Begin typing your search above and press return to search.

ఇరిగిరిగో ముఖ్యమంత్రులు...!!

By:  Tupaki Desk   |   26 Sep 2018 6:58 AM GMT
ఇరిగిరిగో ముఖ్యమంత్రులు...!!
X
ఇదో కొత్త సంప్రదాయం. ఇదో కొత్త పోకడ. ఇదో కొత్త ఆలోచన. ఇంతకీ ఇదేమిటి అనుకుంటున్నారా. ఏం లేదు. తాము అధికారంలోకి వస్తే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు? అనేది ముందుగానే ప్రకటించడం. ఇది ఇంతకు ముందు జాతీయ స్దాయిలో జరిగేది. ఇప్పుడు మాత్రం రాష్ట్రాలకు కూడా పాకింది. అలాగే ఫలానా వారిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించి వారి ఓట్లు కొల్లగొట్టిన తర్వాత వారిని కాకుండా తామే ముఖ్యమంత్రి స్ధానంలో కూర్చున్న ఘటనలు ఇక్కడి వారికి తెలుసు. అయితే ఇదంతా గతమని - ఇప్పుడు మాత్రం ఎవరిని ముఖ్యమంత్రి అభ్య‌ర్ధిగా ప్రకటిస్తే వారినే అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎంను చేస్తామని ఆయా పార్టీలు ప్రజలకు హామీ కూడా ఇస్తున్నాయి. సరే, ఇంతకీ విషయం ఏమిటంటే... బహుజన వామపక్ష కూటమిగా ఏర్పడిన వామపక్ష పార్టీలు - బీసీ సంఘాల పార్టీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించాయి. మలక్‌ పేట తెలుగుదేశం శాసనసభ్యుడు - బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించారు. మంగళవారం నాడు హైదరాబాద్‌ లో జరిగిన బహుజన వామపక్ష కూటమి సమావేశంలో సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఆర్.క్రష్ణయ్య అని ప్రకటించారు.

కాంగ్రెస్ - తెలుగుదేశం - వామపక్షాలు కలిసి మహాకూటమిగా ఏర్పాటవుతున్న క్రమంలో ఆర్.క్రష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్య‌ర్ధిగా ప్రకటించడం వివాదాస్పదం అవుతుందంటున్నారు. బీఎల్ ఎఫ్ సిఎం అభ్యర్ధిని ప్రకటించడంతో మహాకూటమిపై కూడా నీలినీడలు వీస్తున్నాయి. ఇది ఓ కొత్త పరిణామం. ఇక తెలంగాణ రాష్ట్ర సమితిపై కారాలు - మిరియాలు నూరుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును - ఆయన కుమారుడు తారక రామారావును తీవ్ర పదజాలంతో విమర్శించిన కొండా సురేఖకు భారతీయ జనతా పార్టీ ఓ భారీ ఆఫర్‌ను ఇచ్చిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేమింటే కొండా సురేఖ భారతీయ జనతా పార్టీలో చేరి వరంగల్ జిల్లాతో సహా ఇతర జిల్లాల్లో కూడా బిజెపీని గెలిపిస్తే పొత్తులు - ఎత్తులతో తాము అధికారంలోకి వస్తామని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. దీంతో కొండా సురేఖ భారతీయ జనతా పార్టీలో చేరి కాగల కార్యం చేస్తే ఆమె తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించాలన్నది కమలనాథుల ఆలోచనగా చెబుతున్నారు.

ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు వెళ్లిన కొండా దంపతులకు కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన స్పందన రాకపోతే భారతీయ జనతా పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్ధి ప్రతిపాదనను తెరపైకి తీసుకవచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇలా తెలంగాణలో ఇద్దరు కొత్త వ్యక్తులు ముఖ్యమంత్రి అభ్యర్ధి రేసులో పరుగులు తీస్తున్నారు. ముందస్తు ఎన్నికలు ఎన్నెన్నో సిత్రాలు చూపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసే లోగా ఇంకెన్ని సిత్రాలు చూడాల్సి - వినాల్సి వస్తుందోనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.