌రొక‌రు దానికి దూరంగా వెళ్లి మాట్లాడుకుంటున్న వేళ‌లో పేలుడు చోటు చేసుకోవ‌టంతో గాయాలు మాత్ర‌మే అయ్యాయి. ఒక‌వేళ టిప్ప‌ర్ కానీ ఒక గంట ముందు వ‌చ్చి ఉంటే.. ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు పోయేవ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ సెజ్ లో నిత్యం 300 మంది వ‌ర‌కూ నిర్మాణ రంగ కూలీలు ప‌ని చేస్తుంటారు. వారంతా ఆరు గంట‌ల‌కు వెళ్లిపోవ‌టం..వారు వెళ్లిన 50 నిమిషాలు (సుమారు) ఈ భారీ పేలుడు చోటు చేసుకోవ‌టం పెద్ద ఎత్తున ప్రాణాలు పోకుండా నిలువ‌రించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదిలా ఉంటే.. ఈ నిర్మాణానికి కాస్త దూరంలో ఉన్న ఒక అపార్ట్ మెంట్ ప‌రిస్థితి దారుణంగా మారింది. పేలుడు తీవ్ర‌త‌కు అందులోని లిఫ్ట్ ప‌ని చేయ‌టం మానేస్తే.. పోర్టికో కూలింది. ఇక‌.. అపార్ట్ మెంట్ అయితే భారీ అదిరిపాటుకు గురైనట్లు చెబుతున్నారు. అపార్ట్ మెంట్ లోని ప‌లు ఫ్లాట్ల‌లో న‌ష్టం వాటిల్లింది. 20 ఫ్లాట్లు ఉన్న ఈ అపార్ట్ మెంట్ కు దాదాపు రూ.కోటి మేర న‌ష్టం జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. ప్రాణాలు పోక‌పోవ‌టంతో దీని తీవ్ర‌త చాలామందికి అర్థం కాలేదు కానీ.. ఒక‌వేళ‌.. జ‌న‌స‌మ్మ‌ర్థం క‌లిగిన ప్రాంతంలో కానీ ఈ పేలుడు చోటు చేసుకుంటే.. త‌ద‌నంత‌రం చోటు చేసుకునే ప‌రిణామాలు గుర్తుకు వ‌స్తే.. వ‌ణికిపోవ‌టం ఖాయం. ఇదంతా చ‌దివిన త‌ర్వాత అనిపించేది ఒక్క‌టే.. ప్ర‌మాదం అంచున న‌గ‌ర‌జీవి జీవితం ఉంద‌న్న అభిప్రాయం క‌ల‌గ‌క మాన‌దు. ఎక్క‌డో ఎవ‌రో చేసిన నిర్ల‌క్ష్యం.. కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న వారు సైతం ఉలిక్కిప‌డేలా చేసిందంటే.. పేలుడు తీవ్ర‌త ఎంత‌న్న‌ది ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.....