Begin typing your search above and press return to search.

రాజధాని అమరావతి అన్నప్పుడు బాబు యాపారం గుర్తులేదా?

By:  Tupaki Desk   |   13 July 2022 5:10 AM GMT
రాజధాని అమరావతి అన్నప్పుడు బాబు యాపారం గుర్తులేదా?
X
వినే వారు ఉండాలే కానీ చెప్పేటోళ్లు చెలరేగిపోతారని ఊరికే అనలేదేమో? తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే ఇదే భావన కలగక మానదు. తాజాగా ముగిసిన ఏపీ అధికారపక్ష వైసీపీ ప్లీనరీ సందర్భంగా పార్టీ అధినేత హోదాలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగించిన తీరు చూసినప్పుడు.. ఆయన తీరు ఆశ్చర్యానికి గురి చేయక మానదు. తన రాజకీయ ప్రత్యర్థులపై ఆయన చల్లే బురద.. ఆ సందర్భంగా తనకు తోచిన విషయాన్ని వెనుకా ముందు చూసుకోకుండా.. ఎంత కాన్ఫిడెంట్ గా చెబుతారన్న విషయాన్ని చూసినప్పుడు.. ఇలాంటివి ఆయనకు మాత్రమే సాధ్యమేమో? అన్న భావన కలుగక మానదు.

ఎందుకంటే.. 2019 ఎన్నికలకు ముందు నిర్వహించిన పలు సభల్లో ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందన్న విషయాన్ని పదే పదే నొక్కి చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. తర్వాత తన స్టాండ్ ను పూర్తిగా మార్చేసుకోవటమే కాదు.. మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకొచ్చి.. పీట ముడి వేసేయటం తెలిసిందే. తాజాగా జరిగిన ప్లీనరీలో తమ పార్టీకి చెందిన వారిని ఉద్దేశించి మాట్లాడిన జగన్.. "రాష్ట్రంలో మూడు ప్రాంతాలు ఉన్నాయి.

మూడు ప్రాంతాల ప్రజలకు ఆత్మగౌరవం ఉంది. మన రాష్ట్రంలో మరోసారి ఎలాంటి ఉద్యమాలు రాకుండా, అన్యాయం జరిగిందనే వాదనలకు అవకాశం ఇవ్వకుండా మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తున్నాం. ఇలా చేస్తే బాబు అండ్‌ కో వారి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి దెబ్బ పడుతుందని కుట్రలకు తెర లేపారు" అంటూ వ్యాఖ్యానించారు.

తాజా వ్యాఖ్యలు విన్నప్పుడు.. మరి ఈ తెలివి.. ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని నొక్కి వక్కాణించినప్పుడు ఏమైందన్నది అసలు ప్రశ్న. ఒకవేళ.. చంద్రబాబు అండ్ కోకు అమరావతిలో భారీగా భూములు ఉన్నాయే అననుకుంటే.. వాటితో వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారనుకుంటే.. దాన్ని ఆధారాలతో నిరూపిస్తే సరిపోతుంది కదా? గడిచిన మూడేళ్లుగా పవర్లో ఉన్న జగన్.. చంద్రబాబు అండ్ కో కు సంబంధించిన అమరావతి భూముల విషయాన్ని ఆధారాలతో ఎందుకు చూపించలేకపోయారు.

నిజంగానే భవిష్యత్తులో ఉద్యమాలు రాకూడదన్నదే నిజమైతే.. ఇదే విషయాన్ని 2019 ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు? తాను అధికారంలోకి వస్తే అమరావతిని రాజధాని కాకుండా చేస్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన జగన్.. ఇప్పుడు అలాంటి వాయిస్ తోనే.. మూడు రాజధానుల అవసరం బాబు అండ్ కో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అడ్డుకోవటంతో పాటు..

మూడు ప్రాంతాల వారికి న్యాయం చేయాలన్న విషయాన్ని అదే పనిగా చెప్పటం కనిపిస్తుంది. పాయింట్ అంతా ఏమంటే.. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే బాగుండేది కదా? అన్న ప్రశ్నకు సరైన రీతిలో జగన్ సమాధానం ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.